24, జూన్ 2013, సోమవారం

పంచుకోవడానికి పరభాష

పోయిన వారము నుడిలో వచ్చిన, నా వ్యాసానికి స్పందిస్తూ సుబ్బారావు గారు వ్రాసిన వ్యాసమునకు(http://www.andhrabhoomi.net/content/samagra-drishti) నా ప్రతిస్పందన. 
  • పంచుకోవడానికి పరభాష
  • 25/06/2013
పోయిన వారం వచ్చిన సుబ్బారావు గారి వ్యాసానికి, తిరుగుగా ఈ వ్యాసం వ్రాస్తున్నాను. సుబ్బారావు గారు పోయిన వారం చక్కగా ఇంగిలీషు నుడి యొక్క అక్కరను నొక్కి చెప్పినారు. మనము  నెనరు(అభిమానము)తోనో మరి ఇంకో కారణము వల్లనో సైన్సును తెలుగులో నేర్చినా ఏదో ఒక స్థాయిలో ఇంగిలీషుకి మారక తప్పదని చెప్పినారు. ఇంకా మరి కొన్ని విషయాలను కూడా వారు చెప్పినారు. వాటికి ఒక్కటొక్కటిగా నేను తిరుగు ఇస్తున్నాను. 

నిజానికి, నేను వ్రాసిన వ్యాసము మరీ పెద్దదిగా ఉండడము వలన దానిని దిద్దరి(ఎడిటర్) గారు కొంత కుదించడానికి చేసిన పూనికలో ఒక ముఖ్యమయిన విషయము జారిపోయింది. అదేమంటే, ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఇంటర్మీడియట్ నుండి ఇంగిలీషు మీడియములో చదవక తప్పదు అని. నేను అట్లా చదివిన వాడినే. ఒకప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రమే ఇంగిలీషు మీడియములో ఉండెడిది. ఆ కాలానికి అది సరి పోయింది. ఇప్పుడు ఇంగినీరింగు మెడిసిను మొ వాటి ఎంట్రన్సులు ఇంటర్మీడియేట్ తర్వాత నుంచే మొదలవుతున్నాయి. ఈ పరిస్థితిని మారుద్దామంటే ఇది మన ఒక్క రాష్ట్రంలోనిది మట్టుకే కాదు. జాతీయ స్థాయిలో కూడా ఉన్నది. దీనిని ఇప్పటికిప్పుడు చేయగలిగింది లేదు కావున ఇంటర్ నుండి ఇంగిలీషులో చదవడం అక్కర అని అంటున్నాను. దీనితో తెలుగు పిల్లలు మిగతా చోట్ల ఇమడగలుగుతారు. ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగు పడతాయి. రావుగారి మొదటి సగము వ్యాసానికి ఇదీ నా స్పందన. 

ఇంటర్ నుండి ఇంగిలీషు అంటే, పది దాకా తెలుగులో చదవమని కదా అర్థము. ఇది కూడా ఎందుకు? మొదటి నుంచే అంటే తొలిబడి నుంచే ఇంగిలీషులో నేర్పవచ్చు కదా  అంటే  అంత తొందరగా పరాయి నుడి నేర్పడము వలన రెంటికి చెడ్డ రేవడిలాగా అయిపోతారు పిల్లలు. ఇటు సరిగ్గా తెలుగు రాక అటు ఇంగిలీషు కూడా సరిగ్గా రాని, మొదటి నుంచీ ఇంగిలీషు చదివిన చాలా మంది స్నేహితులు నాకున్నారు.  ఈ ఇబ్బంది ఎందుకంటే, తగిన ఈడు రాక మునుపే వేరే నుడి నెత్తిన రుద్దడము వలన. అప్పుడు పిల్లలు చుట్టూ ఉన్న నుడి అయిన తెలుగులో అలోచించి ఇంగిలీషులో వ్రాస్తారు. అది ఎప్పటికీ మంచి ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి తొలి చదువులు ఒక స్థాయి వరకు మాతృభాషలోనే సాగాలి. ఈలోపు ఇంగిలీషు మీద పట్టు సాధించవచ్చు. ఆ స్థాయి పదవ తరగతి అనుకుంటే, అప్పటిదాకా కొంత సైన్సు ఉండక మానదు. ఆ సైన్సు మాటలు బాగా తెల్లము అవడము కొరకు వీలయినంత వరకు తెలుగులోనే ఉండాలి సంస్కృతములో కాదు అనేది నా వాదన. ఆ తెలుగు మాటలు ఎలా పుట్టించవచ్చో చూపినాను.    అది ఒక పూనిక మాత్రమే అనీ చెప్పాను.  అవే వాడాలి అని కట్టడ కాదు అని కూడా చెప్పినాను. 'కిరణజన్య సంయోగ క్రియ' వంటి గట్టి, పొడుగాటి సంస్కృత మాటలు  బాగా ఊహకు అంది, రావు గారికి తెలుగు మాటలు అస్సలు ఊహకు అందక పొతే నేనేమి చేసేది? సైన్సు, తెలుగు తెలిసి ఎంతో  అనుభవము ఉన్న రావు గారి వంటి వారు ఊహకు అందే తెలుగు మాటలు కల్పించినట్టయితే చాలా సంతోషిస్తారు అందరూ. 

