1, అక్టోబర్ 2012, సోమవారం

మాండలికాలతోనే ముందుకు

   
తెలంగాణా (వరంగల్లు, నల్లగొండ) మరియు నడిమి కోస్తా (కృష్ణా) మాండలికాల కలయిక మా ఊరిలో చాలా తేటగా కన్పిస్తుంది. అందులో ఎక్కువపాళ్ళు తెలంగాణా మాండలికానికి చెందుతాయి. మాండలికాల కలయిక మీద ఆరయిక (పరిశోధన) చేయదలచిన వారికి ఈ  ప్రాంతం  తప్పక ఆసక్తిని కలిగించగలదు. మా ఊరిలో నేటికీ వాడుకలో ఉన్న కొన్ని మాటలు మీ కొరకు ఇవిగోండి.
మాఊరిమాట: తెలుగు/సంస్కృతం/ ఆంగ్లం
ఒడుపు = technique
ప్రయోగం: ‘పని తేలిగ్గా చేయాలంటే దాని ఒడుపు తెలియాలి’
ఉలపా = bonus
కూలి కాకుండా పనివాళ్ళు బాగా పనిచేసినందుకో, పండగ సందర్భంగానో, రైతులు లేదా పనికి పెట్టుకున్నవారు పనివాళ్ళకు అదనంగా ఇచ్చే డబ్బు, తిండి గింజలు మున్నగు వాటిని ఈ మాటతో పిలుస్తారు.
తోలకం = driving (noun)
ఫ్ర: ‘నీ బండి తోలకం గిట్టుబాటుగా ఉందా?’
దండగ= జరిమానా, అపరాధ రుసుము, penalty, fine
ఊరిలో ఏదైనా పంచాయతి (తగాదా/ గొడవ పరిష్కారంఅన్న తెల్లంలో) జరిగినప్పుడు, తప్పు చేసిన వారికి డబ్బు రూపంలో గానీ, వస్తు రూపంలో గానీ విధించే శిక్ష. ఈ మొత్తం కొన్నిసార్లు పంచాయతి పెద్దలకు, కొన్నిసార్లు నష్టపోయిన వారికి చెందుతుంది.
కుంపు= నాకా, Absent(noun)
ఈ మాట గమనించి నేను చాలా అబ్బురపడ్డాను. పనికి గైర్హాజరవడాన్ని పనికి ‘కుంపవడం’ అంటారు. ఎన్నిసార్లు/ రోజులు పనికి రాకపోతే అన్ని కుంపులు అన్నమాట.
తెరిపి = విరామం, break
పనికీ పనికీ మధ్య లేదా పని మధ్యలో కాసేపు పని లేకుండా ఉండే/ ఆపే సమయం. ఒకటే పోతగా వాన కురిసేటప్పుడు ‘వాన తెరిపి ఇయ్యకుండ గురత్తంది (ఇవ్వకుండా కురుస్తున్నది)’ అంటూ ఉంటారు.
ఓటి = బలహీనమైన, weak
దీనికి ఒక మచ్చు- ‘ఓటి కుండ’. / చిల్లు పడిన కుండను అలా అంటారు.
తిత్తి= సంచి
నా చిన్నతనములో ఎండాకాలం ఎండనపోయేవారు/ గొడ్లుకాసేవారు (పశువుల కాపరులు) తమతోపాటు తోలుతో కుట్టిన ‘తోలు తిత్తి’లో నీరు తీసుకుపోయేవారు. అందులో నీళ్ళు చల్లగా ఉంటాయి.
ఎచ్చిడి= పరిహాసము, making fun of
üÐFҬеã = contract
ఏదైనా పని మొత్తం ఒకరికి లేదా ఒక ముఠాకి అప్పగించడాన్ని లేదా తీసుకోవడాన్ని వరుసగా, గుత్తకియ్యడం లేదా గుత్తకి తీసుకోవడం అంటారు.
జింగ = catch (noun)
బంతి ‘జింగపట్టులాట’ అనేది చిన్న పిల్లలు బంతితో ఆడుకునే ఆటల్లో ఒకటి.
ఎరక (యెరుక)= knowledge
సట్టం =frame
ఏదైనా కట్టేముందు (నిర్మించే ముందు) దానికి కావలసినవేరు (root)) అల్లిక/ కట్టడం (నిర్మాణం)ని ఇలా పిలుస్తారు. దీనికి మేటిమచ్చు ‘బండి సట్టం’ (=frame/body of a cart) అనే మాట. ఈ మాటను చాలా పనిముట్లకు, బండ్లకు (వాహనాలకు) వాడవచ్చని నా అనుకోలు.
గిర్ర = చక్రం, wheel
‘గిర్రున తిరగడం’ అనే మాట చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు తెలిసిందా పైన చెప్పిన మాటకూ దీనకీ చుట్టరికం. ద్విచక్ర వాహనం, త్రిచక్రవాహనం మొ. అంటూ పత్రికల్లో నోరు తిరగకుండా కనిపెట్టి వ్రాసే సంస్కృత మాటలకు మారుగా, మా ఊరిలో ‘రెండు గిర్రల బండి’, ‘మూడు గిర్రల బండి’, ‘నలు/నాలుగు గిర్రల బండి’ అని వాడుతున్నారు. ఎంత తేలికగా ఉన్నాయో ఈ మాటలు చూడండి.
మట్టు= పద్ధతి
‘పని మట్టుగా చెయ్యి’ అంటే పని చక్కగా, ఒక పద్ధతిలో చేయమని తెల్లము. ‘గుట్టుమట్లు’ అనే మాట ఈ సందర్భంలో గుర్తుకు రావచ్చు. దానికి ఆంగ్లంలో trade secrets అనే మాట సరిపోతుందనుకుంటా.
ఇలా తవ్వుతూ వ్రాస్తూ పోతే నేటి అక్కరలకు పనికి రాగల మాటలు ఎన్నో మన పల్లెల్లో దొరకుతాయ. కొన్నిసార్లు మాటల తెల్లములను మనము కొత్త వాటికి పొడిగించుకోవాలి. మచ్చుకి, పైన చెప్పిన ‘సట్టం’ అనే మాట బండికి మాత్రమే వాడతారు కదా. అందుచేత వేరే వాటికి ఎలా వాడతాం అని కూర్చుంటే మన నుడి పెంపు జరగదు. చాలామంది ఈ మాటలు రాతకోతల్లో వాడడానికి పనికిరావు అంటూ కొత్త సంస్కృత మాటలు కనిపెట్టడానికి సిద్ధపడతారు లేదా కొందరు పత్రికల వాళ్ళు ఉన్న దున్నట్టుగా ఆంగ్ల మాటలను వాడతారు తప్ప మన చెంతనే ఉన్న ఈ పల్లె మాటలను పట్టించుకోరు. ఎందుకని అడిగితే అవి మాండలికపు మాటలు అందరికీ తెలియవు అని చెప్తారు.
మాండలికపు తేడాలు లేని భాష ఒక భాషేనా? తెలుగు ఎవరో నలుగురు కూర్చుని కనిపెట్టి వ్రాసిన భాష కాదుగదా. మనది జీవ భాష. ఎల్లప్పుడూ పారే ఏరు లాంటిది. తేడాలు, రకరకాలు (వైవిధ్యత, variety) చాలా సహజం. ఆ మాటకొస్తే, ఈ పండితులు, పత్రికలవాళ్ళూ కనిపెట్టి ప్రచారం చేసే నోరు తిరగని సంస్కృత మాటలూ, అప్పు తెచ్చుకున్న ఆంగ్ల మాటలూ ప్రజలందరికీ ముందే తెలుసా? అవి అందరికీ అర్థమవుతాయా? ఇకనైనా రాత కోతలను మార్చే చోటులో కూర్చున్న వారు తమ తలపు తీరు (ఆలోచనా విధానం)ను మార్చుకోవాలి. దీనికి నాకు తోచే దారి ఏమంటే, అన్ని సీమలవారూ కూర్చుని, అన్ని మాండలికాల నుంచి ఇలాంటి మాటలు ఏరి, ఎట్టి ప్రాంత తేడాలు లేకుండా, తేలికగా ఉన్నట్టి, దాని నుంచి మరిన్ని మాటలు పుట్టించవీలున్నట్టి మాటలను వడపోసి పత్రికల ద్వారా, బడి పుస్తకాలద్వారా, కవులు తమ రచనల ద్వారా అందరికీ వాడుకలోకి తేవాలి.
అలాకాక చాన్నాళ్ళుగా మన దగ్గర జరుగుతున్నట్టుగా రెండుమూడు జిల్లాల మాండలికమే ప్రామాణికం అని మిగతావి వ్రాతలో వాడకూడదు అనో, ఎవరికి వారు తమ మాండలికమే గొప్పదనో కొట్లాడితే మన నుడికి ఇంకా తీరని నష్టం కలుగుతుంది. అప్పుడు ‘పిట్ట పిట్టపోరు పిల్లి తీర్చినట్టు’గా వేరే భాషలు మన నుడిని మింగివేస్తాయి. పల్లె మాటలు ఒకచోట కూర్చడం అనేది తెలుగు మీద పరిశోధన చేసే వారి పని మాత్రమే కాదు , మనందరిదీనూ. నా వంతుగా నేను ఈ పనిని నా బ్లాగులో (http::achchatelugu.blogspot. com/ ఛేస్తున్నాను. మీరు కూడా మొదలుపెట్టండి మరి.

29, సెప్టెంబర్ 2012, శనివారం

తెలుగు ధాతువులు(root words) దొరికే జాడ ఇదిగో 

తెలుగు ధాతువులు(root words) దొరికే జాడ:
http://www.andhrabhoomi.net/content/t-53

కొత్తగా ఒక ముచ్చట(సంగతి,విషయం)ను కనుగొన్నప్పుడు లేదా కొత్తదాన్నిపరిచయము చేసేటపుడు, దానికి పేరు పెట్టడానికి, ఆ నుడి(భాష)లో సరయిన పేరు దొరకదు. దొరికితే ఆ ముచ్చట కొత్తది ఎలా అవుతుంది? అలాంటప్పుడు, దాన్ని సేత(కర్త,doer) మొదట చేసే పని ఏమంటే, ఆ నుడిలో ఉన్న వేరుపలుకులు(ధాతుశబ్దాలు, root words), మునుచేర్పు(ఉపసర్గ,prefix) వేనుచేర్పు(ప్రత్యయము, suffix) మొ వాటిని వండి వార్చి ఆ కొత్త ముచ్చటకు పేరు పెట్టపూనుకుంటారు. వాటిని మనం ఇల్లు కట్టేతపుడు వాడే మొగరము లేదా గుంజ(pillar)లతో పోల్చవచ్చు. అవి ఎన్ని ఎక్కువగా ఉంటే అంత పెద్ద ఇల్లు కట్టవచ్చు.తెలుగులో కొత్త మాటలు పుట్టించేటపుడు లేదా వేరే నుడులలో ఉన్న ఎసుదు(శాస్త్రం)లను తెనిగించేతపుడు పండితులని తమను తాము పిలుచుకొనే వారు మొత్తానికే సంస్కృతాన్ని ఆనుగా చేసుకుంటారు. తెలుగు మాటలు వీలయినంతవరకూ లేకుండా చూస్తారు.'వేడి'(తెలుగు)అన్న మాట ఉంచుకొని కూడా 'ఉష్ణం'(=వేడి, సంస్కృతం)అని కావాలని అంటారు. అందుకే మన తెలుగు మీడియం పుస్తకాలు కొరకరాని కొయ్యల్లా ఉండేది. అదంతా తెలుగు లిపిలో వ్రాసే సంస్కృతం కాక మరేమీ కాదు. ఇట్లా ఎందుకు చేస్తున్నారని అడిగితే, వారు చూపే కుంటిసాకు ఏమంటే తెలుగులో తగినన్ని వేరుపలుకులు లేవు అని. అలాంటి వారందరి నోళ్ళు మూయించే పని ఒకటి 'ఆంధ్రభూమి' పత్రికలో ప్రతి శనివారం వచ్చే 'నుడి' కమ్మ(పుట,column/page)లో జరుగుతున్నది.  తెలుగు వేరుపలుకులు అక్కడ ప్రతి వారమూ ఇస్తున్నారు. తెలుగులో కొత్త మాటలు పుట్టించి మన నుడిని కలిమిగలదిగా చేయతలచిన వారందరూ ఆ కమ్మను తప్పక చదవగలరు.

