24, జూన్ 2013, సోమవారం

పంచుకోవడానికి పరభాష

పోయిన వారము నుడిలో వచ్చిన, నా వ్యాసానికి స్పందిస్తూ సుబ్బారావు గారు వ్రాసిన వ్యాసమునకు(http://www.andhrabhoomi.net/content/samagra-drishti) నా ప్రతిస్పందన. 
  • పంచుకోవడానికి పరభాష
  • 25/06/2013
పోయిన వారం వచ్చిన సుబ్బారావు గారి వ్యాసానికి, తిరుగుగా ఈ వ్యాసం వ్రాస్తున్నాను. సుబ్బారావు గారు పోయిన వారం చక్కగా ఇంగిలీషు నుడి యొక్క అక్కరను నొక్కి చెప్పినారు. మనము  నెనరు(అభిమానము)తోనో మరి ఇంకో కారణము వల్లనో సైన్సును తెలుగులో నేర్చినా ఏదో ఒక స్థాయిలో ఇంగిలీషుకి మారక తప్పదని చెప్పినారు. ఇంకా మరి కొన్ని విషయాలను కూడా వారు చెప్పినారు. వాటికి ఒక్కటొక్కటిగా నేను తిరుగు ఇస్తున్నాను. 

నిజానికి, నేను వ్రాసిన వ్యాసము మరీ పెద్దదిగా ఉండడము వలన దానిని దిద్దరి(ఎడిటర్) గారు కొంత కుదించడానికి చేసిన పూనికలో ఒక ముఖ్యమయిన విషయము జారిపోయింది. అదేమంటే, ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఇంటర్మీడియట్ నుండి ఇంగిలీషు మీడియములో చదవక తప్పదు అని. నేను అట్లా చదివిన వాడినే. ఒకప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రమే ఇంగిలీషు మీడియములో ఉండెడిది. ఆ కాలానికి అది సరి పోయింది. ఇప్పుడు ఇంగినీరింగు మెడిసిను మొ వాటి ఎంట్రన్సులు ఇంటర్మీడియేట్ తర్వాత నుంచే మొదలవుతున్నాయి. ఈ పరిస్థితిని మారుద్దామంటే ఇది మన ఒక్క రాష్ట్రంలోనిది మట్టుకే కాదు. జాతీయ స్థాయిలో కూడా ఉన్నది. దీనిని ఇప్పటికిప్పుడు చేయగలిగింది లేదు కావున ఇంటర్ నుండి ఇంగిలీషులో చదవడం అక్కర అని అంటున్నాను. దీనితో తెలుగు పిల్లలు మిగతా చోట్ల ఇమడగలుగుతారు. ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగు పడతాయి. రావుగారి మొదటి సగము వ్యాసానికి ఇదీ నా స్పందన. 

ఇంటర్ నుండి ఇంగిలీషు అంటే, పది దాకా తెలుగులో చదవమని కదా అర్థము. ఇది కూడా ఎందుకు? మొదటి నుంచే అంటే తొలిబడి నుంచే ఇంగిలీషులో నేర్పవచ్చు కదా  అంటే  అంత తొందరగా పరాయి నుడి నేర్పడము వలన రెంటికి చెడ్డ రేవడిలాగా అయిపోతారు పిల్లలు. ఇటు సరిగ్గా తెలుగు రాక అటు ఇంగిలీషు కూడా సరిగ్గా రాని, మొదటి నుంచీ ఇంగిలీషు చదివిన చాలా మంది స్నేహితులు నాకున్నారు.  ఈ ఇబ్బంది ఎందుకంటే, తగిన ఈడు రాక మునుపే వేరే నుడి నెత్తిన రుద్దడము వలన. అప్పుడు పిల్లలు చుట్టూ ఉన్న నుడి అయిన తెలుగులో అలోచించి ఇంగిలీషులో వ్రాస్తారు. అది ఎప్పటికీ మంచి ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి తొలి చదువులు ఒక స్థాయి వరకు మాతృభాషలోనే సాగాలి. ఈలోపు ఇంగిలీషు మీద పట్టు సాధించవచ్చు. ఆ స్థాయి పదవ తరగతి అనుకుంటే, అప్పటిదాకా కొంత సైన్సు ఉండక మానదు. ఆ సైన్సు మాటలు బాగా తెల్లము అవడము కొరకు వీలయినంత వరకు తెలుగులోనే ఉండాలి సంస్కృతములో కాదు అనేది నా వాదన. ఆ తెలుగు మాటలు ఎలా పుట్టించవచ్చో చూపినాను.    అది ఒక పూనిక మాత్రమే అనీ చెప్పాను.  అవే వాడాలి అని కట్టడ కాదు అని కూడా చెప్పినాను. 'కిరణజన్య సంయోగ క్రియ' వంటి గట్టి, పొడుగాటి సంస్కృత మాటలు  బాగా ఊహకు అంది, రావు గారికి తెలుగు మాటలు అస్సలు ఊహకు అందక పొతే నేనేమి చేసేది? సైన్సు, తెలుగు తెలిసి ఎంతో  అనుభవము ఉన్న రావు గారి వంటి వారు ఊహకు అందే తెలుగు మాటలు కల్పించినట్టయితే చాలా సంతోషిస్తారు అందరూ. 