నేను వ్రాసిన అంత పెద్ద వ్యాసము వట్టి పదవ తరగతి వరకు గల సైన్సు టర్మినాలజి గురించేనా అని అడగవచ్చు. అది మాములుగా, ఇంగిలీషు నుండి తెలుగు పేర జరుగుతున్న అనువాదము అంతటికీ వర్తిస్తుంది. తెలుగు నుండి  ఇంగిలీశుకీ మారవలసిన స్థాయిని ప్రయత్నంతో ముందుకూ జరుపుకుంటూ పోవచ్చు. రావు గారు అన్నట్టుగా ఏమిచేయకుండా కూర్చుంటే తన అంతట తాను అది కిందకి జరిగి ఒకప్పటికి ఒకటవ తరగతి కూడా తెలుగులో నేర్పలేని పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాతృభాషలో చదివిన విషయాలు తొందరగా ఒంటపడతాయనేది ఎవరూ కాదనలేని నిజము.

రావు గారు అన్నట్టు గ్రీకు, లాటిన్ వంటి భాషలనుండి మౌలిక పదజాలం గైకొన్నందు వలన కాదు శాస్త్ర్ విజ్ఞానము వ్యాపించిందీ, ఇంగిలీషు ప్రాధాన్యత పెరిగిందీ. అది బ్రిటను పెత్తనము పోగానే అమెరికా వచ్చి ఇంగిలీషు నుడికి అండగా నిలబడినందున. అది ఎవరి పెత్తనము నడుస్తున్నది అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అమెరికా పెత్తనము నడుస్తున్నది కావున ఇంగిలీషు వాడుతున్నాము. రేపు చైనా పెత్తనము పెరిగితే, చైనీసు నుడి నేర్చుకోవాల్సి వస్తుందేమో మనము.

 ప్రజల భాషలు శాస్త్రం చదవడానికి (టర్మినాలజి తయారు చేయడానికి) పనికి రావని రావు గారు చెప్పిన మాట నన్ను చాలా అచ్చెరువుకి గురిచేసింది. శాస్త్రం చదవడానికీ, ఆ శాస్త్ర మాటలు మారని భాషల నుండి(అంటే మన విషయములో, సంస్కృతము నుండి) మట్టుకే తీసుకోవాలంటే మరి జపనీసు, చినీసు, యూదు భాషల సంగతి ఏమిటి? వారంతా తమ తమ భాషలలోనే సైన్సు చదువుతున్నారు కదా. వాళ్ళు, ప్రపంచ భాష అయిన ఇంగిలీషులో చదువుతున్న మన కన్నా ఎంతో ముందున్నారు కదా. ఇంగిలీషు యొక్క అక్కరను నొక్కి చెపుతున్నట్టుగా అనిపించినా తమ వోటును సంస్క్రుతానికే వేసారు రావు గారు. ఇది వారికి సంస్కృతము మీద ఉన్న నెనరు(అభిమానము)నూ తెలుగు మీద ఉన్న చిన్న చూపునూ  తెలుపుతున్నది.  సంస్కృతమును ఎవరూ తెలుగు వారి నెత్తిన రుద్దలేదు అనడమూ, జన వ్యవహారములో లేని మాటలు (నేను వ్రాస్తున్న తెలుగు మాటలు) వాడడము ఎందుకు అనడమూ(వారు వాడుతున్న సంస్కృత మాటలు ప్రజలంతా ఒక్కరూ తప్పకుండా వాడుతున్నారా మరి?), 'అచ్చ తెలుగు పిచ్చి' అనే అభ్యతరకర మాట అనడమూ ఇందుకు సాక్ష్యాలు. ఇది సరి అయిన పధ్ధతి కాదు. సంస్కృతాన్ని తెలుగు నెత్తిన రుద్దినారా లేదా అన్నదీ ఎవరు రుద్దినారు అన్నదీ లోకమెల్ల ఎరిగిన విషయాలే. బ్రాకెట్లలో నేను అర్థములిస్తూ తెలుగ మాటలు వ్రాస్తున్నది , మరుగు పడిన తేట తెలుగు మాటలను వాడుకలోకి తేవడము కొరకె.  అందులో ఏవీ నా సొంత మాటలు కాదు. పత్రికల్లోనో పుస్తకాల్లోనో నేను చదివి నేర్చుకున్న మాటలే. తెలియని తెలుగు మాటలు ఒక్కటి కూడా నేర్చుకోవద్దూ సంస్కృత మాటలు తెలిసినా తెలియక పోయినా వాడేద్దామూ అనే వారికి నేను చెప్పగలిగిందేమీ లెదు. 