27, సెప్టెంబర్ 2012, గురువారం

'తిరు' తెలుగు మాటేనా లేక 'తిమ్మ' తెలుగు వారి 'తిరు'యా?

పెద్దవారి(పెళ్ళైన) పేర్ల ముందు 'శ్రీ','శ్రీమతి' అని కలిపి పిలవడం తెలుగు నాట ఉగ్గుడు(గౌరవం)గా చెలామణి అవుతున్నది. వీటికే సమానమైన తెల్లములలో తమిళులు 'తిరు','తిరుమతి' మాటలను వాడుతున్నారు. మనకు తెలుగు నాట కూడా ఈ 'తిరు' మాటను వాడుతున్నాము మనకు తెలియకుండానే. కాకపొతే ఆ తెల్లములో కాదు. దీనికి మేటిమచ్చులు 'తిరుమల' మరియు 'తిరుపతి'. 'తిరుపతి' లోని 'పతి' అనే సంస్కృత మాటకు తెల్లము  'పెనిమిటి' అని. అంటే ఆ తిరుపతి వెంకయ్య బాగా డబ్బు గలవాడన్నమాట . మన దగ్గర సంస్కృత తాకిడి(ప్రభావం) ఎక్కువై మనవి, అంటే తెలుగువ మాటలు చాలా కనుమరుగయి పోయాయి గానీ 'తిరు' అనేది తెలుగు మాట కూడా(అయి ఉండవచ్చు). ఎలా అంటారా? మన తెలుగు నాట ఎన్నో ఊర్ల పేర్లలో ఉంది  ఈ 'తిరు' అలికిడి. ఈ మాటకు 'సిరి', 'సంపద' వంటి పెక్కు తెల్లములు చెప్పుకోవచ్చు. సరే, తిరుమల మరియు తిరుపతి అనేవి తమిళనాడు ఎల్లకి దగ్గరలో ఉన్నాయి కావున ఆ 'తిరు' తమిళము నుంచి వచ్చిందేమో అని అనుకోవచ్చు. కానీ కృష్ణా జిల్లాలోని 'తిరువూరు'  తెలుగునాటి నడిబొడ్డున ఉన్న ఊరు. 'తిరు'ని కలిగియున్న మరికొన్ని ఊర్ల పేర్లను ఇక్కడ ఇస్తున్నాను[1].
1.  తిర్పల్లి , అదిలాబాదు జిల్లా, లక్ష్మణ్‌చందా మండలానికి చెందిన ఊరు
       తిర్పల్లి=తిరు+పల్లె(పల్లి)
2.తిర్తల, ఖమ్మం జిల్లా, ఖమ్మం మండలానికి చెందిన ఊరు
      తిర్తల=తిరు+తల
3.తిర్మాంపల్లి, నిజామాబాదు జిల్లా, నిజామాబాదు మండలానికి చెందిన ఊరు
     తిర్మాంపల్లి=తిరు+మామిపల్లె(మాం పల్లి )
4.తిరువాడ, విశాఖపట్నం జిల్లా, మాడుగుల మండలానికి చెందిన ఊరు
5.తిరుపాడు, కర్నూలు జిల్లా, గడివేముల మండలానికి చెందిన ఊరు
6.తిరువూరు, కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము
7.తిర్యాని, అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము

ఇక 'తిరు'ని కలిగియున్న మిగిలిన ఊర్లన్నీ 'తిరుమల' పేరు మీదుగా ఉన్నాయి. అదే తమిళనాడులో 'తిరు'తో ఉండి 'తిరుమల'మీదుగా లేని ఊర్లు దాదాపు ముప్పది వరకూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే, 'తిరు' అనే మాట ఒకప్పుడు తెలుగునాట కూడా వాడబడి ఉండాలి. ఏదో కారణము చేత అది వాడుకలోనుండి తర్వాత తొలగి పోయి ఉండాలి. బహుశా 'శ్రీ'అనే మాట కుదురుకున్న పిదప 'తిరు' వాడకములోనుండి తొలగి పోయి ఉండి ఉంటుంది.లేకపోతె, ఎక్కడో ఆదిలాబాదు జిల్లాలో ఉన్న ఊరికి తమిళనాడుకీ చుట్టరికము ఎలా కుదురుతుంది?.  ఈ ముచ్చట తేలాలంటే పాత పుస్తకాలూ  శాసనాలూ తిరగవేయాలి.
అయితే ,అప్పటికీ కూడా 'తిరు'అనేది ఇప్పుడు కాకపోయినా మునుపెప్పుడూ కూడా తెలుగు మాట కాదని తేలితే(ఊరికే అనుకుందాము), 'శ్రీ'కి సరియైన అచ్చ తెలుగు మాట ఏమిటి? మీకు ఏమైనా తెలిస్తే చెప్పగలరు. ఈ 'తిరు'గురించి వెదుకుతుండగా , మన సీమలో 'తిమ్మ' పేరుతో చాలా ఊరి పేర్లు ఉన్నట్టు తెలిసింది[1]. నాకు తెలిసి, అవి 'తిరుమల'పేరుతో  ఉన్న ఊరి పేర్ల కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని తెల్లము వెదకగా, తిమ్మ=దీవించు[2] అని ఒక నుడిగంటులో దొరికింది. ఒకవేళ, ఇదే తెలుగు వారి 'తిరు'యా?

ఉటంకింపులు:
1.http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82:%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D_%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81
2.http://telugu.indianlanguages.org/dictionary/wordmeaning.php

13, సెప్టెంబర్ 2012, గురువారం

మా ఊరి మాటల సద్ది మూట (5)

అయిదవ ముక్క: అవీ ఇవీ(1)

ఆసక్తి కలిగించే కొన్ని మా ఊరి మాటలను మీకు ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాను.

కైవారము :చుట్టుకొలత

రొడ్డ: odd
ఎడమ చేయిని కొందరు 'రొడ్డ చేయి' అంటారు. పుర్రచేయి/పురచేయి అని కూడా కొందరంటూ ఉంటారు. మనలో చాలా మందికి బలువైన(భారమైన) పనులూ, చాలా జాగ్రత్తగా చేసే పనులూ కుడిచేతితో చేసే అలవాటు ఉంటుంది. దాన్నే 'కుడిచేతి వాలు' అంటారు మా ఊరిలో.  రొడ్డచేతి వాలు గలవారు కూడా కొందరుంటారు .  కాకపోతే, వీరు కుడివాలు గలవారితో పోలిస్తే చాలా తక్కువ. అందరూ ఒక తీరుగా చేసే పనిని, ఎవరైనా వేరుగా, తేడాగా చేస్తే 'వాడు రొడ్డగా చేస్తున్నాడు' అంటారు. కానీ ఇక్కడ తెల్లము (అర్థము) 'ఎడమ చేతి పని' కాదు. అయితే, అది 'ఎడమ చేతి పని' అన్న దానితోనే మొదలయ్యి ఉంటుందని నా ఊహ. చూసారా కొత్త మాటల పుట్టుక.  భాషను వాడుతుంటేనే, కొత్త మాటలు పుట్టుతుంటాయి. లేకపోతె అక్కడే ఆగిపోతుంది దాని పెంపు. ఇలాంటి మాటలు ఉండగానే, మన వాళ్ళు అంటే పత్రికల వాళ్ళూ, పండితులూ 'odd' అనే ఆంగ్ల మాటకు సంస్కృత మాటను వెతికే పనిలో పడతారు.

ఎదురు: counter
ఈ మాట కొత్తది కాదనుకుంటాను. ఎదురు దాడి, ఎదురు వాదులాట/ఎదురు వాదం లాంటి మాటలు వినే ఉంటారు.

చేసంచి :hand bag
నిజంగా ఈ మాట మా ఊరిలో వాడుకలో ఉంది.  'చేతిసంచి' కొంచెం కురచగా అయ్యి అలా మారిందన్నమాట. ఇంగిలీషు చదువులు చదువుకున్న వారు ఈ తెలుగు మాటను వాడడానికి ఇష్టపడరేమో.

గూడల  సంచి:backpack
బడి పిల్లలు మొదలుకుని ఉద్యోగస్తుల వరకూ అందరూ వీపున వేసుకుని మోసే సంచిని ఈ పేరుతో పిలుస్తారు. అన్నట్టు, 'గూడ' అంటే భుజం అని మా ఊరిలో.

కారు ఎడం: వయస్సులో అంతరం, difference in age
'కారు' అనే తెలుగు మాటకు 'వయస్సు' అని తెల్లము. నిజానికి, 'వయస్సు' అనేది సంస్కృత మాట. 'ఎడం' అనే మాట 'gap' అనే ఆంగ్ల మాటకు సరిగా సరిపోతుంది.

కారెడ్డం:వ్యంగ్యం, sarcasm  
'కారెడ్దపు మాట / కారెడ్డంమాట' అంటే వ్యంగ్యంగా ఉన్న మాట అని. నిజం చెప్పాలంటే ఈ మాటకు సరిగ్గా సరిపోయే  సంస్కృత మాట గానీ, ఆంగ్ల మాట గానీ నాకు తట్టలేదు. దానికి దగ్గరగా ఉన్నట్టుగా నాకు తోచిన మాట వ్రాసాను.

కుంపు:గైర్హాజరు, absent
ఎన్నిసార్లు లేదా ఎన్ని నాండ్లు పనికి పోకపోతే/రాకపోతే అన్ని కుంపులు అన్నమాట. ఈ మాట బాగా పనికి వస్తుందనుకుంటున్నాను. పనికి గైర్హాజరవడాన్ని 'కుంపవడం' అంటారు.

ఆయాం/ఆయం : original 
'ఆయమన్న మనిషన్న వాడెవడూ ఇంత అవమానాన్ని తట్టుకోడు' అనే మాటలో ఈ తెల్లము తడుతుంది.

ఇలా ఇప్పటికే ఉన్న మాటలను గుర్తించి అందరి వాడుకలోకి తేవడం ఒక ఎత్తు అయితే, కొత్త మాటలను పుట్టించుకోవడానికి చేసే వెతుక్కోలు మరొక ఎత్తు. క్రింద కొన్ని మచ్చులు చూద్దాం.

పొలికట్ట
పెద్ద వాన వచ్చినప్పుడు, చెట్ల ఆకులూ, చెత్తా రాలి నేలకు అంటుకునిపోతుంది. వాకిలి ఊడ్చేతపుడు ఆ అంటుకున్న చెత్త మామూలు పొరక(చీపురు)కి రాదు. అందుచేత, పొడవాటి కందిమండలతో లేదా వేరే పెద్ద పుల్లలతో పొరకలాగా కట్టిన కట్టను  'పొలికట్ట' అని పిలుస్తారు. దీనితోనయితో నేలకు  అంటుకున్న చెత్త రావడం మాత్రమె కాకుండా, పెద్ద మొత్తంలో ఉన్న చెత్తను కూడా తేలికగా ఊడ్చేయవచ్చు.  ఇది మా ఊరిలో వాడుకలోని మాట.
పొలికేక:గట్టి కేక
పొలిమేర : ఊరి సరిహద్దు. ఇది ఆ ఊరంతటికీ హద్దు. 'మేర' అంటే హద్దు అని తెల్లమున్నది.
పై మూడు మాటలనుండి మనము ఏమి గమనించవచ్చు? 'పొలి 'అన్న మాట కాకుండా మిగతా సగానికి పై మూడు మాటల్లోనూ సొంత తెల్లములున్నవి. అంతే కాకుండా  'కట్ట','కేక' మరియు 'మేర' అన్న మాటలకు ముందు ఈ 'పొలి ' చేర్చడం వలన వాటి అసలు అర్థం మారకపోగా, మునుపు ఉన్న తెల్లమే గట్టిగా పలుకుతున్నది.  అంటే 'పొలి ' అనేది ఒక మునుచేర్పు(ప్రత్యయం) అనీ, అది ఒక క్రియా విశేషణం(adverb)  అనీ తేటగా తెల్లమవుతుంది. అది మాటల ముందు చేర్చినప్పుడు 'పెద్ద', 'గొప్ప' (సరిగ్గా తెల్లము నాకూ తెలియదు. ఊహిస్తున్నానంతే) లాంటి తెల్లముతో అసలు మాటను ఎక్కువ చేసి చెపుతుందని గమనించవచ్చు. అంటే మనకొక అచ్చతెలుగు మునుచేర్పు దొరికిందన్న మాట.  కొత్త మాటలు పుట్టించవలసి వచ్చినప్పుడు దీన్ని వాడితే సరి.
 మచ్చుకి,
grand festival-->మహోత్సవం=మహా(పొలి)+ఉత్సవం(వేడుక)=పొలివేడుక ==>పొలేడుక. ఈ మాట సరిగ్గా సరిపోకపోవచ్చు. కానీ ఇలా ప్రయత్నించవచ్చని చెప్తున్నాను అంతే.