నేను వ్రాసిన అంత పెద్ద వ్యాసము వట్టి పదవ తరగతి వరకు గల సైన్సు టర్మినాలజి గురించేనా అని అడగవచ్చు. అది మాములుగా, ఇంగిలీషు నుండి తెలుగు పేర జరుగుతున్న అనువాదము అంతటికీ వర్తిస్తుంది. తెలుగు నుండి  ఇంగిలీశుకీ మారవలసిన స్థాయిని ప్రయత్నంతో ముందుకూ జరుపుకుంటూ పోవచ్చు. రావు గారు అన్నట్టుగా ఏమిచేయకుండా కూర్చుంటే తన అంతట తాను అది కిందకి జరిగి ఒకప్పటికి ఒకటవ తరగతి కూడా తెలుగులో నేర్పలేని పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాతృభాషలో చదివిన విషయాలు తొందరగా ఒంటపడతాయనేది ఎవరూ కాదనలేని నిజము.

రావు గారు అన్నట్టు గ్రీకు, లాటిన్ వంటి భాషలనుండి మౌలిక పదజాలం గైకొన్నందు వలన కాదు శాస్త్ర్ విజ్ఞానము వ్యాపించిందీ, ఇంగిలీషు ప్రాధాన్యత పెరిగిందీ. అది బ్రిటను పెత్తనము పోగానే అమెరికా వచ్చి ఇంగిలీషు నుడికి అండగా నిలబడినందున. అది ఎవరి పెత్తనము నడుస్తున్నది అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అమెరికా పెత్తనము నడుస్తున్నది కావున ఇంగిలీషు వాడుతున్నాము. రేపు చైనా పెత్తనము పెరిగితే, చైనీసు నుడి నేర్చుకోవాల్సి వస్తుందేమో మనము.

 ప్రజల భాషలు శాస్త్రం చదవడానికి (టర్మినాలజి తయారు చేయడానికి) పనికి రావని రావు గారు చెప్పిన మాట నన్ను చాలా అచ్చెరువుకి గురిచేసింది. శాస్త్రం చదవడానికీ, ఆ శాస్త్ర మాటలు మారని భాషల నుండి(అంటే మన విషయములో, సంస్కృతము నుండి) మట్టుకే తీసుకోవాలంటే మరి జపనీసు, చినీసు, యూదు భాషల సంగతి ఏమిటి? వారంతా తమ తమ భాషలలోనే సైన్సు చదువుతున్నారు కదా. వాళ్ళు, ప్రపంచ భాష అయిన ఇంగిలీషులో చదువుతున్న మన కన్నా ఎంతో ముందున్నారు కదా. ఇంగిలీషు యొక్క అక్కరను నొక్కి చెపుతున్నట్టుగా అనిపించినా తమ వోటును సంస్క్రుతానికే వేసారు రావు గారు. ఇది వారికి సంస్కృతము మీద ఉన్న నెనరు(అభిమానము)నూ తెలుగు మీద ఉన్న చిన్న చూపునూ  తెలుపుతున్నది.  సంస్కృతమును ఎవరూ తెలుగు వారి నెత్తిన రుద్దలేదు అనడమూ, జన వ్యవహారములో లేని మాటలు (నేను వ్రాస్తున్న తెలుగు మాటలు) వాడడము ఎందుకు అనడమూ(వారు వాడుతున్న సంస్కృత మాటలు ప్రజలంతా ఒక్కరూ తప్పకుండా వాడుతున్నారా మరి?), 'అచ్చ తెలుగు పిచ్చి' అనే అభ్యతరకర మాట అనడమూ ఇందుకు సాక్ష్యాలు. ఇది సరి అయిన పధ్ధతి కాదు. సంస్కృతాన్ని తెలుగు నెత్తిన రుద్దినారా లేదా అన్నదీ ఎవరు రుద్దినారు అన్నదీ లోకమెల్ల ఎరిగిన విషయాలే. బ్రాకెట్లలో నేను అర్థములిస్తూ తెలుగ మాటలు వ్రాస్తున్నది , మరుగు పడిన తేట తెలుగు మాటలను వాడుకలోకి తేవడము కొరకె.  అందులో ఏవీ నా సొంత మాటలు కాదు. పత్రికల్లోనో పుస్తకాల్లోనో నేను చదివి నేర్చుకున్న మాటలే. తెలియని తెలుగు మాటలు ఒక్కటి కూడా నేర్చుకోవద్దూ సంస్కృత మాటలు తెలిసినా తెలియక పోయినా వాడేద్దామూ అనే వారికి నేను చెప్పగలిగిందేమీ లెదు. 