నిజానికి సైన్సు చదవడానికి పలానా  నుడి పనికి రాదు అని అనలేము. కావలసిందల్లా ఆ నుడిని వాడేవారు ఉండడమూ, ఆ నుడికి ఊతము అందిస్తూ ప్రభుత్వము ఉండడమూ. ఆ మంది ఎంత ఎక్కువగా ఉంది, ఆ ప్రభుత్వము ఎంత గట్టిగా ఉంటె సైన్సుని ఆ నుడిలో చదవడము గానీ, కొత్తది పుట్టించడము గానీ అంత తేలిక అవుతుంది. ఎవరికి వారే తమ సొంత భాషల్లో సైన్సు చదివితే మిగతా పప్రపంచముతో సంబంధము తెగిపోయి, ఒంటరి అవుతారు అని అనవచ్చు.  ఒకరికి తెలిసింది మరొకరితో పంచుకోవడానికి ఇంగిలీషు లాంటి నుడి ఉండనే ఉన్నది గదా. ఇప్పుడు జపాను వారూ, ఇజ్రాయెలు వారూ, ఇంకా పలు యూరోపు  దేశాల వారూ చెస్తున్నదదె. వారు తమ నుదిలోనే చదువుతూ వేరే వారితో ఇంగిలీషులో వారి జ్ఞానాన్ని ఇంగిలీషులో పంచుకుంటున్నారు.  ఒక్క మాటలో చెప్పాలంటే, మన సమాజము కొత్త విషయాలను లేదా వస్తువులను పుట్టించాలంటే, కనుగొనాలంటే మన నుడికి మించిన నుడి మరొకటి మనకు లేదు. అలా కాకుండా అవతలివారు కనిపెట్టిన దాన్ని మనము వాడుకోగలిగితే చాలునని అనుకుంటే, మన నుడిలో చదవనక్కర లేదు. అందుకు అవతలి వారి నుడి తెలిస్తే చాలు. ఏమి చేయాలో నిర్ణయించండి. 

3, జూన్ 2013, సోమవారం

మాండలికాలతోనే బలిమి(తెలుగులో సైన్సు టర్మినాలజి-2 / science terminology in Telugu-2)



http://www.andhrabhoomi.net/content/dialects

తెలుగు మాటలు మంది (ప్రజలు)లోకి తొందరగా చొచ్చుకుపోతాయి. మరికొందరంటారు శాస్త్ర పదాలు అర్థమవక్కరలేదు అని. అంటే వారి వాదమేమంటే, సంస్కృత పదాలు తెల్లము(అర్థము) అయినా కాకపోయినా అవి సంస్కృతములో ఉండనివ్వాలి లేదా కొత్త మాటలు పుట్టించినా అవి  సంస్కృతములో ఉండాలి అని గుడ్డిగా వాదిస్తారు. వారిది సంస్కృత భాష మీది నెనరు(అభిమానము) కాక మరేమీ కాదు. వారి వాదన చొప్పున చదివే పిల్లలకు, నేర్పే పంతుళ్ళకు  ఈ మాటలు అర్థం కాకపోయినా పర్వాలేదు. మరి అలాంటప్పుడు, ఈ చదువులన్నీ ఎవరి కొరకు? సంస్కృతం తెలిసిన కొద్దిమంది కొరకా? లేదా ఆ మాటలు పుట్టించిన పండితుల కొరకా? అంటే తెలుగులో చదవాలంటే, ముందుగా అందరూ సంస్కృతం విధిగా నేర్చుకొవలెనేమో ..! 


అసలు ఈ శాస్త్ర మాటలు అర్థం కావడము గురించిన గొడవ ఎందుకంటారా? ఎందుకంటే, అవి అర్థము అయినప్పుడే శాస్త్రం బాగా ఒంటపడుతుంది కాబట్టి. ఇప్పటిదాకా ఉన్న విషయాలు బాగా తెలిస్తేనే కదా కొత్తవి కనిపెట్టేదీ శాస్త్రం ముందుకు పోయేదీ. కొత్తగా కనుగొన్న విషయాలకుగానీ, వస్తువులకుగానీ పేర్లు పెట్టాలంటే అవి ఆ శాస్త్రవేత్తలకు అర్థమయ్యే భాషలోనే ఉండాలి. అంతేకానీ తేపతేపకూ (ప్రతిసారికీ) సంస్కృత పండితుల దగ్గరికి ఉరికిపోలేముగదా.  శాస్త్రం నేర్వడములో  సగపాలు ఆ శాస్త్ర మాటలు నేర్వడమే..! అందుకే 'టర్మినాలజి' వీలయినంత తెలుగులో ఉండాలి అని మొత్తుకునేది. 