ఇంకో మాట చూద్దాం.

చిత్తడి అంటే ఏమిటి?
చిత్తడి నేల అంటూ ఉంటాము. దీన్నే, మా ఊరిలోనయితే 'బాడవ' అంటారు. ఊరిలో వంపు(పల్లం)న ఉండే సాగునేల(వ్యవసాయ భూమి)ని ఈ పేరుతొ పిలుస్తారు. సాధారణంగా ఇవి యేటిలో చాలా వరకు తడిగా ఉంటాయి. కొద్ది వానలతోనే ఈ నేలలో  పంటలు పండగలవు.
మరి చిత్తడి నేల అంటే, ఎల్లప్పుడూ తడిగా (దాదాపుగా ) ఉండే ఆని తెల్లమా లేక బాగా తడిగా ఉండే అని  తెల్లమా? అయితే, మనం ఆ మాటను ఇలా విరవవచ్చా, చిత్తడి=చిత్+తడి, చిత+తడి, చిత్తు+తడి
ఎల్లప్పుడూ అనే తెల్లములోనయితే, 'చిత్ ' లేదా 'చిత' అనేది ఒక మునుచేర్పు అయిఉండాలి. బాగా అనే తెల్లములోనయితే, 'చిత్తు ' అనేది సరిపోతుంది. ఎందుకంటే, 'వాడు చిత్తుగా తాగాడు' అంటే వాడు బాగా, నిండుగా తాగాడు అని కదా తెల్లము అంతేగానీ వాడు ఎల్లప్పుడూ తాగాడు అని కాదు కదా. (అన్ని దారులూ పరికిస్తున్నానంతే). చిత్తడి అంటే ఎల్లప్పుడూ తడి అనే తెల్లము ఖాయం చేసుకుంటే 'చిత్ ' లేదా 'చిత' అనే మునుచేర్పుకి 'ఎల్లప్పుడూ' అనే తెల్లమన్న మాట. అయితే  మన ఈ చిక్కపట్టు(సిద్ధాంతం)ని నిరూపించడానికి 'చిత్ ' లేదా 'చిత' అనే మునుచేర్పు కలిగి ఎల్లప్పుడూ అనే తెల్లమును తనలో దాచుకున్న వేరే మాటలను వెతకాలి. అలాగానీ  దొరికినట్లయితే, మన చిక్కపట్టు గట్టెక్కినట్టే.

ఏ భాషకూ అన్ని మాటలూ అది పుట్టినప్పటి నుండి ఉండవు . ఉన్న వాటినుండి కొత్తవి పుట్టిస్తూ, ఇంతకు మునుపు లేని మాటలను వాడుకలోకి తెచ్చుకుంటూ సాగిపోవాలి. బావులు తవ్వడానికి వచ్చిన 'proclain'ని చూసి ఊరి వారు 'తవ్వోడ' అన్నారట ఎక్కడో శ్రీకాకుళంలో . కొత్త మాటలు ఇలా పుడుతుంటాయి. మంది వాడుకలోకిలా వచ్చిన మాటలను వ్రాతలో వ్రాయడానికి ఎందుకు అభ్యతరాలు? ఇలాంటి మాటలను మాండలికాలుగా, పల్లె మాటలుగా ముద్ర వేసి ప్రామాణిక భాష పేరుతో నోరు తిరగని సంస్కృత మాటలు కనిపెట్టాలని చూస్తారు పండితులనబడే కొందరు. ప్రామాణిక భాష ఎవరి కోసం? దాని ఉద్దేశ్యం ఏమిటి ? అందరికీ అర్థం కావాలి అనా? సంస్కృతం చదువుకున్న కొందరికి మాత్రమె తెలియాలనా? మన పుస్తకాల్లో మంది మాటలకు చోటు దక్కదు. పత్రికలకు ఒక భాషా విధానం అన్నది లేదు. వారు కూడా ఇంకా ఇంకా సంస్కృతం వెంటపడుతూ పల్లె ప్రజల మాటలనూ,  తెలుగునూ కించపరుస్తున్నారు. మానవ హక్కుల కోసం ప్రత్యేకంగా కమిషన్లు ఉన్న ఈ రోజుల్లో మంది(జనం,ప్రజ) మాటలను ఇంకా తొక్కిపెడుతుండడం చాలా దారుణం. తెలుగులోనే పల్లె మందిలో వాడుకలో ఉన్న చాల మాటలను మాండలికాలని ముద్రవేసి వాటిని అంటరానివాటిగా చూస్తూ, ఉన్నత వర్గాలవారూ  పత్రికలూ, పండితులు   అనబడే కొందరు వాటికి మారుగా ప్రామాణిక భాష పేరుతొ కొత్త, కఠిన, కృతక సంస్కృత మాటలను పుట్టిస్తున్నారు. లేదా ఆంగ్ల మాటలు రాజ్యం ఏలేలా  చేస్తున్నారు. మన చేతనే మనం మాట్లాడే మాటలు వ్రాతలో, శాస్త్ర విషయాలు చదవడానికీ పనికిరావని, ఎబ్బెట్టుగా ఉంటాయని అనిపిస్తున్నారు. మన భాష ఎందుకు ఎన్నో ఏళ్లుగా పండితులకు అంటరానిదయిపోయింది? 'నెత్తురు' అంటే తక్కువేముంది? 'రక్తం' (సంస్కృతం)అనగానే వచ్చే గొప్పతనమేముంది? ఒకప్పుడంటే ఒక చోటి మాటలు మరొక చోట తెలిసే అవకాసం లేదు. ఇప్పుడు ప్రచార సాధనాలున్నాయి కదా. ఒకే తెల్లమునిచ్చే రకరకాల మాటలను వివిధ మాండలికాల నుంచి సేకరించి అందులో కురచ(పొట్టి)గా ఉండి, దాన్నుండి మరిన్ని మాటలు పుట్టించ వీలున్న మాటలను ఎన్నుకుని పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ వేయవచ్చుగా? తెలుగులో మాటలు లేవని కుంటి  సాకులు చెప్పి వేరే భాషల మాటలు మంది మీద రుద్దేముందు, వారిని అసలైన తెలుగు తెలుసుకోమని కోరుతున్నాను.

మీకు తెలిసినవి, నేటి అక్కరలకు పనికి వచ్చే మాటలు ఉంటే తెలియజేయగలరు.  

12, ఆగస్టు 2012, ఆదివారం

మా ఊరి మాటల సద్ది మూట (4)

నాలుగవ ముక్క: ఇల్లూ దాని చుట్టుపక్కలూ

మా ఊరిలో రకరకాల ఇళ్ళు కనిపిస్తాయి. కప్పును బట్టి, కట్టుడుని బట్టి చాలా తేడాలే మనకు కనిపిస్తాయి. 
కప్పును బట్టి చూస్తే,
అ.పూరిల్లు 
                            పూరిల్లు=పూరి+ఇల్లు ఇందులో పూరి అనే మాటకు తెల్లమేమో నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. మొత్తానికి పూరిల్లు అంటే కొద్ది ఏండ్లు మాత్రమే నిలిచి ఉంటూ మళ్ళీ మళ్ళీ మార్చవలసిన అక్కర గలిగిన కప్పుతో కప్పిన ఇల్లు. కప్పు(roof)గా తాటిఆకులనూ, రకరకాల గడ్డిని వాడతారు. గడ్డి కప్పు ప్రధానంగా జమ్ము(చెరువుల్లోనూ, కుంటల్లోనూ పెరుగుతుంది), వరిగడ్డి, దరబ గడ్డి (దర్భ) లతో ఉంటుంది. ఇందులో వరిగడ్డి తొందరగా పాడయిపోతుంది. జమ్ము కొన్ని యేండ్లు అంటే రెండు లేదా మూడు యేండ్లు నిలుస్తుంది. చివరగా చెప్పిన దరబగడ్డి పది యేండ్లయినా చెక్కు చెదరక ఉంటుంది.  ఆ తర్వాత మార్చాలనుకోండి. ప్రతి వానాకాలం ముందు ఇంటి కప్పులు సరి చేయడమో, తిరిగి కప్పడమో మనం ఊర్లల్లో చూడవచ్చు.  ఎండాకాలం చల్లగా ఉంటాయి గాని, ప్రతి యేడూ మార్చాలంటే శ్రమతో కూడుకున్న పని.పూరిల్లు కప్పడాన్ని గురించి ఒక ప్రయోగం ఉంది. నిజంగా దీన్ని ఏమనాలో తెలియదు. అదేమిటంటే, 'తగిలితే గానీ మొగ్గడు తడిస్తే గానీ వంగడు' అని. మొండి మొగుడు గురించి ఆయన పెళ్ళాం అన్న మాట. మనమేదీ చెప్పినా వినడు నాలుగు దెబ్బలు తగిలితే గానీ మరియు ఎన్నాళ్ళ నుండి ఇల్లు కప్పు సరి చేయమని చెప్పిన పూనుకోలేదు కానీ గట్టి వాన వచ్చి ఇల్లు తడిసే సరికి ఆ పని చేసాడు' అని దాని వివరణ.  పైన కప్పిన కప్పు గాలికి లేచి పోకుండా ఉండేందుకు బరువుగా ఉన్న కొయ్యలు వాడతారు. వీటిని నడిగొప్పు లేదా నడిగప్పు (కప్పు యొక్క నడిమి)న వేలాడ గడతారు. నేలకు దగ్గరగా ఉన్న కప్పు చివరను సూరు(చూరు) అంటారు.
                            కప్పు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది ఎలా కప్పుతారో కూడా చూద్దాం. అలా చూడడంలో  మనకు చాలా మాటలు తెలుస్తాయి. మొదటగా ఒక లెక్క చొప్పున అక్కర పడిన చోట, కప్పేకప్పుకు ఆను(support)గా ఉండేందుకు గుంజలను నేలలో పాతుతారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మనం స్తంభం అని సంస్కృత మాట వాడతామే దాన్ని అచ్చంగా, తెలుగులో, నాకు తెలిసి గుంజ లేదా మొగరం అంటారు.  ఇక మన పూరింటి ముచ్చటకొద్దాం. నేలలో పాతిన కొయ్య గుంజలకు పైచివరన ఒక చీలిక ఉంటంది, సాధారణంగా. దాన్ని పంగ అంటారు. అలా ఉన్న దాన్నే గుంజ అని అనాలని లేదు. అలా ఉంటె దాన్ని పంగగుంజ అంటారు. ఇలాంటి గుంజల మీదుగా గోడపైనదాక వేసే ముఖ్యమైన అడ్డు ఆనును దూలం అంటారు. దీనికి సాధారణంగా పొడవైన,బలమైన చెట్టు మొద్దును వాడతారు. ఇంటి పరిమాణాన్ని బట్టి ఇలాంటి దూలాలు పెరుగుతుంటాయి. ఇక కప్పు నిలవడానికి  కావలసింది దూలాల మీద ఒక అల్లిక. దూలాల మీద నుంచి వాలుగా వేసే పొడవాటి కర్రలను వాసాలు అంటారు. ఈ మాట చదవగానే మీకేదైనా సామెత గుర్తుకు వచ్చిందా? 'తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్టు' అన్న  సామెత ఒకటుంది. ఇంట్లో మంచం మీద వెల్లకిలా (మా ఊర్లో ఈ మాటను 'ఎల్లెలకల' అంటారు) పడుకుని పైకి చూస్తే వాసాలు కనిపిస్తాయి. చేరదీసి తిండి పెట్టిన వారిల్లు కూలగొడితే ఎన్ని వాసాలు పనికొస్తాయి అని తలపోసాడట వెల్లకిలా పడుకుని ఒకడు మునుపటికి. అంటే మనకు మేలు చేసిన వారికే నష్టపరచటం అన్నమాట. నాకు తెలిసి ఈ సామెత విశేషం ఇదీ. మీకు వివరంగా తెలిస్తే చెప్పగలరు. మళ్ళీ మనం పూరింటి కట్టుడు(నిర్మాణం)కి వద్దాం. వాసాలమీద అడ్డుగా, గట్టిగా తీగల మాదిరిగా ఉండే చెట్లతో సమాన ఎడం(gap)తో కట్టు కడతారు. దాన్ని 'పెండెకట్టు' అంటారు. ఆ కట్టడాన్ని పెండెకట్టడం అంటారు. పెండె కట్టుడుకి సాధారణంగా 'పులిసేరు ' తీగలు గానీ, 'లోట్టపీసు ' తీగలుగానీ వాడతారు. కప్పు నిలవడానికి కావలసిన అల్లిక సిద్ధం ఇప్పుడు. ఇక కప్పే గడ్డిని చిన్న చిన్న కట్టలుగా కట్టి  'గడె ' సాయంతో పైకి అందిస్తారు. ఇల్లు కప్పటంలో చాల నేర్పరితనం కావాలి. లేకపోతే, నడివానాకాలంలో ఇల్లు కారుతుంది. అప్పుడు ఏమీ చెయ్యలేము. ఇల్లు కప్పడానికి వచ్చే ఆయన ఒక 'చూరుకుట్టు బద్ద'తో దిగిపోతారు. పేరులోనే ఉన్నట్టు ఆ బద్ద కప్పును అల్లికకు, గాలికి లేవకుండా కుట్టడానికి పనికొస్తుంది. అది తిరగ వేసిన సూది లాగ ఉంటుంది. అంటే సూదికి వెనకవైపున ఉండే బొక్క(రంధ్రం) ఈ బద్దకు మొన వైపుకు ఉంటుంది. గడ్డి కట్టను అల్లికకు కట్టడానికి కట్లు(బంధాలు) కావాలి గదా. వాటిని సాధారణంగా చీల్చిన తాటి ఆకుతో గానీ మెలితిప్పిన ఈత చువ్వ(ఈత మెల్లె, మెలితిప్పబడినది కావున మెల్లె )లను గానీ వాడతారు. ఇల్లు కప్పేవారు  గడ్డి కట్టలను ఒక వరుసలో పేరుస్తూ కట్లతో బిగిస్తూ వానచుక్క కిందకు జారకుండా కప్పుతారు.

