31, మార్చి 2012, శనివారం

కొన్ని అచ్చ తెలుగు పదాలు

గురి=aim
eg.my aim is to become a teacher

మచ్చు:వెజ్జు కావడమే నా గురి

వెజ్జు=ఉపాధ్యాయుడు,teacher
ఒజ్జ=వైద్యుడు,doctor


నూరు=వంద,శతం 
నూరేడు=శతాబ్దం,century
విసాగు=సంస్కృతి,culture
తొలి=మొదటి,first
మలి=తర్వాతి,next
ఇరు=రెండు
అనిపింపు=భావన,feeling
జడుసుకొను,దడుసుకొను=భయపడు
పొత్తు=సంబంధం,relation
చుట్టము=బంధువు,relative
మగత=మత్తు
నెలవు=నిలయం,ఆలయం,abode
కొలువు=ఉద్యోగం,job
మట్టు=పద్ధతి
కూటము=సంఘము,association,
సీమ=ప్రాంతము,
నాడు=దేశము; నాడు=రోజు
ఏలిక=రాజు,ప్రభువు,ruler
తెల్లము=అర్థము,meaning
తేటగా=clearly
తేటపరచు=వివరించు,clarify
మాపటి సంది= సాయంత్రం నుండి
మొల,సీల,మేకు=nail
తీరు,రీతి=విధం,kind,type
ఆను,దన్ను=ఆధారము,evidence
ఆచూకి,జాడ =చిరునామా,address
చిక్కు=ప్రహేళిక,puzzle
ఆనిడిగా=స్వతంత్రంగా,independently
ముచ్చట=సంగతి,విషయము,matter
ఎల్లరకొక విన్నపము. మన బాసను మనము కాపాడుకుందాం. ఈ సంస్కృత, ఆంగ్ల వెల్లువలో పడి కొట్టుకొని పోకుండా, ఆ మోజులో పడి మగత చెందకుండా,అచ్చ తెలుగులోనే మాటలాడడానికి నడుం కట్టుదాం. కొందరిది చాదస్తం అనుకోవచ్చు. లోకమంతా ఒక చిన్న పల్లె లాగ మారిపోతున్న, ఈ యుగంలో, ఇదేమి వరస అని. ఎన్ని దేశాలేగినా, ఎంత గొప్పవాడివయినా, ఏదైనా గొప్ప ఇబ్బంది వచ్చినప్పుడు,దెబ్బ తగిలినపుడు, అమ్మను,అయ్యనే తలుచుకుంటామెందుకు? మనదంటూ మనకొకటుండాలి, మనకు సొంతమయింది. దేశపు నలుమూలలనుండి జనలొక చోట గుమిగూడితే, ఏ భాషవాళ్ళు ఆ భాషా గుంపుగా ఎందుకు విడిపోతారు మరి? ఆలోచించండి.ఇప్పుడు మన భాష అని మనమనుకుంటున్నది మనది కాదు. ఆ సంస్కృతీ మనది కాదు.మన మీద ఎన్నో నూరేళ్ళుగా బలవంతంగా రుద్దబడింది. మనవి అనుకుంటున్న ఆ పురాణాలనే అడగండి, చెపుతాయి, రక్కసులెవరో,దేవతలెవరో. తొలినుంచీ ఈ సీమలో బతుకుతున్నవారు రక్కసులు. బయటినుండి  వచ్చిన వారు,ఆక్రమణదారులు దేవతలు. అంతెందుకు బలి చక్రవర్తి గోస పరికించండి. అవే పురాణాలు ఆయన గొప్ప ఏలికనీ అంటాయి, కాని ఈ నేల మీద ఉండతగినవాడు కాదంటాయి.కాబట్టి నేరుగ ఎదురించలేక, మాయోపాయంతో, అడుక్కునే వాడిగా వచ్చిన ఒక మనిషి ఆయన్ను చంపాడు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు బలి. ఈ సంగతులన్నీ పని లేక చెప్పే మాటలని కొందరనడానికి ఎల్లవేళలా తయారుగా ఉంటారు. మన దేశాన్ని విడగొట్టడానికి జరుగుతున్న కుట్రగా కూడ చెప్పగల దొడ్డవారున్నరు. అంతే కదా ఉన్నమాట చెపితే ఉడుక్కోకుండా ఎలా ఉండగలరు? మన భాషను మట్టుగ మట్టుబెట్టిన వారిపై, ఇంకా అలా చేయడమే పనిగాగలిగినవారిపై, కత్తి దూసి, పోరుకు పోదామనడం లేదు. అయినకాడికి వొదిలేసి, ఇకనైనా మేలుకుని, 'మన ' తేనెలొలుకు తేట తెలుగు బాసను కాపాడుకుందామంటున్నను.
సెలవు