 ఇప్పుడు మనమంతా గొప్పగా చెప్పుకునే ఇంగిలీషు నుడిలో ఒకప్పుడు ఏబది నుంచి అరువది వేల మాటలు ఉండేవి. మరి ఇప్పుడు అవి దాదాపు పది లక్షలకు చేరినవి. ఇందులో సగపాలు శాస్త్ర మరియు సాంకేతిక మాటలే అంటే నమ్మగలరా?. దానివలన తెలిసేదేమంటే, శాస్త్రము ముందుకు పోతున్నాకొద్దీ ఆ నుడిలో మాటలు పెరుగుతుంటాయి. అయితే ఈ మాటలను పుట్టించేదెవరు? ఎవరో కొద్దిమంది పండితులు మట్టుకు కాదు. మరి ఎవరు? ఆయా పనులు చేసే వారు అంటే శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డాక్టర్లు, రోగులు, బేరగాండ్లు(వ్యాపారులు), వాడుకరులు, కూలిపనివారు, చదివినవారు, చదివనివారు... ఈ పనివారలు పుట్టించిన మాటలు ఒప్పుకొనబట్టే, పొత్తాలకు ఎక్కించబట్టే ఈనాడు  ఆ నుడి అంత పెరిగినది. అంతే కానీ ఆ మాటలు ఎవరో కొద్దిమంది పండితులు పుట్టించినవి కావు.  మరి మనదగ్గర పరిస్థితి ఏమిటి? జనుల మాటలు పుస్తకాల్లోకి ఎక్కేందుకు పనికి రావు అంటారు పెత్తనములో ఉండేవారు. అది నీచభాష అంటారు. ఇంకా అనేక నిందలు వేసి మంది పుట్టించిన మాటలను దూరము చేస్తారు. కొద్ది మంది కలసి నుడిని అదుపు చేయపూనుకుంటారు. ఈ నుడి అదుపరులు  అదే ఇంగిలీషు నుడిని మచ్చుగా చూపెట్టి, వాళ్ళు వేరే నుడులనుండి అరువు తెచ్చుకున్నారు కాబట్టి మనమూ అరువు తెచ్చుకుందాం అంటూ తాము చేసే తెలుగును మట్టుబెట్టి సంస్కృతానికి పట్టముగట్టే పనికి ఊత చూపెడతారు. వారి ఉద్దేశములో అప్పు తేవడమంటే సంస్కృతమునుంచే. సరే ఇంగిలీషు వారిలాగే అప్పు తెద్దాం కానీ ఎప్పుడు? మన దగ్గర కావలసిన మాట లేకపోతె, మనకు కొత్తది పుట్టించ వీలుకాకపోతే/చేతకాకపోతే, మన తోబుట్టు నుడుల దగ్గర కూడా లేకపోతే, అప్పుడు వేరే నుడులనుండి అప్పు తేవాలి. మన ఇంట్లో ఉన్న వస్తువులను పారవేసి వేరే ఊరి ఇంటి నుంచి అప్పు  ఎవరైనా తెస్తారా? కావాలంటే ఇంగిలీషు వాళ్ళని చూడండి. వాళ్ళ కొత్త మాటలు పుట్టించడానికి కావలసిన 'కుదురు మాటలు'(క్రియా ధాతువులు) వారి దగ్గర లేకపోతే ఏ లాటిన్ నుంచో, గ్రీక్ నుంచో లేదా ఆ భాషా కుటుంబములోని మరో భాష నుండో తీసుకుంటారు కానీ చైనీసు నుడి నుంచో అరబిక్ నుడి నుంచో కాదు. కొన్ని పేరుపలుకులు (నామవాచక) అంటే వస్తువుల లేదా జంతువుల పేర్లు వేరే భాషలనుండి తీసుకోవటము వేరే ముచ్చట(విషయము) అని గమనించగలరు. 

ఈ నడుమ, ఒక మాటామంతి (ఇంటర్వ్యూ)లో, మునుపటి తెలుగు అకాడెమీ డైరెక్టరుగారొకరు  'తెలుగు పాఠ్యపుస్తకాల్లో సంస్కృత మాటలు' అనే విషయంపై మాట్లాడుతూ, ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ వారి సూచనల మేరకు 'టర్మినాలజి' సంస్కృతంలో తయారు చేసామని చెప్పినారు. ఈ విషయాన్ని ఒక సారి తరచిచూద్దాము. కేంద్ర ప్రభుత్వపు పెత్తనము కింద పని చేసే సంస్థలన్నిటిలో పెత్తనపు నుడి(అధికార భాష)గా హిందీ యొక్క వాడకము తప్పనిసరి. అలాంటి ఒక సంస్థలో పని చేస్తున్న నా యెరుక(అనుభవము) ఏమంటే, హిందీవారు కష్టపడి తయారు చేసిన శాస్త్ర  టర్మినాలజి(సంస్కృతం నుండి) హిందీ వారే వాడడము లేదు. అది వ్రాతలలో మాత్రమె ఉన్నది. మచ్చుకు 'ఇంజినీరు'ని 'అభియంత' అన్నారు. ఆ మాట ఎంత మంది వాడుతున్నారు?  సంస్కృతముతో నేరుగా చుట్టరికము ఉన్న భాషలకు లేని ఆరాటము, దానితో చుట్టరికము లేని మనకెందుకు? మన దేశమంతా శాస్త్ర మాటలు ఒక్కటిగా ఉంటె అందరికీ అర్థమవుతాయనే ఉద్దేశముతో సంస్క్రుతమునుంచే శాస్త్ర మాటలు పుట్టించమని ఆ కేంద్ర సంస్థ వారు అని ఉంటె, మన వారికి అర్థమయినా కాకపోయినా వారి సూచనలు తలదాల్చవలసిన అక్కర మనకు ఏమిటి?