ఆ.గట్టిల్లు లేదా పక్కా ఇల్లు
        పక్కా అన్న మాట తెలుగుది కాదు, హిందీది. పక్కా అంటే హిందీలో గట్టి అన్న తెల్లము. కనీసం అరువది యేండ్ల కింద కట్టిన కొన్ని ఇండ్లు మా ఊళ్ళో ఉన్నాయి. అవి డంగుసున్నము, ఉసికె(ఇసుక), చిన్న చిన్న రాళ్ళూ ఇవన్నీ కలిపి పోసిన కప్పుతో కప్పబడిన ఇళ్ళు. డంగుసున్నమంటే, ఇళ్ళు కట్టుడులో వాడడానికి అనువుగా ఉండేదుకు ప్రత్యేకంగా డంగులో చేసిన సున్నము. అలాంటి ఇంటిని మేడ, మిద్దె, బవంతి, డాబా అంటారు. పెంకులతో కప్పబడిన ఇళ్ళు కూడా చాలానే కనిపిస్తాయి. బట్టీలలో చేసిన పెంకులే కాకుండా చిన్నగా వంక తిరిగిన పెంకులతో కప్పిన ఇండ్లు కూడా ఉన్నాయి. అలాంటి పెంకులను 'కుమ్మరి పెంకులు' అంటారు.
       ఆర్ధిక స్తోమతను బట్టి, ఇల్లు కొంత గట్టిది కొంత పూరిదిగా, లేదా మొత్తం పూరిదిగా లేదా మొత్తం గట్టిదిగా కట్టుకుంటారు.

ఇవి కాక, అప్పుడప్పుడూ ఊరికి వచ్చే బాతులవాళ్ళూ, కురమ గొర్రెల వాళ్ళూ వేసుకునే, బట్టతో ఉండే గుడారాలు కూడా ఊరి వెలుపల పొలాల్లో కన్పిస్తాయి.  

ఇక, గోడలను కట్టే లెక్క చొప్పున చూస్తే, మట్టి గోడల ఇండ్లూ, ఇటుక గోడల ఇండ్లూ, రాతి గోడల ఇండ్లూ, ఇలాంటి  పదార్థమేదీ కాకుండా చెట్ల ఆకులతోనే ఉండే గోడల ఇండ్లూ కన్పిస్తాయి.  ఇటుక గోడలూ, రాతి గోడలూ మనం పట్నాల్లో కూడా చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి నేను మిగతా రెండింటి గురించి చెప్తాను. మట్టితో గోడ కట్టవలెనన్న, దానికి జిగురుగా ఉండేదీ, గట్టిగా ఉండేదీ అయిన తగిన మన్నును ఎంపిక చేసుకుని, అందులో రాళ్ళూ, చెట్ల వేర్లూ వంటివేవీ లేకుండా ఏరివేసి, కొన్నాళ్ళపాటు నీళ్ళు పోసి ఊరబెడతారు. ఆ పిదప దాన్ని ముద్దలుగా చేసి, గోడ కట్టవలసిన ఆకారంలో వేస్తూ పోతూ,  అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతూ గోడ పెడతారు. వానాకాలంలో, వానకి పాడయిపోకుండా, ఉండేదుకు గోడ కట్టిన తర్వాత పైన నున్నగా అలికి మందంగా సున్నం వేస్తారు. ఇలా చేయడాన్ని 'గిలాబు' చేయడం అంటారు. మనం ఇంగిలీషులో 'plastering'అంటామే అది. ఇలాంటి గోడలేవీ కాకుండా కొంతకాలమే నిలిచి ఉండేట్లుగా, చెట్ల ఆకులతో కట్టే గోడ(లాంటి) ఇండ్లు కూడా ఉన్నాయి. దానికి సాధారణంగా, తాటి ఆకులనుగానీ, ఈత ఆకులనుగానీ లొట్టపీసు కట్టెగానీ మరేవైనా తీగలనుగానీ వాడతారు. చెట్ల ఆకులతో అల్లినదాన్నయితే 'దడి' అంటారు. అలా కాకుండా తీగలతో అల్లినదాన్నయితే 'తడికె' అంటారు. కొన్నిసార్లు అటూఇటూగా కూడా పిలుస్తారు. ఇల్లుకట్టడం, కప్పడం చూడాలే గానీ ఇలా చెప్తే నిండుగా తెలియదు.

ఇల్లు ఆకారాన్నిబట్టీ, పరిమాణాన్నిబట్టీ కూడా రకకాలుగా చెప్పుకోవచ్చు. మచ్చుకి, గుండ్రముగా ఉండి, పూరికప్పుతో ఒకే గది ఉండే ఇంటిని, చుట్టిల్లు లేదా చుట్టు గుడిసె అంటారు. చుట్టు అంటే మన పుస్తకాల చదువుల భాషలో వృత్తం(circle) అన్న మాట . ఇంకా 'మాడుపాక' అనేది కూడా ఉంది. ఇది మనిషి నెత్తి(తల) 'మాడు లేదా మాడ' ఆకారపు కప్పుతో ఉంటుంది. ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. నిజం చెప్పాలంటే నాకు తెలిసింది చాలా తక్కువ.

పైన చెప్పినదంతా, ఇళ్ళు కట్టటం గురించీ, దాన్ని కప్పటం గురించీ. నెమ్మదిగా ఇంటిలోపల మొదలు పెట్టి, ఇంటి వెలుపల దాకా ప్రయాణం చేద్దాం. గట్టి ఇల్లు కట్టుకున్న వారయితే, ఇంటి లోపల, క్రింద నాపరాళ్ళు పరుస్తారు. పూరిండ్ల వారయితే, మట్టితో నున్నగా అలుకుతారు. అలికిన  కొద్ది నాళ్ళకు, అలుకు చెరిగి పోయి ఇల్లు దుమ్ము లేస్తుంది. మళ్ళీ అలకాలి పుట్టమట్టి తెచ్చి. అందుకే దాదాపు అన్ని పండగలకూ ఇల్లు అలుకుతారు. అటు పండగా కలిసి వస్తుందీ, ఇటు ఇల్లు శుభ్రమూ అవుతుంది. అలికిన అలుకు ఎండిన తర్వాత తడి ముగ్గుతో చక్కని ముగ్గులు వేస్తారు. ఇంటి వెలుపలి గోడ  ఎమ్మటి (వెంబడి) ఎర్రమట్టితో అలుకుతారు. ఇలా బయట అలకడాన్ని 'వారలు అలకడం లేదా వారలు తీయడం' అంటారు. 'వార' అనే మాటకు అంచు అని తెల్లమనుకుంటా. కంటిరా పూరింటి కడగండ్లు(కష్టాలు)!. నన్నడిగితే పూరిల్లు అందమైన యువరాణి లాంటిది. అందమైనదే కానీ యువరాణి కదా ఏ పనీ చేతగాదు. చిన్న జబ్బు కూడా తట్టుకోలేదు. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అలాంటప్పుడు.
 కొందరికి వంట కొరకు వేరేగా పక్కన చిన్న ఇల్లు ఉంటుంది. దాన్ని వంటపాక, వంటిల్లు, వంటగుడిసె లాంటి పేర్లతో పిలుస్తారు. పూరి కప్పుతో ఉండేదాన్ని మాత్రమే 'పాక' లేదా 'గుడిసె' అంటారు. ఇంటిముందు కొందరు యేటిపొడుగునా పనికోచ్చేట్టు 'పందిరి' వేస్తుంటారు. కొందరు ఎండాకాలంలో మాత్రమే నీడకు పనికోచ్చేట్టుగా ఆకుల కప్పుతో 'సలవ(చలువ) పందిరి' వేస్తారు. గొడ్లు(పశువులు) ఉన్నవారయితే వాటి కొరకు వేరేగా 'కొట్టం' వేస్తారు. దాన్ని గొడ్లకొట్టం అంటారు. కొందరు గింజలు(ధాన్యం) దాచుకోవడానికి, ఇంట్లోనే ఒక గది ఉంచడంగానీ, బయట వేరేగా గడ్డి తాళ్ళతో గానీ తీగలతో గానీ కట్టిన 'గుమ్మి'ని  ఏర్పాటు చేయడంగానీ చేస్తారు .  మీకు తెలుసా, గుమ్మి మీది కప్పునూ దాని అమరికనూ కలిపి 'ఇలారం' అంటారు. ఇంట్లోని గింజల గదినయితే 'గింజల కొట్టం' అని గానీ 'ఒడ్లకొట్టం' (వడ్ల కొట్టం అని. వడ్లు ప్రధాన పంటగా ఉండే చోట దాన్ని అలా పిలుస్తారు.)అని గానీ అంటారు.  ఇంటి వెనకగానీ, పక్కన గానీ గడ్డివామీ(గడ్డివామి, వామి(కుప్ప)గా పేర్చిన ఎండుగడ్డి. వామి అనే మాట 'రాశి' అన్న సంస్కృత మాటకు మారుగా మనం వాడవచ్చు), కట్టెలూ మొదలైనవి ఉండే చోటును 'దొడ్డి' అంటారు. పెరడు అన్న మాటతో ఎవరో కొద్ది మంది ఆ చోటును పిలుస్తారు. ఎగసాయం(వ్యవసాయం)కల కుటుంబాలవారు కొందరు గొడ్ల పేడ(లేదా పెండ), కసువు మొ|| ఒక పక్క పోస్తారు. దాన్ని పెంటదిబ్బ అంటారు. పేరులో ఉన్నట్టు పెంటను దిబ్బగా పోస్తే అది పెంటదిబ్బ. అయితే ఒక్కోసారి ఒట్టి కసువు దిబ్బను కూడా పెంటదిబ్బ అని పిలవడం పరిపాటి. తొలకరి వాన పడడంతోనే ఈ పెంటదిబ్బలను  ఎత్తి, పొలాల్లో ఎరువుగా వేస్తారు. 

ఇక ఇంటి లోపల, అలమరలూ, తంతెలూ, అటుకు(అటక, attic), గిన్నెలూ మిగతా పనిముట్లూ సామాన్లూ వంటివన్నీ ఒక్కసారి చెప్పటం వల్లకాని(సాధ్యపడని)పని. వాటి గురించి మరెప్పుడైనా చెప్తాను.    