అచ్చ తెలుగు మీద

చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదివినందు వల్లనో, ఊరివాడనవడం వల్లనో తెలియదు కానీ, అచ్చ తెలుగు అంటే నాకు మక్కువ ఎక్కువ. చదువుల కోసం పట్నాలలో ఉండవలసి వస్తున్నది కాని, ఇంటికి పోయినప్పుడల్లా, ఊర్లో జనాలు మాట్లాడే పదాలను గమనిస్తుంటాను. తెలుగు భాషాచరిత్ర చదివినప్పటినుండి, ఈ యావ(కోరిక) మరీ ఎక్కువ అయ్యింది. చిన్నప్పుడు, మా సంస్కృతం పంతులు చెప్పేవారు 'ఎల్ల భాషలకు తల్లి సంస్కృతంబె ' అని.మనలో చాలా మందిమి ఇట్టనే (ఇలాగే) అనుకుంటూ ఉంటాము. అంతెందుకు, నేను కూడా మొన్న మొన్నటి దాకా అట్టా(అలాగే) అనుకున్నవాడినే. ఆర్యుల రాకకు ముందునుంచే, అంటే సంస్కృతం ఈ దేశానికి తెలియక మునుపే, ద్రావిడ భాషల తల్లి అయిన మూలద్రావిడ(లేదా, వేరుద్రావిడ, 'వేరు ': మొక్కవేరు) ఉన్నదన్న మాట ఎవరూ కాదనలేనిది. దానికి చాలా ఆధారాలు ఉన్నాయి.

 మనము తెలుగులో పెక్కు ('అనేక ', అనే సంస్కృత పదానికి సరి)సంస్కృత పదాలు, తద్భవాలు, తత్సమాలు చూసి అలా పొరపాటు పడుతుంటాము. పెద్దలు చెప్పేదేమిటంటే, సంస్కృతం ద్రావిడ భాషలలోకి పెక్కు మాటలను చొప్పించగా, ద్రావిడ భాషలు అంతకన్న ఎక్కువగా సంస్కృతమూ దాని తర్వాతి భాషలను వ్యాకరణరూపంలో ప్రభావితం చేసాయి. మచ్చుకు(='ఉదాహరణకు '), రేడియోలో వచ్చే సంస్కృత వార్తల చివర్లో 'ఇతి వార్తా:' అన్న మాటలో ఉన్న 'ఇతి ' అన్న నిర్మాణం ద్రావిడ భాషలనుండే వచ్చిందని చెప్తారు. కానీ మామూలు జనాలకు ఇవి తెలిసే సందు(అవకాశం) లేదు. మిగతా ద్రావిడ భాషలయినట్టి, తమిళం, కన్నడం కన్నా, తెలుగూ, మలయాళమూ, సంస్కృత పదాలను బాగా కలుపుకున్నాయి. అన్నింటికన్నా తమిళం చాల కొద్దిగా ప్రభావితం అయ్యింది. ఇందుకుగల కారణాలు పలు రకాలు. మొదటగా, తమిళనాడు బాగా దక్షిణములో ఉన్నది, మనకన్నా, కన్నడిగులకన్నా. కావున, ఉత్తరాన్నుంచి వచ్చిన ఆర్య భాషల ప్రభావం మొదటగా, ఎక్కువగా మన భాషమీదా, కన్నడం మీదా పడింది. మన దేశంలో రాత అనేది, మిగతా ప్రపంచంతో పోలిస్తే, చాలా జాగుగా(='ఆలస్యంగా ') పుట్టింది, అదీ కూడా , క్రీస్తుకు ముందు మూడువందల యేళ్ళకు, అంటే అశోకుని కాలంలో. అప్పుడు మనమూ, కన్నడిగులూ, అశోకుని పాలనలో ఉంటిమి. కానీ, తమిళులకు వారి రాజులే ఉండిరి, పాండ్యులు. ఏ భాష అయినా రాతకోతల్లో, అంటే రాజ్య వ్యవహారాలలో, శాసనాలలో కనిపించాలంటే, సాహిత్యం వెల్లివిరియాలంటే, రాజుల ప్రోత్సాహం తప్పనిసరి. అంతే కాకుండా, రాజభాష ప్రభావం, జనుల భాషమీద తప్పకుండా ఉంటుంది. మనకది లేకపొయె. తమిళులకది ఉండె. అదృష్టవంతులు వారు. వాళ్ళ రాజుల తమిళ సాహిత్యాన్ని ప్రోత్సహించారు. అప్పుడె కదా గొప్పదైనట్టి 'తిరుక్కురల్ ' రాయబడినది. 