ఏ రకముగా చూసినా తెలుగులో శాస్త్ర మాటలు సంస్కృతము నుంచి తేవడము సరియైనది కాదు. ఆ మాటకొస్తే ఏ నుడి నుండి అయినా నూటికి నూరు పాళ్ళు అప్పు తేవడము సరికాదు.  పైన చర్చించిన ఇక్కట్టునుండి బయటపడడానికి రెండే రెండు దారులు ఉన్నాయి. ఒకటి, వీలయినంతవరకు శాస్త్ర మాటలు తెలుగు కుదురు నుంచి పుట్టిస్తూ, అక్కడ దొరకకపోతే తోబుట్టు ద్రావిడ నుడులనుండి తీసుకుంటూ ,అక్కడా దొరకకపోతే ఇంగిలీషూ సంస్కృతముతో పాటు ఏ  నుడి నుండయినా అప్పు తెచ్చుకొని తెలుగు నుడికారానికి తగ్గట్టుగా మలుచుకోవడము. రెండవది, ఈ గాసి(కష్టము) ఏదీ లేకుండా ఇంగిలీషు టర్మినాలజిని ఉన్నదున్నట్టుగా తెలుగు పుస్తకాల్లో వాడుకోవడము. ఈ రెంటిలో దేన్ని ఎన్నుకోవాలో మనము నిర్ణయించుకోవాలి. తన్నెనరు(స్వాభిమానము) లేకపోతే రెండవ దారి వెంబడి పోదాము. కానీ శాస్త్రము యొక్క ప్రాముఖ్యత తెలిసినవారెవరూ ఆ పని చేయరని నా అనుకోలు(అభిప్రాయము). 

ఈ ముచ్చట్లన్నీ చదివి తెలుగులోనే శాస్త్ర టర్మినాలజీ ఉండాలని ఒప్పుకొనే వారెవరికయినా ఒక అరగలి(సందేహము) కలుగక మానదు. అదేమంటే, తెలుగు నుడి తావును బట్టి మారుతుంటుంది. ఒక్కోచోట ఒక్కోరకముగా ఉంటుంది. అలాంటప్పుడు, కొత్త మాటల  పుట్టింపులో ఏ తావు మాటలు వాడాలి? దీనికి తిరుగు ఏమంటే, అన్ని తావుల మాటలు వాడవలెననడమే. ముందుగా, వేర్వేరు తావులలోని మంది మాటలను ఒక చోట కూర్చాలి. వాటిల్లోంచి తేలికగా ఉన్నట్టీ వాటినుండి ఎక్కువ మాటలు పుట్టించగలిగే వీలున్న మాటలను, ఎట్టి  తావు తేడాలు చూపకుండా తర్కబద్ధముగా  ఎంపిక చేసి వాటి నుండి టర్మినాలజీని తయారు చేయాలి. అప్పుడు అందరూ ఒప్పుకుంటారు లేకపోతె కత మళ్ళీ మొదటికి వస్తుంది. మన నుడి పెక్కు మాండలికములతో అలరారే కలిమిగల నుడి. ఇందులో  ఏ మాండలికమూ తక్కువ కాదు ఏదీ ఎక్కువ కాదు. ఒక మాండలికపు మాట మరో మాండలికపు వారికి తెలియకపోతే నేర్చుకోవాలి. మనము ఎంతో కష్టపడి వేరే నుడులు నేర్చుకొనేటప్పుడు లేని అడ్డంకులు మన తెలుగులోని మరో మాండలికపు మాటలు కొన్ని తెలుసుకోవడానికి ఎందుకు ఉండాలి? నిజానికి ఇది పెద్ద ఇబ్బంది కాదు. మాండలికాల నడుమ కీలకమయిన తేడా యాస మట్టుకే. మొత్తము మాటమూట (vocabulary) కాదు.  వేర్వేరు మాండలికాల వాడకము ఒకప్పుడంటే కొంత ఇబ్బంది అయి ఉండెడిదేమో కానీ వార్తాపత్రికలూ టీవీలూ బాగా పాకిన ఈ కాలములో కాదు. తెలుగులో శాస్త్రము చదవడానికి ఇక అడ్డంకులేవి?
చాలామంది పిల్లలు తెలుగు మీడియము అంటే జడవడానికి (భయపడడానికి) సంస్కృత టర్మినాలజి ఒక కీలక కారణము. కావున శాస్త్రము సరిగా అర్థమవాలంటే, మొదటగా ఆ శాస్త్ర మాటలు సరిగా అర్థమవాలి. ఆపైన, శాస్త్రము చాలా తేలికగా అనిపిస్తుంది. కొత్త కొత్త ముచ్చట్లు(విషయాలు) కనుగొనడము తేలిక అవుతుంది. ఇకనైనా తెలుగులో శాస్త్ర టర్మినాలజీని తెలుగించే విషయాల మీద పెత్తనమున్నవారు మేలుకుని, టర్మినాలజీని వీలయినంత తెలుగులో తేవాలని కొరుతున్నాను. ఇందుకు ఫిజిక్స్ మరియు ఒషనోగ్రఫీ చదివిన వాడిగా నా వంతు తోడ్పాటు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనమంతా పూనుకుంటే తెలుగులో టర్మినాలజీని తయారు చేయడము నిజంగా పెద్ద విషయమని నేను అనుకోను. కలసికట్టుగా పాటుపడి తెలుగును మరింత కలిమిగల నుడిగా, శాస్త్ర నుడిగా మలచుకుందాము. 