 ఇంటిలోకి వెళ్ళే ద్వారాన్ని 'మొత్త' అంటారు. ఇంటి గోడలో దీపాలు పెట్టుకోవడానికి ఉండే చిన్న ఏర్పాటును 'గూడు' అంటారు.  మొత్తకాడ ఉండే చెక్క సట్టం(చట్రం, frame)ని దారబందం(ద్వారంబంధం) లేదా దర్వాజ(మా ఊరు తెలంగాణలోది మరి, అందుకే ఆ ఉరుదూ మాట) అంటారు. తలుపును తీయరాకుండా వేసేదాన్ని 'బేడెం'/'గడి'/'గొళ్ళెం' అంటారు. రాయలసీమలో దీన్నే 'చిలుకు' అంటారని విన్నాను. ఇంటిచుట్టూ కొందరు గోడ కడతారు. కొందరు తడికెలు కట్టుతారు. మరికొందరు చిన్నచిన్న చెట్లు వేస్తారు. ఇంకొందరు రాళ్ళతో 'రాళ్ళతెట్టె' లేదా  'రాతికట్టం' కడతారు. దీనికి మోటురాళ్ళు(నేలలో సహజంగా దొరికే, ప్రత్యేకంగా చెక్కని, raw) వాడతారు. తెట్టె అంటే కూర్పు, పేర్పు, అమరిక మొ||. తేనెటీగల గూడును మాకాడ(మా వద్ద) తేనెతెట్టె లేదా తేనేతుట్టె అంటారు. చూసారా తెట్టె అన్న మాట యొక్క వాడకం. ఇంటి చుట్టూ ఉండే ఒట్టి(ఖాళీ)చోటునయితే, మా ఊరిలో 'వాకిలి' అంటారు. రాయలసీమలో ఇదే మాటకు 'ద్వారబంధం' లేదా 'తలుపు' అన్న అర్థం ఉంది. ఇంటిచుట్టూ ఉండే గోడను 'కంటెగోడ' లేదా 'పారీ(ప్రహరీ)గోడ' అంటారు. ఈ కంటె గోడను దాటుకుని ఇంటి వాకిట్లోకి రావడానికి ఉండే మొత్తను 'తలమొత్త' అంటారు. ఆ తలమొత్త ముందు ఉండే చోటును 'తలవాకిలి' అంటారు. చూసారా, ముఖ్య లేదా ప్రధాన అనే సంస్కృత ఉపసర్గలకు మారుగా తెలుగులో 'తల'అనేది మునుచేర్పు అని గమనించారా. ఈ నడిమిన తమిళ పుస్తకమొకటి చదువుతుంటే ముఖ్యపట్టణాన్ని 'తల పట్టిణం' అనడం చూసాను. అంటే ఈ మునుచేర్పు తమిళంలో కూడా ఉందన్నమాట.
పల్లె  మాటల్లో ఇలాంటి సంపద ఎంతో దాగిఉంది మరి. మనమే పట్టించుకోవడంలేదు. నేటి కొత్త తరం అక్కరలకు పనికోచ్చేట్టు కొత్త మాటలను పుట్టించుకోవాలంటే పల్లె వైపు చూస్తే సరి. పండితులను మాత్రం అడగకండి. వారు తెలుగులో దీనికి సరియైన మాట లేదు అని చెప్పి వారికి తెలిసిన సంస్కృత మాట ఒకటి చెప్తారు. పల్లె మాటలంటే వారికి ఏవగింపో మరి ఏమిటో. ముందు వారికివి తెలుసునా అని నా సందేహం.

21, జులై 2012, శనివారం

మా ఊరి మాటల సద్ది మూట (3)

మూడవ ముక్క: మేనిముక్కలు(శరీరభాగాలు)

ఈ వేళ మన ఒంటిలోని ముక్కలను మా ఊరిలో ఏమంటారో తెలుసుకుందాము. నేను ఈ వేళ ముచ్చటకి పెట్టిన పేరు మొదటిసారి చూడగానే ఏదోలా అనిపించవచ్చు. తరచి చూస్తే అందులో  తప్పేమీ లేదని తెల్లమవుతుంది. ఎందుకంటే, మేను అనగా శరీరము మరియు ముక్క అనగా భాగము. కాకపొతే, శరీరభాగాలు అన్న మాటకు మనము అలవాటు పడ్డామంతే. ఇంకా చెప్పాలంటే, పేరు  తెలుగులో ఉంది, సంస్కృతములో కాకుండా.

ఇక అసలు ముచ్చటకు వస్తే,
మా.ఊ.మా.:           English 
తలకాయ/తల/నెత్తి      head
పుర్రె                         skull
కపాలము అని దీన్నే సంస్కృతంలో అంటారు.         
తలెంటికలు/ జుట్టు    hair on head
తలెంటికలు=తల+ఎంటికలు(తల వెంట్రుకలు)
ఎవరైనా తల గీయుంచుకుంటే, ఆ వెంట్రుకలు లేని తలను 'బోడగుండు/బోడిగుండు' లేదా 'బోడనెత్తి' అంటారు.
మాడ                        scalp
తలమీద వెంట్రుకలు మొలిచే తోలు(చర్మము)ను అలా పిలుస్తారు.
కనిగంత
కనుబొమ్మ మీదుగా చెవుల వైపు ప్రయాణం చేస్తే తగిలే గుంట(గుంత)లాంటి ముక్క. ఈ భాగాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటారు. ఇక్కడ ఏదైనా గుచ్చుకుంటే మెదడులోకి తేలికగా దిగే ప్రమాదకరమైన చోటు.
మొకము/మొకం/మొగం  face
ముఖము అన్న సంస్కృత మాటకు తెలుగు పలుకు చేరిందంతే.
నుదురు/నొసట/నొసలు forehead
కండ్లు/కళ్ళు                 eyes
కనుబొమ్మలు              eyebrows
కంటి పైనున్న వెంట్రుకలుగల ముక్క 
కనురెప్పలు                pupils
కంటిగుడ్డు/కనుగుడ్డు     eyeball
కంటిలోపలి గుడ్డు 
కనుగుంట
కన్ను ఉండడానికి వీలుగా చోటిచ్చే పుర్రెలోని గుంత(గుంత)
ముక్కు                     nose
ముక్కుదూలం
ముక్కుకి ఆనుగా ఉన్న ఎముకను ఇళ్ళ పిలుస్తారు. ఇంటికి దూలము ఎలాగో ముక్కుకి ఇది అలాగ అని.
మీసం/మీసాలు           mustache
మీసములోని వెంట్రుకలను మీసాలు అంటారు. కాని ఆ వెంట్రుకల గుంపునంతటినీ మీసముగా అనుకుంటే మీసాలు అన్న మాట దానికి పలుపలుకు(బహువచనము) అవుతుంది. కానీ ఇక్కడ వాడేది ఆ తెల్లములో కాదు.
పెదెం,పెదం,పెదాలు      lip
పైపెదం/పైపెదెం           lower lip
కిందిపెదం /కిందిపెదెం   upper lip
నోరు/మూతి              mouth
దవడ                        jaw
పైదవడ
కిందిదవడ
చిగుళ్ళు                    gums
పండ్లు/పళ్ళు               teeth
ముందరిపళ్ళు , కోరపళ్ళు, దవడపళ్ళు
అంగిలి  
నోటి లోపల వంకర తిరిగి ఉన్న పైముక్క
నాలికె/నాలిక             tongue
కొండనాలికె/కొండనాలిక
నోటి లోపల కొండెక్కి కూర్చున్నట్టుండే చిన్న నాలుక. అందుకే కొండ నాలిక అన్నారేమో.
గడ్డం                       beard and chin
కనుబొమలు కాకుండా ముఖంలో ఉండే వెంత్రుకలనూ, పెదవుల కింద ఉండే ఎముకనూ రెంటినీ ఈ పేరుతోనే పిలుస్తారు. 
చెవులు                      ears 
బుగ్గలు                      cheeks
గొంతు/మెడకాయ/మెడ/కుతిక/సరం neck
ఈ మాటలన్నిటినీ ఆ ఒక్క మేనిముక్కను పిలువడానికి వాడతారు. గొంతు అన్న మాట  నిజానికి రెండు తెల్లములను కలిగియున్నది. ఒకటి  ఒంట్లోని ఒక మేనిముక్కనూ, రెండవదిగా ఆ ముక్కలోంచి వచ్చే చప్పుడు(శబ్దము). కుతిక అనే మాటను మన పుస్తకాల్లో 'కుత్తుక'గా చూస్తూ ఉంటాము. చివరన ఉన్న 'సరం' అన్న మాట సంస్కృత 'స్వరం'కి దగ్గరగా ఉండటాన్ని చూడవచ్చు.
గూడ/బుజం(భుజం)       shoulder
సంక(చంక)                   armpit
రొమ్ము/ఎదుర్రొమ్ము (ఎదురు రొమ్ము)  chest/breast
 ఛాతీ అని పుస్తకాల్లో వ్రాస్తారే అది.
జబ్బలు                        
మగవారికి  ఎదుర్రొమ్మున ఉండే రెండు పలకల్లాంటి ముక్కలు
పొట్ట/కడుపు/బొర్ర          stomach
పొత్తికడుపు
కడుపుకి కొంత కిందుగా ఉండే ముక్క
బొడ్డు
ఈపు(వీపు)            
నడీపు(నడి  వీపు)
వీపుకి నడిమిన(మధ్యన) గల చోటు
నడుం(నడుము)          waist
మొల
మొలమీద బట్టలు లేకుండా ఉంటే దాన్ని దిసమొల అంటారు. నగ్నంగా ఉండటాన్ని దిసమొలతో ఉండడమనీ, బరిబాత అనీ అంటారు. 
చెయ్యి                     hand
మోచెయ్యి                
చెయ్యిని ముడవగలిగేలా ఉండే చోటు 
మణికట్టు                  wrist 
అరిచెయ్యి                palm 

ఇందులో క్రింద కొన్ని మాటలు అందరిలో వాడడానికి  సరియైనవి కానివి ఉన్నాయి. కానీ , మానవ శరీరం అవి లేకుండా పూర్తికాదు. నిండుగా ఉండడానికి మాత్రమే వాటిని ఇక్కడ వ్రాస్తున్నాను. ఇందుకు తప్పుగా అనుకోవద్దని మనవి. వాటినన్నిటినీ వాలు వ్రాతలో వ్రాస్తాను. మీరు వద్దనుకుంటే వాటిని  చదవడం ఆపేయ్యవచ్చు. 

సండ్లు/రొమ్ములు            boobs
సనుమొనలు(చనుమొనలు) nipples
పిర్ర                         buttock
పుస్తకాల్లో దీన్నే పిరుదు అని వ్రాస్తారు. జఘనము అని సంస్కృతములో అంటారు.
ముడ్డి 
వెనుక భాగము.
సుల్లికాయ/సుల్లి/మడ్డ  penis
 పురుష జననాంగం. 
పిచ్చకాయ/పిచ్చ/వట్టకాయ/వట్ట  testicles
వృషణములు  
కుత్త /గుద్ద/పూకు       vagina
స్త్రీ జననాంగం 
ఆతులు                   pubic hair 


తొడ                      thigh 
కాలు                     leg
మోకాలు        
కాలులో నడిమిన ముడవగలిగేలా వీలున్న ముక్క 
పిక్కె/పిక్క
 మోకాలికీ మడిమెకూ నడుమన  ఉండి కాలికి వెనుక పక్క ఉండే కండ 
మడిమె /మడెం
గిలక                      
కాలునూ పాదమునూ కలిపే గుండ్రని కీలు
అరికాలు 
నిలబడినప్పుడు నేలకు ఆనే కాలు ముక్క 
మేగాలు
కాలి వేళ్ళకూ గిలకకూ నడుమన ఉండే కాలి యొక్క ముక్క 

 ఒంటిని కప్పేదాన్ని తోలు అంటారు. వెరసి మన శరీరాన్ని ఒళ్ళు అంటారు. మనకు పద్యాల్లో తగిలే 'ఒడలు' ఇదే. 

పైన చెప్పినవన్నీ మనకు కళ్ళకు కనిపించే మేనిముక్కలు. మన కంటికి కనపడని లోని ముక్కలను ఏమంటారో మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా టపా వ్రాసి తెలుపుతాను. 

15, జులై 2012, ఆదివారం

మా ఊరి మాటల సద్ది మూట (2)

రెండవ ముక్క:కొన్ని వంట పనిముట్లు 
చాన్నాళ్ళ తర్వాత కలుస్తున్నాం మళ్ళీ. ఇయ్యాల(ఈ వేళ), వంట చేయడానికి వాడే కొన్ని పమిముట్ల గురించి చూద్దాం.