అశోకుని తర్వాత మనలను ఏలిన శాతవాహనులు తెలుగు రాజులేనని మన పండితులు చెవులు చిల్లులు పడేలా డప్పుకొడతారు, ఎక్కడెక్కడినుంచో తలా తోకా లేని ఆధారాలను చూపిస్తూ. అదే నిజమైతే ఆరు వందల యేళ్ళకు పైగా ఏలిన వారు, వారి మాతృభాషయైన తెలుగును ఎందుకని ప్రోత్సహించలేదు? కనీసం అందులో ఒక్క రాజైనా ఒక పొత్తమో కబ్బమో వ్రాయలేదు. ఇది ఎటుకూడి తెలుగును సంస్కృతంతోనూ ఆర్యులతోనూ ముడిపెట్టాలని కొందరు చేసిన కుట్ర మాత్రమే. నాకు తెలిసినంత మట్టుకు,వరంగల్లు కాకతీయ ఏలికల కాలం దాకా తెలుగుకు ప్రోత్సాహం కొరవడింది.(ఈ వరంగల్లును (లేదా, 'ఓరుగల్లు ')గూర్చి ఒక చిన్న మాట. ఈ పట్టణానికి 'ఏకశిలానగరం' అని సంస్కృత పేరు. అంటే, ఒకే రాతి పట్టణమని తెలుగర్థం. తమిళంలో 'ఒరు ' అన్న మాటకు 'ఒక ' అని అర్థం. ఇంకా, 'కల్లు ' అనే మాటకు తెలుగులో, తాటి చెట్టునుంచి తీసే మత్తుద్రవమే కాకుండా, 'రాయి ' అన్న అర్థం కూడా ఉంది. మా అమ్మ ఇప్పటికీ 'కల్లుల ఉప్పు ', ' మెత్తటి ఉప్పు ' అని ఉప్పుని వేరు చేసి చెప్తుంది. కల్లుల ఉప్పు అంటే ముడి ఉప్పు అని, చిన్న చిన్న రాళ్ళలాగ ఉంటుందది. వెరసి(మొత్తం కలిపి), 'ఒరుకల్లు ', 'ఓరుగల్లు ' అయ్యిందని నేననుకుంటున్నాను). క్రీస్తు తర్వాత వెయ్యేండ్లకు గాని, తెలుగులో సాహిత్యం రాలేదంటే ఇదీ కారణం. ఇప్పటి కరీంనగర జిల్లాలోని వేములవాడవాసి అయినట్టి, పంప కవి(నన్నయ్య కంటే ముందువాడు) కన్నడ దేశం పోయి అక్కడ కన్నడంలో రాసి అక్కడీ 'ఆదికవి ' అవడానికి ఆ ప్రోత్సాహమే కారణం.

 తెలుగుకు రాజభాషగా చోటు దక్కేటప్పటికి, దేశంలో భక్తి ఉద్యమం ఊపందుకుంది. ఇంక మనవాళ్ళు సంస్కృత గ్రంథాల మీద పడ్డారు. వాటిని అనువదించడమే పనిగా పెట్టుకున్నారు. ఆ వరుసలో, పెక్కు సంస్కృత పదాలు తెలుగులోకి వచ్చి పడ్డాయి. కొన్ని సార్లు కవి గారి సంస్కృత అభిమానంవల్లనో, అనువాద పాటవలోపంవల్లనో, మరెందుచేతనో గాని లెక్కలేనన్ని పదాలు తెలుగులోకి ఊడిపడ్డాయి. రచనలన్నీ అలాంటివే అని కాదు, చాలమట్టుకు అని. ఇలా తెలుగులోకి వచ్చిన, తెచ్చిన పదాలు రామాయణ భారత భాగవతాల వల్ల జనాల నోళ్ళలోకి చేరాయి. దీని ప్రభావం రెండురకాలుగా ఉంది. ఒకటి, తెలుగు కలిమి గలదయ్యింది, పెక్కు మాటలతో. రెండవది, అప్పటికే ఉన్న అచ్చ తెలుగు పదాలు చాల మాయమయ్యి వాటి తావులో(దుక్కులో,చోటులో, స్థానంలో) సంస్కృత మాటలు వచ్చాయి. అది ఎంతగా పెరిగిందంటే, ఊర్లలోకి పోయి చూసినా కొన్ని మాటలకు తెలుగు పదమే వినిపించదు. అలాగని, సంస్కృత భాష అక్కడెక్కడ్నుచో, యూరపు నుంచి ఇప్పుడున్నట్టుగా దిగుమతి అయిన భాష కాదు. ద్రావిడ భాషలనుంచి కూడా చాలా పదాలు అందులోకి జొర్రాయి (ప్రవేశించాయి). మచ్చుకు, 'కదళీ ఫలం'= అరటి పండు. ఈ 'కదళి ' అన్న మాట ద్రావిడ భాషలనుంచే వెళ్ళిందని అంటారు. అదీ మన భాష మీద వేరే భాషల ప్రభావ గోల. ఇప్పుడు ఇంగిలీషు ప్రభావం కొత్తగా. ఇన్నాళ్ళూ, మన భాషని ఎవరూ ప్రోత్సహించలేదు అని గుండెలు బాదుకుని పెద్ద ప్రయోజనం లేదు.