తెలుగులో సైన్సు టర్మినాలజీ

 




తెలుగులో సైన్సు టర్మినాలజీ (Science Terminology in Telugu)

    నేను పదవ తరగతి వరకు తెలుగులోనే చదువు సాగించాను. రెండవ తరగతిలోనో, మూడవ లోనో ఉండగా పంతులమ్మ కొన్ని అంకెలిచ్చి, ‘ఆరోహణా క్రమం’ మరియు ‘అవరోహణ క్రమం’లో వ్రాసి తీసుకుని రమ్మన్నారు. నాకు ఒక పట్టాన తలకెక్కలేదు. ఆ ‘ఇంటి పని’ (హోంవర్క్) మా బాబాయి చేసిపెట్టాడు.మరునాడు పంతులమ్మ మెచ్చుకుంది. కానీ తర్వాత పరీక్షలో వ్రాయలేకపోయాను. ఎందుకంటే, మొదటగా ఆ రెండు మాటలకు తెల్లములు గుర్తుపెట్టాలి. ఏది ఎక్కే వరసో, ఏది దిగే వరసో తెలిసేది కాదు. పెద్ద తికమకగా అనిపించేది. ఆ మొదటి ఒకటీ లేదా రెండు అక్షరాలలోనే తేడా ఉంటుంది. అది మొదలు, అలాంటి మాటలు కొరకరాని కొయ్యలుగా, పంటి కింద రాళ్ళలాగా పైకి పోతున్నకొద్దీ చాలా తగిలాయి. మన బడి పుస్తకాల్లో ఇలాంటివి కోకొల్లలు. మచ్చులు: తరంగదైర్ఘ్యము, అకశేరుకము, సంతృప్త ద్రావణము, భాష్పీభవనము, క్షమశీలి, సుప్తావస్థ మొ.

అలాంటి మాటలు ఎందుకు  కష్టంగా ఉండేవో నాకు ఈ నడుమనే తెలిసినది. ఆ ఇబ్బంది ఎందుకంటే అవి తెలుగు మాటలు కావు గనుక. ఎందుకంటే అవి మనకి అర్థముకాని సంస్కృత మాటలు కాబట్టి. పుస్తకాలు వ్రాసేవారు గొప్పలకు పోయి అర్థంకాని సంస్కృత టర్మినాలజీ వాడేకన్నా చక్కగా తెలిసిన తెలుగులో మాటలు వాడవచ్చు కదా అని అనిపిస్తుంది. అప్పుడు అల్లాంటి ఇబ్బంది తప్పుతుంది కదా. ఆ పుస్తకాలను తయారుచేసినవారు గట్టిగా నిర్ణయించినట్టున్నారు తెలుగు నుడి శాస్త్రం చదవడానికి పనికి రాదని. ఇంకా, ఎలాగైనా చేసి అర్థం అయినా కాకపోయినా సంస్కృత మాటలే వాడాలి అనీ. నిజంగా కొందరంటున్నట్టుగా, తెలుగులో టర్మనాలజీకి తగినన్ని మాటలు లేకపోతే, ఆంగ్ల మాటలే ఉన్నవి ఉన్నట్టుగా వాడవచ్చుగా. కఠినమయిన సంస్కృత పదబంధాలను సృష్టించడమెందుకూ దానికి తెలుగు అని పేరుపెట్టడమెందుకూ? ఆంగ్ల మాటలే వాడితే ఆ పండితుల శ్రమ తగ్గేదీ ప్రభుత్వానికి చాలా డబ్బు ఆదా అయ్యుండేదీ. పెద్దబడి (హై స్కూల్) సైన్సు పుస్తకాల్లో జడుపు పుట్టించే కొన్ని మాటలను క్రింద చూపినట్టుగా తేలికగా తెలుగులో ఎందుకు అనకూడదు? 
ఇంగ్లీష్                                           సంస్కృతం                                  తెలుగు
heat                                      ఉష్ణము                             వేడి/ఉడుకు/కాక
temperature                         ఉష్ణోగ్రత                    వెచ్చదనము/ఉడుకుదనము
                                                                                    (పై మాటకు 'దనము ' చేరిస్తే సరి)
thermometer                       ఉష్ణమాపకము                      వేడికొల (వేడిని కొలిచేది)
boiling point                       భాష్పీభవన స్థానం                 ఆవిరగు   తావు/మట్టు  
melting point                       ద్రవీభవన స్థానం                   కరుగు తావు/మట్టు
freezing point                     ఘనీభవన స్థానము               గడ్డకట్టు తావు/మట్టు
latent heat                         గుప్తోష్ణం                       మరుగు వేడి /దాగిన వేడి (దాగియున్న
                                                                                        వేడి;మరుగు=రహస్యము)