మా.ఊ.మా.:
1.బువ్వసట్టి
2.కూరసట్టి 
సట్టి అంటే, గిన్నె (లేదా పాత్ర.ఇది సంస్కృత మాట. చదువుకున్న గొప్ప వారు ఈ మాట వాడుకలోకి తెచ్చారు. సట్టి అంటే వారికి ఎబ్బెట్టుగా ఉంటుంది కదా అందుకే) అని. కొందరు దాన్నే 'తపేలా' అనీ,  'సరవ' అనీ అంటారు. బువ్వ కుండ, కూర కుండ అని కూడా వాడతారు. మునుపు బువ్వా కూరా మట్టి కుండల్లో వండేవారు కదా. అందువల్లనే ఇంకా ఆ మాటల వాడకము ఉంది అని నా అనుకోలు.
3.సిబ్బిరేకు
సట్టి మీద వేసే మూతను అలా అంటారు. చిన్నప్పుడు, గంజి వంచడానికి బువ్వసట్టి మీద ఏదో తీగతో అల్లిన దాన్ని వేసి గంజి వంచేది మా అమ్మ. అది బువ్వమెతుకులు కిందకు పడిపోకుండా అడ్డుకొంటూ గంజిని మాత్రం జారనిచ్చేది. దాన్ని సిబ్బి అంటారు. రేకుతో చేసిన సిబ్బిని సిబ్బిరేకు అన్నారేమో. అలా అయితే దాన్ని రేకుసిబ్బి అనాలి కదా. ఏమో తెలియదు మరి.
4.బువ్వగంటె, కూరగంటె 
బువ్వను, కూరను వేసుకొనేందుకు వాడే గంటెలు(గరిటెలు).
5.గుంటగంటె
పులుసు వెసుకోవడానికి  వాడే గుంటగల గంటె.
6.సెమ్ము(చెంబు)
7.లోటా(ఇది హిందీ  మాట అని అనుకుంటున్నాను), గిలాస(glass), సేమ్సా లేదా చెంచా(హిందీ లో దీన్ని చమ్మచ్ అంటారు ) ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా.
8.కళాయి
నూనెలో వండుకునే వంటలు (అరిసెలు, గారెలు లాంటివి) వండుకునేందుకు వాడేది. కొందరు దీన్ని 'బూరెల మూకుడు' అని కూడా అంటారు. ఇప్పటి వంట పుస్తకాల్లో 'బాణలి' అని దీన్ని పిలుస్తున్నారు.
9.మంగలం 
పెసలు,కందులలాంటివి వేయించడానికి వాడేది. పాత కుండ అడుగును ఇందుకు వాడతారు.
10.బొక్కలగంటె
అప్పాలను నూనెలోనుంచి తీయడానికి వాడేది. బొక్క(చిల్లు,రంధ్రం)లు ఉండే గంటె కాబట్టి బొక్కల గంటె. ఇలాంటిదే బొక్కల గిన్నె లేదా తుళ్లులగిన్నె, పప్పు వడకట్టడానికి  వాడేది.
11.బిందె,కాగు(పెద్దబిందె)
12.కత్తిపీట
పట్నాల్లో దీని వాడకము బాగా తగ్గిపోయింది గానీ కూరగాయలూ మాంసమూ కోయడానికి చాలా అనువుగా ఉంటుంది. కత్తిపీట  అంటే కత్తి  బిగించిన పీట అని.
13. కుండ, బాన (పెద్ద కుండ), మూకుడు (కుండ మీద వేసే మూత), జాడీ

14.కలికుండ
కలి నిల్వ చేసే కుండ. కలి అంటే బియ్యము కడిగిన నీళ్ళూ బువ్వ వండిన తర్వాత వంపిన గంజినీ ఒక కుండలో కొన్నాళ్ళు నిలవ చేయగా పులిసిన ద్రవము. కూర వండడానికి ఏమీ దొరకనప్పుడు ఈ కలిని చారుగా కాచి బువ్వలో తింటారు. మూడు నాలుగు నాళ్ళకు ఒకసారి దీని కడుగుతారు. కొత్తగా ఇల్లు కట్టుకునప్పుడు ఈ కలికుండను వేలుపుగా(దేవతగా) పూజించి ఆ ఇంటి ఆడబిడ్డ(ఆడపడుచు) మొదటగా ఆ కుండలో బియ్యము నీళ్ళూ గంజీ వంపుతుంది.
15.జాంబు
ఇత్తడితో చేసిన ఒక రకమైన చెంబు. ఒంపు సొంపులతో ఒయ్యారముగా ఉంటుంది.
16. అట్ల పెంకు
అట్లు పోయడానికి వాడేది. ఇప్పుడయితే ఇనుముతో చేసినది వాడుతున్నారు . ఇంతకు మునుపు మట్టి  పెంకు వాడేవారేమో . ఇది అట్లు మాత్రమే  పోయడానికి కాక రకకాల అప్పాలు (పలుచనివి) వండడానికి వాడతారు.
17.అట్ల కాడ 
అట్ల పెంకు మీద పోసిన అట్టును తీయడానికి వాడే కాడ 
18. తెడ్డు 
అరిసెలు, బూరెలు వంటివి వండేటప్పుడు బెల్లపు పాకమును కలపడానికి వాడే చెక్క గంటె. ఇది పొడవుగా ఉంటుంది.
19. గిద్దెలు 
కారప్పూస(కోస్తాలో వీటిని జంతికలు అంటారు)ను నూనెలో ఒత్తడానికి వాడే గిన్నెలు. ఈ జంట గిన్నెల్లో ఒక దానికి అడుగున బొక్కలు(రంధ్రములు) ఉండి, మరియొక దానికి ఉండవు. బొక్కలున్న గిన్నెలో పిండి పెట్టి మరో గిన్నెతో ఒత్తితే, పిండి పూసలుగా పడుతుంది. అదే కారప్పూస(కారపు పూస). పిండిలో కొంచెము కారమూ ఇతరాలూ కలుపుతారు.
20.రోలు, రోకలి బండ/రోకలి

21.పెద్ద రోకలి/ పోటు రోకలి
పిండి కొట్టడానికి వాడే పెద్ద రోకలి. దీనికి పిండి కొట్టే చివరన రోకలి పగిలి పోకుండా ఉండేందుకు ఒక ఇనుప ఉంగరము ఉంటుంది. దీన్ని 'పొన్ను' అంటారు. అప్పలు(పిండి వంటలు) వండడానికి కావలసిన పిండి కొట్టడమనేది శ్రమతో కూడుకున్న పని. ఆ శ్రమను మర్చిపోవడానికి, పిండి కొట్టేటపుడు(పిండి కొట్టడమే కాదు ఇంకా చాలా చేయవచ్చు, మునుపు జొన్నలను సద్దలను పిండిగా కొట్టి వండుకుని తినేవారు. అది ఒక్కనాటి పని కాదు, ప్రతినాటి పని) అలసట తీరడానికి పాడుకునే పాటలను 'రోకటి పాటలు' అంటారు. జానపద సాహిత్యములో ఇవి కూడా ఒక ముక్క. ఈ పాటలు రోకటి పోటుకి(దెబ్బకు) అనుగుణముగా ఉంటాయి.
22.పొత్రము
పిండి రుబ్బడానికి వాడే రాయితో చేసిన పనిముట్టు. పచ్చళ్ళు నూరడానికి రోకలి ఎలాగో, పిండి రుబ్బడానికి పొత్రము అలాగా. కాకపొతే రోలు రెండిటా ఉంటుంది అవసరాన్ని బట్టి పెద్దదీ, చిన్నదిగా.
22.ఇసుర్రాయి(విసుర్రాయి)
కొన్ని చోట్ల దీన్నే తిరగలి అని అంటారు. విసుర్రాయి=విసురు రాయి
కందులూ  పెసలూ వంటి పప్పు గింజలను పప్పుగా విసరడానికి వాడే రాతి పనిముట్టు. గుండ్రముగా రెండు మందపాటి రాతి పలకలు ఒక దాని మీద మరొకటి కూర్చుని ఉంటాయి. క్రిందది కదలదు. ఈ క్రింది రాతి పలకకు నడిమినగల బొక్కలో ఒక చెక్క ముక్క బిగించి ఉంటుంది. పైన ఉండే పలక కూర్చోడానికి వీలుగా దానికి ఒక బొక్క ఉండి రెండు పలకలూ సరిగ్గా అమరేలా ఏర్పాటు ఉంటుంది. ఆ బొక్కలో పప్పు గింజలను పోసి పైపలకను తిప్పుతూ ఉంటే  పచ్చెలుగా(బద్దలుగా) పప్పు విడివడి రెండు పలకల నడుమనుండి క్రిందకు జారుతూ ఉంటుంది.
23.కవ్వము
సల్ల(మజ్జిగ) చిలకడానికి వాడేది. సల్ల చిలికినప్పుడు ఎన్నె(వెన్న) దీనికి అంటుకుంటుంది. ఈ వెన్నను తీసి కాచి నెయ్యి తీస్తారు.
24. పళ్ళెము/కంచము
వండిన వంటలను పెట్టుకుని తినడానికి వాడేది. ఇది తెలియని వారుంటారని నేననుకోను.
25.ఉట్టి
పెరుగు, పాలు లాంటివి క్రింద పిల్లలకూ, పిల్లులకూ అందకుండా పైన పెట్టే తాళ్ళతో చేసిన ఏర్పాటును అలా పిలుస్తారు. దీని మీద ఒక సామెత కూడా ఉంది. ఉట్టికి ఎగరలేనమ్మ నింగికి ఎగరాలనుకున్నట్టు అని . దాని తెల్లము ఏమంటే చిన్న పనే చేతకాని వాళ్ళు చాలా పెద్ద పనిని చేయాలనుకోవదమును ఇలా సామెతతో పోల్చి చెప్తారు.
26.బొచ్చెలు 
వంటకు వాడే గిన్నెలన్నింటిని కలిపి ఇలా పిలుస్తారు.ఆ లెక్కన మా కాడ (మా దగ్గర, మా తావులో) 'బొచ్చె' అన్ని మాటకు రెండు తెల్లములున్నవి. కంచము లాంటి దాన్నీ, ఏదైనా వంట పనిముట్టునూ రెంటినీ ఆ పేరుతోనే పిలుస్తారు.  వంటకు వాడిన బొచ్చెలను 'అంట్లు' అంటారు. వంట ముగిసీ, తినగానే అంట్లు కడగాలంటారు.


వంట పనిముట్లే కాకుండా కొన్ని వేరే మాటలు దొర్లాయి గమనించారా? 
బొక్క, ఆడబిడ్డ, పొన్ను, రోకటి పాటలు, పోటు, పచ్చె, సల్ల మొ||.

ఒక చిన్న మామూలు కుటుంబములో ఉండే కొన్ని వంటపనిముట్ల జాబితా ఇది. ఆర్ధిక స్తోమతను బట్టి కొందరు రకరకాల వంటల వండుకోవచ్చు. వాటికి రకరకాల పనిముట్లు వాడుతుండవచ్చు. అన్నింటినీ ఒక చోట ఒకేసారి కూర్చి వ్రాయడము కొంత ఇబ్బందిగా ఉంటుంది. అన్నీ కావలసినప్పుడు గుర్తుకు రావు. అందుచేత అవసరాన్ని బట్టి, ఎక్కడ తగిలితే అక్కడ ఈ పనిముట్ల గురించి చెప్తుంటాను. ఇప్పటిక సెలవు.