 ఇప్పుడు మాత్రం మన భాషని ప్రోత్సహించడానికి ఒక రాష్ట్రం అంటూ ఒకటిఉన్నా పెద్దగా ఒరిగిన మేలు ఏమీ లేదు.. పేరుకు మాత్రమే అధికార భాష. ఏలినవారి రాతకోతలన్నీ ఆంగ్లమునందే జరుగును.ఎవరైనా అచ్చ తెలుగులొ మాట్లాడితె, వాడికి మర్యాద లేదంటారు. పుస్తకాలలో, 'గేదె ' అని ఉంది కాబట్టి, అదే ప్రామాణికం. ఎవడైనా, 'బర్రె ' అనో, 'ఎనుము ' అనో, అంటే, వాడు అనాగరికుడు.ఇక మన తెలుగు అకాడెమిది,పత్రికలది చిత్రమయిన దారి. వేరే భాషా పదాలను తెలుగులోకి అనువదించేటప్పుడు, వీలయితే తెలుగు మాటలనుండి, లేనట్లయితే, వేరే ద్రవిడ భాషా వాసనలున్నట్టి పదాల కలయికతో, కొత్త మాటల పుట్టుక, ఎలుపు(సృష్టి) జరగాలిగానీ, ఎట్టి చుట్టరికమూ లేని సంస్కృత పదాలతో కాదు. మచ్చుకు, ఇంగిలీషులోని, 'యూజర్ ' లేదా 'కస్టమర్ ' అన్న మాటకు 'వినియోగదారుడు ' కి బదులుగా 'వాడుకరి ' అని అనవచ్చు కదా. అలా అనరు. సంస్కృత భాషే కావాలి.ఎప్పుడైనా మీకు వీలు దొరికితే తెలుగు మీడియం సైన్సు పుస్తకాలను చూడండి. ఆ 'టర్మినాలజి ' లేదా 'పారిభాషిక పదాలు ' అర్థం తెలుసుకోవాలంటే, సంస్కృతం నేర్చుకోవలసిందే. వీటన్నిటికి వేరు కారణం(వేరు: చెట్టు వేరు) మన భాష గురించి మనం తక్కువగా అనుకోవడమే. తమిళులను చూసి నేర్చుకొవలసినది మనకు ఎంతో ఉంది.మనం తినే 'అన్నం ' ని 'కూడు ' /'బువ్వ ' అని అనవచ్చని మనలో ఎంతమందికి తెలుసు? 'కూడు ' అంటే,  తినే వంట. అలా ఎవరైన అంటే, వాళ్ళకు అస్సలు మర్యాద ఉండదు. కానీ మలయాళీలు తినడాన్ని,'కయిచ్చో ' అంటారు. అది మన 'కుడుచుట '(కుడవబడునది 'కూడు ') అనే మాటకు సరి. పొద్దాకా ఎదుటివాళ్ళను దుమ్మెత్తి పోయడమే కాకుండా, నా వంతుగా నేను చేయదలంచిన పని ఒకటుంది. అదేమంటే, నేను ఏగినంతవరకు(ప్రయాణించినన్ని) ఊర్లళ్ళో వినిపించే పదాలనన్నిటినీ(అచ్చ తెలుగువి) ఒక చోట కూర్చాలన్నది. మీరు కూడా మీకు చేతనైనంత చేయండి. మొదటగా మనము సిగ్గుపడకుండా తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నించాలి. మనది రెండు వేల యేళ్ళకు పైగా పాతదైన నుడి(భాష)యని గుర్తు పెట్టుకుందాం.ప్రపంచంలో సంగీతానికి అనువైన చాలా తక్కువ అజంతా భాషలలో మనది ఒకటని మనస్సున నిలుపుకుందాం. రాష్ట్రాలు దేశాలు అనే తేడా లేకుండా తెలుగువారందరినీ లెక్కగడితే మానది పైనున్న పది భాషలలో ఒకటవుతుందని తెలుసుకుందాం.ఇన్ని ప్రత్యేకతలున్న కమ్మని మన తెలుగును తర్వాతి తరాలవారికి అందించే ప్రయత్నం చేద్దాం. వీలయినంత అచ్చ తెలుగున మాట్లాడుదాం. 
మీ ఓపికకు కైమోడ్పులు.