 expansion                            వ్యాకోచం                             సాగుదల 
contraction                           సంకోచం                             కురచదల 
friction                                 ఘర్షణ                             రాపిడి/ఒరిపిడి
coefficient                           గుణకం                           హెచ్చరి (హెచ్చించేది)
linear expansion-
 -coefficient                      దైర్ఘ్య వ్యాకోచ గుణకం           పొడవు సాగుదల హెచ్చరి
momentum                         ద్రవ్యవేగము                         ముద్దవడి(ముద్ద లేదా మొత్తమును    
                                                                                                  బలముతో హెచ్చించగా వచ్చేది)
torque                                బలభ్రామకం                   బలపొడవు(బలమును పొడవుతో హెచ్చించగా                  
                                                                                                     వచ్చేది)/
                                                                                    టార్కు (ముందు  చెప్పిన తెలుగు మాట  
                                                                                                                  తికమకగా ఉంటే) 
kinetic energy                     గతిశక్తి                           కదలుసత్తువ
potential energy                 స్థితిశక్తి                      ఎత్తుసత్తువ/అంతస్తుసత్తువ/మట్టపుసత్తువ
Acceleration                       త్వరణం                          వడిపాటు
Blackbody                        కృష్ణ వస్తువు                     కఱ్ఱియురువు
Barometer                        భారమితి                             ఒత్తిడికొల
Bar magnet                   దండాయస్కాంతం             సాయసూదంటు (సాయగా(తిన్నగా) 
                                                                                                                 ఉన్నసూదంటు)
magnetism                       అయస్కాంతతత్వం                  సూదంటుతనం
Atmospheric pressure         వాతావరణ పీడనం                   చుట్టుముట్టుక ఒత్తిడి
Circular motion               వృత్తాకార చలనం                      గుండ్రటి  ఉదిల/పల్లట/వెగడు
Conduction                      వహనం                                పాఱుదల/పారు
Conductor of heat            ఉష్ణ వాహకం                               వేడి పారనిచ్చేది
Conduction electrons      వాహక ఎలక్ట్రాన్లు                       పారే ఎలక్ట్రాన్లు
Convection                    ఉష్ణ సంవహనం                         వేడి కూడిపారు(డు)
Density                           సాంద్రత                             చిక్కదనం/దట్టదనం
Free fall                         స్వేచ్చా పతనం                           విచ్చల పాటు
Wave                              తరంగం                                      అల
Wavelength                    తరంగ దైర్ఘ్యం                                అలపొడవు
Frequency                         పౌనః పున్యం                            తరచుదనం
 capacitor                          క్షమశీలి                               నిలవరి (విద్యుత్తును నిలవ చేసేది)
Longitudinal waves        అనుదైర్ఘ్య తరంగాలు            పొడవెంబడి అలలు (పొడవు వెంబడి అలలు)
                                                                            /ఇరుసెంబడి అలలు(ఇరుసు వెంబడి
                                                                                                        అలలు, ఇరుసు=అక్షము)   
Transverse waves      తిర్యక్ తరంగాలు               పొడమడ్డపు అలలు (పొడవుకి అడ్డంగా ఉండే 
                                                                                                                          అలలు)
                                                                            /ఇరుసడ్దపు అలలు (ఇరుసుకి అడ్డముగా 
                                                                                                                     ఉండే అలలు)
Geographical axis      భౌగోళీయ అక్షం                నేలగుండిరుసు (నేల +గుండు+ ఇరుసు )  
                                                                                       /పుడమిరుసు