17, మే 2012, గురువారం

మా ఊరి మాటల సద్ది మూట(1)


మొదటి ముక్క(భాగం): 

చిన్న ఊరే కదా ఎక్కువ మాటలు ఉండవనుకుంటే పొరపాటే. అలా తలపోస్తుండగానే ఎన్నెన్ని మాటలు కదలాడాయి నా కళ్ళ ముందు. ఊరిలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు. అది కులాన్ని బట్టి(ఇది ముమ్మాటికీ నిక్కము. ఇలా కులం పేరు ఎత్తడం అంత బాగలేక పోయినా, ఊర్లల్లో ఉన్న సంగతది. దాన్ని ఎలా మరువగలం?), బ్రతకడానికి చేసే పనిని బట్టి, మనిషిని బట్టి ఇలా రకరకాలుగా మారుతుంది. మచ్చుకి, కృష్ణా పెవ్వంటెకము(జిల్లా) నుండి వచ్చి మా ఊరిలో కుదురుకున్న వారి మాటలు వేరుగా ఉంటాయి. వారు మా ఊరిలో ఉండబట్టి చాలా ఏండ్లు గడుస్తున్నా వారి మాటల్లో తేడా తెలుస్తూనే ఉంటుంది. ఇంకా దూర నాడులలో చుట్టాలు(బంధువులు) ఉన్న వారి కొన్ని మాటలు కొంత తేడాగా  ఉంటాయి. మంది చిన్నప్పటి నుండి ఏ మాట అలవాటయితే దాన్నే వాడతారు .అది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. మా అమ్మ మా నాన్నను 'నాన్న' అని పిలవాలని నాకు నేర్పి, ఆమె మాత్రం వాళ్ళ నాన్నను( మా తాతను) 'అయ్యా 'అని పిలుస్తుంది.  ఇలా ఒక్క చిన్న ఊరిలోనే ఇన్ని తేడాలున్న నుడిని, వారి మాటలను ఒక్క చోట కూర్చాలనుకోవడం కడలిని కడవన బట్టాలనుకోవడమే కాదా? ఇంకా నేను చూడని మా ఊరు ఎంతో ఉంది. నాకు తెలియని మాటలు ఎన్నో ఉన్నాయి. అయినా తెగువ(ధైర్యం)తో ముందడుగు వేస్తే నడక అదే సాగకపోతుందా అని మొదలుపెట్టాను, నా కళ్ళలోంచి మా ఊరిని మీకెల్లరకు చూపించడానికి (నాకు అదనంగా రెండు కళ్ళు ఉన్నాయిలెండి). నాకు ఏ మాటో గుర్తుకు రాక పోతేనో, తెలియక పోతేనో, మా అమ్మనాన్న ఉండనే ఉన్నారు తెలియజెప్పడానికి. వాళ్ళు నాకింకా ఎన్ని నేర్పుతున్నారో కదా...   

ఎక్కడ మొదలు పెట్టాలా అని తలపోసి తలపోసి, చివరికి 'పొద్దు 'తోనే మొదలుపెట్టితే పోలే అనిపించింది.
 మొదటగా ఉన్నదున్నట్టు మాటను యాసతో కలిపి వాసనా, చవీ చెడకుండా వ్రాస్తాను. ఆపై, ఆ మాట వ్రాతలో ఎలా ఉండాలో వ్రాసి, అటు పిదప దాని తెల్లము (వేరే సీమల తెలుగు, సంస్కృతం, ఆంగ్లం లో) వ్రాస్తాను.అక్కర పడిన చోటల్లా చిన్న వ్యాఖ్య వ్రాస్తాను. 

మా.ఊ.మా.  : సంస్కృతం, ఇంగ్లీషు 
౧.పొద్దెక్కింది=sun rose    
 (పొద్దు+ఎక్కింది, పొద్దు=సూర్యుడు)
౨. పొద్దు బొడిచింది= సూర్యుడు ఉదయించాడు
(పొద్దు పొడిచింది, పొద్దు పొడుపు = సూర్యోదయం)
౩. తెల్లారింది= It has dawned
౪.పొద్దున=ఉదయాన
౫.పగులు=మధ్యాహ్నం
౬.పొద్దుగూకింది=sun has set, సూర్యుడు అస్తమించాడు 
(పొద్దు క్రుంగుట, sun going down the horizon)
౭.పైటేల్ల, పైటిపూట=మధ్యాహ్నం సమయంలో , at noon
(  పైటి+ఏల్ల, పగటి వేళ)(పగటి పూట)
౮.పొద్దటి పూట= ఉదయాన, in the morning 
౧౦.మాపటేల్ల, మాడపూట, సందేల్ల= సాయంత్రాన, in the evening
(మాపటి వేళ,మాపు=సాయంతం), (మాపటి పూట), (సంధ్య వేళ)
౧౧.సుక్కలు గాసేటేల్ల(చుక్కలు కాసేటి వేళ)= నక్షత్రాలు కంటికి కనిపించడం అప్పుడే మొదలవుతున్న వేళ
(చుక్కలు ఆకాశానికి కాస్తున్నాయి అనే తెల్లంలో. చుక్కలు(నక్షత్రాలు) నింగికి(ఆకాశానికి) కాస్తున్నాయట, చెట్టుకు కాయలలాగా. ఇందులో కవిత్వం లేదంటారా?)
౧౨.సుక్కలు పొడిచినై (చుక్కలు పొడిచినాయి) = stars have appeared 
౧౩.రెయ్యి, రేయి, రెయి =రాత్రి, night 
 ౧౪ .నడిరెయ్యి =అర్థరాత్రి, midnight 
 (రెయ్యి యొక్క నడిమి: నడిరెయ్యి)
 ౧౫ .కోడి గూసేల్లకు (కోడి కూసే వేళకు) = ఇంకా తెల్లవారకముందే కోడి కూసే సమయానికి
మా ఊర్లో:
 'సమయం' అన్న మాటకు మారుగా 'వేళ'ని వాడుతున్నట్టు మీరు గమనించే ఉంటారు. 'వేళ'లోని 'ళ', 'ల్ల'/'ల' గా మారి, 'వే' తన 'వ'కార తనమును కోల్పోయి, వెరసి(totally) మంది నోళ్ళలో పడి 'ఏల్ల' / 'ఏల' గా మారడం కూడా గమనించే ఉంటారు.ఇన్ని మాటల్లో ఇమిడి ఉన్నా 'పొద్దు' అంటే 'సూర్యుడు' అన్న ఊహ నాకెప్పుడూ రాలేదు, పుస్తకాల చదువుల మహిమ మరి. అలాంటి చదువులు ఏవీ చదవని వారంతా సూర్యుడిని 'పొద్దు' అనే అంటారు.  


తరువాయి ముక్క వేళకు కలుద్దాం మళ్ళీ. 

11, మే 2012, శుక్రవారం

మా ఊరి మాటల సద్ది మూట  

తొందరలోనే మా ఊరిలో మాట్లాడుకునే మాటల సద్దిబువ్వ మూట విప్పుదామనుకుంటున్నాను. మాది ఖమ్మం పెవ్వంటెకము (జిల్లా).  కొద్ది దూరము తూర్పుగా వెళితే క్రిష్ణా పెవ్వంటెకము తగులుతుంది. సుమారు పదియైదు కిలోమీటర్లు దక్షిణముగానూ, పడమరగానూ వెళితే వరుసగా నల్లగొండ, వరంగల్లు  పెవ్వంటెకముల ఎల్లలు తగులుతాయి. మా ఊరి మాటలలో ఆ మూడు పెవ్వంటెకముల మాటల కలయిక చక్కగా చూడవచ్చు. నేను సెలవుల్లో ఊరికి పోయినప్పుడల్లా కొత్త మాటలు నేర్చుకుంటూనే ఉంటాను. తరగని గని మా ఊరు. ఊర్లో ఉన్నప్పుడు మన చుట్టూ ,  ఎప్పుడూ మంది (జనాలు) మాటలాడే పదాల గొప్పతనాన్ని, వాటి తెల్లమును(అర్థము) ఎరుగము. కాని ఎక్కడైనా పుస్తకాల్లో చదివినప్పుడో, ఇంకెక్కడైనా గొప్పవాళ్ళు అనబడే వాళ్ళు  మాటలాడినప్పుడో 'అరె ఇది మన ఊళ్ళో వాడే మాటే, దీని తెల్లం ఫలానా' అని గుర్తుకు వస్తుంది. మీకేమో గాని నాకైతే చాలాసార్లు అలా అనిపించింది.

 మన దగ్గర పండితులని పిలిపించుకునేవారు చిన్నచూపుతోనో, మరెందుచేతనోగాని పల్లెమాటలను పెద్దగా పట్టించుకోలేదు. మనపల్లెలలో మనకి తెలియని మాటలు చాలా ఉన్నాయి. తెలుగులో ఎక్కువ మాటలు లేనందువల్ల ఇతర భాషల (సంస్కృతము, ఉర్దూ, హిందీ, ఆంగ్లము ము..) నుండి మాటలను అప్పు తెస్తున్నామనే సాకు ఊరకే గాలికి ఎగిరిపోయే దూదిపింజ లాంటిది. మొదట మనము మన దగ్గర  వాడుకలో ఉన్న  మాటలు తెలుసుకోవాలి. అచ్చమైన తెలుగు మాటలు పల్లెల్లో కోకొల్లలు. సంస్కృత పండితులకేమి తెలుస్తాయి అవి. వారి చూపుల్లో అవి చదువులేని వారి మాటలు. దేవభాషయగు సంస్కృతమునకు ఇవన్నీ ఏ  పాటి అంటారు. మొన్నటిదాకా తెలుగుకి సంస్కృత రంగు పులిమారు. ఇప్పుడేమో ఆంగ్లము గ్రహణమై పట్టి కూర్చుంది. సగం చచ్చిన మన తెలుగు ఉనికిని ఇతర భాషల ప్రభావాన్నుండి కాపాడుదాం. అందుకే నా వంతుగా మా ఊరిలో మాటలాడే మాటలను ఏరి ఒక చోట కూర్చాలనుకుంటున్నాను. కనీసం ఇప్పుడు వాడుకలో ఉన్న మాటలైనా, చాపకింద నీరులా దెబ్బ తీసిన తీస్తూ ఉన్న  సంస్కృతము వల్లనో, ఉప్పెనలా ఉరికి వస్తున్న ఆంగ్లం వల్లనో మరుగున పడిపోకుండా ఉండాలనేదే నా కోరిక. నేను ఇదంతా చేసేది, వ్రాసేది ఏ భాషమీదా  పగతో కాదు, నా తెలుగు మీద కూరిమి(ప్రేమ) చేత మాత్రమే.  

       నేటికి  మాత్రము నే విప్పబోయే సద్ది మూట వాసన చూపిస్తాను.

మా ఊరి మాట (తెలుగు)              సంస్కృతము                              ఆంగ్లము
1. మొత్త                                     ద్వారము                            gate, entrance
2.తలమొత్త                    ప్రధానద్వారము, సింహద్వారము      main gate, main entrance 

చూశారా, చక్కని తేలికైన తెలుగు మాటలు  ఉంచుకొని మనం  సంస్కృతము వెంటా, ఆంగ్లము వెంటా ఎలా  పరుగులు తీస్తున్నామో.  మరి ఈ మాటలను వాడుకలో పెడదామా? మన భాషలో మాటలాడడానికి సిగ్గుపడడం ఎందుకు?

ఈ మాటలను మీ ఊరిలో ఏమంటారో తెలుసుకోగోరుతున్నాను.

 మన ఏలికలు, ఏలుబడి సాగించే మేడల ముందు, మిద్దెల ముందు ఉంచే పేరుపలకల మీద, అయితే సంస్కృతములోనో  లేకపోతే ఆంగ్లములో ఎందుకు వ్రాస్తారో తెలియడములేదు. వారికి మన (మంది) భాష గిట్టదేమో. లేక తమను గొప్పవారిగా వేరుపరుచుకొవాలనేమో. అందుకేనేమో అందరి భాషలో వ్రాయడము లేదు.  రాతకోతలు జరగనివ్వడములేదు.  అంతా ఆంగ్లములోనే చేస్తారు. తెలుగు పేరు చెప్పి సంస్కృతములో వ్రాస్తారు. మన తలపట్టణం(రాజధాని నగరం)లో ఎన్ని   పేరుపలకలు తెలుగు లిపిలో చూడగలము? అందులో  తెలుగులో(సంస్కృతంలో కాదు, తెలుగులో) ఎన్ని ఉంటాయి? నా లెక్క చొప్పున, తెలుగు లిపిలో కొన్ని ఉన్నాయి, కానీ అవన్నీ తెలుగు పేరు చెప్పి సంస్కృతములో వ్రాసినవే. తెలుగువి లేనే లేవు. దీనికంతటికీ కారణము మన భాష మీద చిన్న చూపే.

ఇకనైనా మేలుకొని మన నుడి(భాష)ను, దాని ద్వారా మన ఉనికిని కాపాడుకుందాం.






     

8, మే 2012, మంగళవారం

ఒక పత్రిక వారికి నేను వ్రాసిన ఉత్తరం..


