1, ఏప్రిల్ 2012, ఆదివారం

'తొలి పలుకు ' లేదా 'ముందు మాట '

ఎవరికైనా 'మాతృభాష ',' ' కాకుండా 'అమ్మబాస ' మీద మమకారం, పొరపాటున ఉన్నట్టయితే వారందరూ ఇక్కడికి రావచ్చు. అమ్మబాసలో కమ్మని వంటలొండి అందరికి పెట్టవచ్చు, ఇతరుల వంటలు మీరూ తినవచ్చు. మన నానుడిని, మప్పితమును సంస్కృత, ఆంగ్లముల బూజు దులిపి, కడిగి ముగ్గులు బెట్టి అసలు తెలుగిల్లును ఎల్లరకెరుక పరుచుదాం. మన బాసను మనం కాపాడుకుందాం. ఒక్కరి వల్ల అయే పని కాదిది. మనమంతా నడుం బిగించితేనే అవగలదు. ఏలికలకు ఆ ఆసక్తి లేదు. ఎందుకంటే వారికి సంస్కృతం కావాలి. ఆంగ్లం కావాలి. జనాల బాస కాదు వారికి కావలసింది. పాత అనువాద పుస్తకాల్లో మన మప్పితమని ఏది రాసిఉందో అది మన మీద ఇంకా ఇంకా రుద్దడమే వారి పని. మనమచ్చ తెలుగులో మాట్లాడితే అది ప్రామాణికం కాదంటారు. ఊరోళ్ళదంటారు. ఎబ్బెట్టు అంటారు. 'సంస్కృత పద భూఇష్టమైనదే ' తెలుగంటారు. ఇంకా మాట్లాడితే ,'ఎల్ల భాషలకు తల్లి సంస్కృతంబె ' అని మన చెవులు చిల్లులు పడేల డప్పు మోగిస్తారు. మనం కూడ అంతే కదా మరి అనుకుంటాం. ఎన్నాళ్ళనుంచి మనను ఆ జోగులో ఉంచుతున్నారో ఎరగండి. తెలుగొక ద్రావిడ భాషయని మనలో ఎందరికెరుక? ఉత్తారాదినుండి దిగుమతి అయిన కొందరు మన మీద అదే పనిగా రుద్దుతున్నరని తెలవదు మనకు. అట్ట చేస్తే వాళ్ళకు ఒనగూడే మేలేమి అని తెల్ల మొగమేసుకొని అడగవచ్చు. అదే మరి మగత అంటే. వారి పెత్తనం మన మీద సాగాలి కదా. మన మెదడును అంతలా ఉతికారు మరి. ఎందుకంటే ఇన్నాళ్ళ బట్టి వాళ్ళే రాస్తున్నరు. కాబట్టి వాళ్ళు మసి పూసారు మన నిద్దరబోతన్న మొగాలకు.ఇకనైనా మేలుకుని ఆ మసిని కడిగేసి మన బాస ఏందో తెలుసుకుందామనేదే ఈ గోల. ఆ బాసలొనే రాతకొతలన్నీ జరగాలని పట్టుబట్టాలె. అయితే, మరి మాండలికాల మాటేమిటని అడగవచ్చు. అన్నీ కీలకమైనవే. ఎక్కువ తక్కువల్లేవు. ఎన్ని మాండలికాలుంటే అంత కలిమి. ఆ నల్లగా ఉండి పాలిచ్చే దాన్ని, ఒక చోట 'గేదె ' అనీ, ఒక దుక్కున 'బర్రె ' అనీ, ఇంకొక్కాడ 'ఎనుము ' అంటారు. అందులో వచ్చిన చిక్కేమిటి? అన్నీ మనవే. ఒక్కటే మాండలికముంటే ఆ బాస రుచీ పచీ పెద్దగా లేనిదని తెల్లము. మనదలా కానందుకు సంబరపడాలి గాని. తేటపడిందా?
మేలుకో తెలుగోడ మేలుకో.