పూనుకుంటే ఇలా తెలుగు కుదురు మాటలనుండి, బొచ్చెడన్ని మాటలను పుట్టించవచ్చు. అంతే కానీ, శాస్త్రపదాలంటేనే సంస్కృతమన్నట్టుగా ఉండకూడదు. నిజంగా ఎటు చూసినా తెలుగులో ఏదైనా మాట దొరకకపోతే, మన తోబుట్టు నుడులయిన ద్రావిడ నుడులనుండి అప్పు తెచ్చుకోవచ్చు. అక్కడా చిక్కకపోతే, సంస్కృతమునుండి తెచ్చుకోవడములో తప్పులేదు. అక్కడా దొరకకపోతే, ఇంగిలీషు మాటను కొద్ది మార్పులతో తెలుగించవచ్చును(బస్ --> బస్సు రీతిగా).  పైన నేను మీ ముందు పెట్టిన మాటలు నూటికి నూరుపాళ్ళు సరిపోకవచ్చు. అది ఒక చిరుపూనిక మాత్రమే .  తెలుగు నుడి పలుకుబడి, నడక మరియు శాస్త్రం తెలిసిన వారు మరింత మెరుగుగా తెలుగించవచ్చు.

కొందరు కొన్ని అభ్యంతరాలను లేవనెత్తవచ్చు. మొదటగా, సంస్కృతములో టర్మినాలజి తయారు చేయటము తెలుగుతో పోలిస్తే తేలిక కాబట్టి  సంస్కృతములోనే చేస్తున్నారు అని. అయితే మన నుడిలో తయారు చేసుకోవాలి లేదా శ్రమ లేకుండా ఇంగిలీశునుండి తెలుగుకి తగ్గట్టుగా తీసుకోవాలిగానీ ఇంకేదో నుడిలో తేలిక అని చెప్పి ఆ నుడిలో టర్మినాలజి తయారుచేసి దాన్ని తెలుగువారి నెత్తిన రుద్దడము ఏమిటి? 
ఇంతకన్నా తెలివితక్కువతనము ఇంకా ఏదైనా ఉంటుందా? అవును, సంస్కృతములో ధాతువులూ ఉపసర్గలూ ప్రత్యయాలూ మొదలగు కొత్తమాటల పుట్టింపుకి కావలసిన సరుకు చక్కగా పుస్తకాల్లో వ్రాసారు. కానీ తెలుగులో అంత కృషి జరగలేదు. అంతే కానీ తెలుగు చేవలేని నుడి మట్టుకు కాదు. ఇప్పటికే పుస్తకాలకెక్కిన తెలుగు ధాతువులను కొత్త మాటల పుట్టింపులో ఎందరు వాడుతున్నారు? ఇదే 'నుడి' పుటలో వస్తున్న 'ఆంధ్రదాతుమాల'ను చక్కగా వాడుకోవచ్చుకదా. ఉన్నవాటిని కాదని వేరే నుడుల వెంట పడడమెందుకు? కొంత కష్టమయినా మన పంట మనము పండించుకోవాలిగానీ ఎల్లకాలము ఇతరులనుండి అప్పు తెచ్చుకోవటం సరి కాదు కదా.  ఇప్పటికే శాస్త్ర టర్మినాలజి తయారు చేసినారు గనక వాటిని మార్చపూనుకోవడము, మునుపటి ప్రయత్నాన్ని దండగ చేయడమవుతుందనో, ఇప్పటికే ఇవి ప్రజల్లోకి వెళ్ళిపోయాయి కావున మార్చకూడదు అనో కొందరనవచ్చును.  ఈ అభ్యంతరము సరియయినది కాదు. ఎందుకంటే, చదివేవారికి తెల్లమవడము ముఖ్యము కానీ ఎవరో కొందరు పండితులు కష్టపడ్డారు కాబట్టి, బరువయినా కొరుకుడు పడకపోయినా చివరి వరకూ ఆ మాటలను మోయాలనడము సరికాదు. సంస్కృత మాటలు ప్రజల్లోకి ఇప్పటికే వెళ్ళిపోయాయనే అడ్డంకి కూడా అంత పస గలది కాదు. ఎందుకంటే, శాస్త్ర పదాలు అందరూ చదివేవి కాదు. ఆ శాస్త్రము చదివేవారికి మాత్రమే అవి ఒక ప్రత్యేక తెల్లములను తెలుపుతూ, మిగతావారికి అవేవో వేరే నుడి మాటలలాగా అనిపిస్తాయి. అందునా ఈ మాటలు (ఇప్పటికే ఉన్న సంస్కృత శాస్త్ర మాటలు) ఆ శాస్త్రము  గఱపే(బోధించే) చాలా మంది పంతులయ్య(మ్మ)లకు కూడా సరిగ్గా తెల్లముకావు. ఎవరికైనా సంస్కృతము వచ్చిఉంటే వారికి తెలిసే వీలు ఉంది. 
(మిగతా వచ్చేవారం)