అయ్యా,
నిండుగా నూరుపాళ్ళ తెలుగు పేరు ఉన్న మీ పత్రిక వాడుతున్న నుడిలో తప్పులు దొర్లడం చాలా బాధను కలిగిస్తున్నది. ఆంగ్లమునుండి కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న మాటలకు మీరు తెలుగు మాటలు కల్పిస్తున్న తీరు కూడా నొప్పి కలిగిస్తున్నది.మచ్చుకు కొన్ని మాటలను మీ ముందుంచుతాను.
'
కాంట్రాక్టర్ ' అన్న ఆంగ్ల మాటకు మారుగా మీరు 'గుత్తేదారు ' అని వ్రాస్తున్నారు. మీరొక్కసారి 'జమీన్ దార్ ', 'దుకాన్ దార్ ' మున్నగు పదాలను గమనించినట్టయితే ఆ పదాల చివర ఉన్న 'దార్ ' అనేది తెలుగు వెనుచేర్పు(ప్రత్యయం)కాదని మీకే తేటగా తెల్లమవుతుంది. ఇందుకు మీరేదొ కొత్త మాట పుట్టించాలనుకోవద్దు. ఇప్పటికే పల్లె మందిలో వాడుకలో ఉన్న మాట 'గుత్తకాడు ' లేదా 'గుత్తగాడు ' అనేది. మీరూ చక్కగా దాన్ని వాడవచ్చుకదా. ఇందులో 'గాడు 'అనేది ఎబ్బెట్టుగా ఉంటుందని అనుకోవద్దు. అలాంటప్పుడు కృష్ణుని కీర్తించేటపుడు మన కవులు చేసిన 'నల్లని వాడు పద్మ నయనమ్ములవాడు ' అనే వర్ణన తప్పంటారా? వారు ఆయనను కించపరుస్తున్నరంటారా? ఇలాంటి సంకరాన్ని ఆపండి. తెలుగు ఒక ద్రావిడ భాషయని గుర్తెరగండి. ఇప్పటికే చాలమంది తెలుగంటే సంస్కృతం, ఉర్దూ, హిందీ మరియు ఆంగ్లముల కలబోత అని అంటున్నారుమరోమాట ఏమిటంటే ఏవైనా కొత్త మాటలు పుట్టించేటపుడు సంస్కృతమునండి ఎందుకు వెర్రిగా అరువు తెచ్చుకుంటున్నారు? తెలుగుకి ఆపాటి పాటవము లేదని మీరు గట్టిగా నమ్ముతున్నరా? ఇప్పటికే వేల యేళ్ళుగా మన తెలుగు కొందరి చేత చిక్కి మన నుడి అనేది సంస్కృతమునుండే పుట్టిందనిపించేలా తయారయ్యింది. అందుకు ఎవరు కారణమో మనందరికీ తెలుసు. మీరింకా అదే తలస్తున్నట్లయితే అది గుండెలు బాదుకోవలసిన సంగతి. పక్కనున్న తమిళమువారిని చూసి మన వాళ్ళు భాషా దురభిమానులని ఈసడించుకుంటారే తప్ప మనము మన నుడి మెరుగుకి ఏమాత్రం పాటుపడుతున్నమో ఒక్క సారైనా చూసుకోము. ఇవన్నీ నేనూరకే అనటములేదు. చూడండి.
'
క్లౌడ్ సీడింగ్ ' అనే మాటకు మారుగా 'మేఘమథనం ' అని ఎవరిని సంప్రదించి రాస్తున్నారో, వారెవరో చెప్పినా మీరెలా గుడ్డిగా దాన్ని అచ్చు వేస్తున్నారో తెలియడంలేదు. ముందుగా ఈ అనువాదం తప్పు. నేను ఒక వాతావరణశాస్త్ర చదువరిని. నిక్కమేమంటే ఈ 'క్లౌడ్ సీడింగ్ 'లో మీరు అంటున్నట్టుగా మేఘాలను మథించరు(ఎందుకు ఈ సంస్కృత ఆర్భాటం?) లేదా తేటగా చెప్పాలంటే మబ్బులను చిలకరు వాన పిండడానికి. మబ్బుల్లో సిల్వెర్ అయొడైడ్ అనే రసాయనమును విత్తులుగా వేస్తారు. వాటిచుట్టూ నీటి ఆవిరి చేరి నెమ్మదిగా ఒక చుక్కగా మారుతుంది. అది పెరుగుతూ పోయి తగినంత బరువు కలుగగానే క్రిందకు వాన చుక్కగా పడిపోతుంది.ఇలా మబ్బులలో  ('క్లౌడ్ ') విత్తులు ('సీడ్స్ ')వేయడాన్నే 'మబ్బువిత్తడం '  ('క్లౌడ్ సీడింగ్ ') లేదా 'మబ్బువిత్తుడు ' అని చక్కగా తెల్లము చెడకుండా అనవచ్చు. ఇంగ్లీష్ ఏమాత్రం తెలిసిన వారికైనా తెల్లమయ్యేలా దాని ఇంగ్లీషు పేరు వుంటే మనవారు మాత్రం ఏమాత్రం తెల్లంకాని సంస్కృత పదబంధంతో గుబులు పుట్టించడమెందుకు? అందునా తప్పులను చెప్పడమెందుకు? ఒక్క సారి మీ భాషను మీరు సరిచూసుకోండి. ఏది వ్రాసినా మంది (జనాలు) చదువుతున్నారుకదా అని మీరు పట్టించుకోకపొతే మీరే కోల్పోతారు. అన్నిటికి మించి ఇప్పటికే సంస్కృత పండితుల, ఇంగిలీషు కాన్వెంటుల, ఏలిన వారి పట్టనితనము వల్లా దాదాపు చచ్చిన తెలుగమ్మ పూర్తిగా చావడానికి మీ వంతు మీరు చేసిన వారవుతారుపతాక శీర్షికలు చూడగానే ఆకర్షించేలా ఉండాలనో, ప్రాసగా ఉంటాయనో మీ ఇష్టం వచ్చినట్టుగా హిందీ, ఉర్దూ, ఇంగిలీషు పదాలను కలపకండి. మీ సంస్కృత పాండిత్యమో లేదా మీకు భాషలో సలహాలిచ్చేవారి పాండిత్యమో మంది మీద రుద్దకండి. మీ తెలుగు పత్రికలోని కఠిన సంస్కృత పదాలకు కొన్ని తేట తెలుగు మాటలను క్రింద ఇస్తున్నాను.
కఠిన సంస్కృతం : తేట తెలుగు
సమావేశము : కూడిక (మంది ఒక చోట కూడుట
ధర : వెల (చక్కగా కూరగాయల వెల అనండి)
నిర్మాణము :కట్టడము
నియమము :కట్టడ
నియంత్రించు :కట్టడిచేయు
ఙానము :ఎరుక (ఎరుగుటనుండి, ఈ మాట ఇప్పటికీ తెలంగాణలో వాడుకలో ఉంది భారీ :పెను 
రక్తం :నెత్తురు
నిందించు :యెగ్గులు పెట్టు
క్రీ.పూ. :క్రీ.ము. (క్రీస్తుకు ముందు)
క్రీ.:క్రీ..(క్రీస్తుకు తర్వాత)శతాబ్దం :నూరేడు
శతకం (సెంచరీ) : నూరకం
మధ్య :నడుమ
ప్రభుత్వం (సర్కారు) :ఏలుబడి 
కృష్ణ బిలం :చీకటి గుంట లేదా నల్లని గుంట(ఇంగిలీషులో కూడా తేలికగా 'బ్లాక్ హోల్స్ ' అంటారు. మీ పదంలోని 'కృష్ణ ' అన్న మాటకి 'నల్లని ' అనే తెల్లము ఎందరికి తెలుసునని మీరనుకుంటున్నారు?)
శిశువు :చంటిబిడ్డ 
విఙాపన : మనవి, వేడుకోలు

ఇకపోతే, మీరు అక్కరలేని హిందీ,ఉర్దూ పదాలనెన్నిటినో మంది మీద రుద్దుతున్నారని గురుతెరగాలి.'వేల పొస్టులు భర్తీ ' అంటారు. 'భర్తీ ' అంటే ఏమిటి? 'నింపకం ' అని అనవచ్చుగా? ఇది ఏమి అంటే, తెలుగులో చాలినన్ని పదాలు లేవు కాబట్టి ఇతర భాషా పదాలు వాడుతున్నమని మీరు చెప్పుకురావచ్చు. మొదట మీరు తెలుగులో ఇప్పటికే ఉన్న పదాలను బాగా తెలుసుకోండి. కొత్త మాటలను పుట్టించాలి తప్పదు, నానాటికీ పెరిగిపోతున్న అక్కరల వల్ల. కాదనను. మీరు ఒక్కమారు తమిళ పత్రికలవైపు చూడండి, వారు ఎలా నెట్తుకొస్తున్నారో.దాన్ని చూసి నేర్చుకోండి. మీది ఎక్కువ పంపకం గలిగిన పత్రికవారు గనక, మీరొక్కసారి ముందు నడిచి తోవతీస్తే తక్కినవారు మీ వెంటే నడుస్తారు. తెలుగు నుడిని కాపాడే గొప్ప వీలు మీకు ఉంది. గిడుగు వారు ఆనాడు నింగిన వెళ్తున్న తెలుగు నానుడిని (సాహిత్యాన్ని) నేలకు దింపినా అది సొంతపల్లెవారిని, వారిమాటలను చీదరించుకొని సంస్కృతవాడలవైపు, ఉర్దూ హిందీ డేరాలవైపు వడిగా పరుగుతీస్తూనే ఉన్నది. ఇన్నాళ్ళూ చదువు కొందరి సొత్తుగా ఉండటంచేత 'ఎల్లభాషలకు జనని సంస్కృతంబె 'అన్నా, తెలుగు అనేది కల్లు కొట్లకాడ ఊళ్ళళ్ళో మాట్లాడుకోడానికేతప్ప శాస్త్రసాంకేతిక విషయాల్లో వాడటానికి పనికి రాదన్నా చెల్లిపోయింది. ఇప్పుడిక ఆ పప్పులుడకవు. ఇప్పుడిప్పుడే అన్ని కుదురులవారికి చదువు చేరువవుతున్నది. వేల యేళ్ళుగా తమను ఎవరు ఎలా మోసగిస్తున్నరో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. రెండవ భాషా పోరాటం తప్పక వచ్చి తీరుతుంది.
ఇది సగటు తెలుగువాడి ఆవేదన. తేటతెలుగున వ్రాసిన అన్నమయ్య పాటలకెన్నిటికో మనకు తెల్లములు తెలియక తలబాదుకుంటున్నాము. మొదట్లో వేమనగారి పద్యాలను సాహిత్యమే కాదని చాలా యేళ్ళుగా పక్కకి పెట్టిన పెద్దలు, మంది నోట ఆయన మాటలు నిలిచినందున తెలుగునాట ఆయన ఒక గొప్ప కవి అని ఇప్పుడు చెప్పుతున్నారు. ఎందుకు అచ్చ తెలుగును పక్కనబెట్టుతూ వస్తున్నారు పెద్దలనబడే కొందరు? ఇన్నాళ్ళూ సంస్కృతవెంట పడ్డారు, మరి ఇప్పుడేమో ఇంగిలీషు వెంట. ఏలికలకు ఇది ఎందుకు పట్టదు? మీడియా వారు ఎందుకు ఏలుబడిని నిలదీయరు?తెలుగు మన రాష్త్రంలో అధికార భాష అని కాగితాల మీద ఉంది కానీ అమలవటంలేదు. ఒకపక్క తమిళనాట హైకోర్టులోకూడా తమిళంలో వాదనలూ, తీర్పులూ జరుగుతుంటే మనదగ్గర మాత్రం అంతా ఆంగ్ల రాజ్యమే. అయితే సంస్కృతము లేదా ఉర్దూ లేనట్లయితే ఇంగిలీషు అంతే కాని తెలుగుని మాత్రము వాడరు. ఇందులో మీరు మార్చవలసిందీ మార్చగలిగేదీ ఎంతో ఉంది. ఇన్ని చెప్తున్ననందున వీడెవడో కారు ఉడిగిన ముసలి అని మీరు అనుకోనక్కరలేదు. నాలాంటి కుర్రకారువారము దీనిమీద తప్పక పోరుతాము.ఒకసారి మీలోని తెలుగుదనాన్ని తట్టిలేపండి. మీరూ మేమూ కలిసి ఏలికలను నిలదీసి నిక్కమైన తెలుగు ఏలుబడిని, మన నుడికి మునుపటి ఉగ్గెన(గౌరవము)ను తెచ్చిపెడదాము.