నిజానికి సైన్సు చదవడానికి పలానా  నుడి పనికి రాదు అని అనలేము. కావలసిందల్లా ఆ నుడిని వాడేవారు ఉండడమూ, ఆ నుడికి ఊతము అందిస్తూ ప్రభుత్వము ఉండడమూ. ఆ మంది ఎంత ఎక్కువగా ఉంది, ఆ ప్రభుత్వము ఎంత గట్టిగా ఉంటె సైన్సుని ఆ నుడిలో చదవడము గానీ, కొత్తది పుట్టించడము గానీ అంత తేలిక అవుతుంది. ఎవరికి వారే తమ సొంత భాషల్లో సైన్సు చదివితే మిగతా పప్రపంచముతో సంబంధము తెగిపోయి, ఒంటరి అవుతారు అని అనవచ్చు.  ఒకరికి తెలిసింది మరొకరితో పంచుకోవడానికి ఇంగిలీషు లాంటి నుడి ఉండనే ఉన్నది గదా. ఇప్పుడు జపాను వారూ, ఇజ్రాయెలు వారూ, ఇంకా పలు యూరోపు  దేశాల వారూ చెస్తున్నదదె. వారు తమ నుదిలోనే చదువుతూ వేరే వారితో ఇంగిలీషులో వారి జ్ఞానాన్ని ఇంగిలీషులో పంచుకుంటున్నారు.  ఒక్క మాటలో చెప్పాలంటే, మన సమాజము కొత్త విషయాలను లేదా వస్తువులను పుట్టించాలంటే, కనుగొనాలంటే మన నుడికి మించిన నుడి మరొకటి మనకు లేదు. అలా కాకుండా అవతలివారు కనిపెట్టిన దాన్ని మనము వాడుకోగలిగితే చాలునని అనుకుంటే, మన నుడిలో చదవనక్కర లేదు. అందుకు అవతలి వారి నుడి తెలిస్తే చాలు. ఏమి చేయాలో నిర్ణయించండి. 

2 కామెంట్‌లు:

  1. తెలుగులో పారిభాషిక పదకోశాలు వృత్తి పదకోశాలు తెలుగు అకాడెమీ విరివిగా ప్రకటించాలి!ఎవరయినా పుట్టిస్తేనేకదా పదాలు పుట్టేవి!వాడగావాడగా అవే అలవాటయిపోతాయి!తెలుగులో కొత్తమాటలు పుట్టించాలి!మేధావులు భాషా శాస్త్రవేత్తలు ఆలోచనాపరులు పాత్రికేయులు అందుకు కృషి చేయాలి!magnetism కి సూదంటుతనం ;wave length కి అలపొడవు బాగున్నాయి,నేనిప్పటినుంచి అవే వాడతాను!ప్రయోగించినాకొద్దీ భాష తెలుగుతనం సంతరించుకుంటుంది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా మప్పిదాలండి. అవును మీరన్నట్టు ఎవరైనా పుట్టిస్తేనే మాటలు పుడతాయి. మంది పుట్టించిన మాటలను ఎన్నింటినో కాదని కొత్త కొత్త సంస్కృత మాటలను తెలుగు పేరు మీద గుప్పిస్తున్నారు. వెతికితే మనమున్న మని నోటిలో మనకు తెలియని అబూరానికి గురి చేసే మాటలు ఎన్నో దొరకగలవు. మచ్చుకి, 'టికెట్ ఫేర్' అన్నదానికి 'కేవు' అనే శ్రీకాకుళము మాండలికపు మాట. ఇదే మాటకు మన నుడిగంటులలో పెద్ద పెద్ద సంస్కృత మాటలు కనిపిస్తాయి. మీ చుట్టూ ఉన్న వారి మాటలను మీరూ ఒక చోట కూర్చండి. తప్పక పనికి వస్తాయి.
      ఉంటాను.
      విజయ్

      తొలగించండి