3, జూన్ 2013, సోమవారం

మాండలికాలతోనే బలిమి(తెలుగులో సైన్సు టర్మినాలజి-2 / science terminology in Telugu-2)



http://www.andhrabhoomi.net/content/dialects

తెలుగు మాటలు మంది (ప్రజలు)లోకి తొందరగా చొచ్చుకుపోతాయి. మరికొందరంటారు శాస్త్ర పదాలు అర్థమవక్కరలేదు అని. అంటే వారి వాదమేమంటే, సంస్కృత పదాలు తెల్లము(అర్థము) అయినా కాకపోయినా అవి సంస్కృతములో ఉండనివ్వాలి లేదా కొత్త మాటలు పుట్టించినా అవి  సంస్కృతములో ఉండాలి అని గుడ్డిగా వాదిస్తారు. వారిది సంస్కృత భాష మీది నెనరు(అభిమానము) కాక మరేమీ కాదు. వారి వాదన చొప్పున చదివే పిల్లలకు, నేర్పే పంతుళ్ళకు  ఈ మాటలు అర్థం కాకపోయినా పర్వాలేదు. మరి అలాంటప్పుడు, ఈ చదువులన్నీ ఎవరి కొరకు? సంస్కృతం తెలిసిన కొద్దిమంది కొరకా? లేదా ఆ మాటలు పుట్టించిన పండితుల కొరకా? అంటే తెలుగులో చదవాలంటే, ముందుగా అందరూ సంస్కృతం విధిగా నేర్చుకొవలెనేమో ..! 


అసలు ఈ శాస్త్ర మాటలు అర్థం కావడము గురించిన గొడవ ఎందుకంటారా? ఎందుకంటే, అవి అర్థము అయినప్పుడే శాస్త్రం బాగా ఒంటపడుతుంది కాబట్టి. ఇప్పటిదాకా ఉన్న విషయాలు బాగా తెలిస్తేనే కదా కొత్తవి కనిపెట్టేదీ శాస్త్రం ముందుకు పోయేదీ. కొత్తగా కనుగొన్న విషయాలకుగానీ, వస్తువులకుగానీ పేర్లు పెట్టాలంటే అవి ఆ శాస్త్రవేత్తలకు అర్థమయ్యే భాషలోనే ఉండాలి. అంతేకానీ తేపతేపకూ (ప్రతిసారికీ) సంస్కృత పండితుల దగ్గరికి ఉరికిపోలేముగదా.  శాస్త్రం నేర్వడములో  సగపాలు ఆ శాస్త్ర మాటలు నేర్వడమే..! అందుకే 'టర్మినాలజి' వీలయినంత తెలుగులో ఉండాలి అని మొత్తుకునేది. 

 ఇప్పుడు మనమంతా గొప్పగా చెప్పుకునే ఇంగిలీషు నుడిలో ఒకప్పుడు ఏబది నుంచి అరువది వేల మాటలు ఉండేవి. మరి ఇప్పుడు అవి దాదాపు పది లక్షలకు చేరినవి. ఇందులో సగపాలు శాస్త్ర మరియు సాంకేతిక మాటలే అంటే నమ్మగలరా?. దానివలన తెలిసేదేమంటే, శాస్త్రము ముందుకు పోతున్నాకొద్దీ ఆ నుడిలో మాటలు పెరుగుతుంటాయి. అయితే ఈ మాటలను పుట్టించేదెవరు? ఎవరో కొద్దిమంది పండితులు మట్టుకు కాదు. మరి ఎవరు? ఆయా పనులు చేసే వారు అంటే శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డాక్టర్లు, రోగులు, బేరగాండ్లు(వ్యాపారులు), వాడుకరులు, కూలిపనివారు, చదివినవారు, చదివనివారు... ఈ పనివారలు పుట్టించిన మాటలు ఒప్పుకొనబట్టే, పొత్తాలకు ఎక్కించబట్టే ఈనాడు  ఆ నుడి అంత పెరిగినది. అంతే కానీ ఆ మాటలు ఎవరో కొద్దిమంది పండితులు పుట్టించినవి కావు.  మరి మనదగ్గర పరిస్థితి ఏమిటి? జనుల మాటలు పుస్తకాల్లోకి ఎక్కేందుకు పనికి రావు అంటారు పెత్తనములో ఉండేవారు. అది నీచభాష అంటారు. ఇంకా అనేక నిందలు వేసి మంది పుట్టించిన మాటలను దూరము చేస్తారు. కొద్ది మంది కలసి నుడిని అదుపు చేయపూనుకుంటారు. ఈ నుడి అదుపరులు  అదే ఇంగిలీషు నుడిని మచ్చుగా చూపెట్టి, వాళ్ళు వేరే నుడులనుండి అరువు తెచ్చుకున్నారు కాబట్టి మనమూ అరువు తెచ్చుకుందాం అంటూ తాము చేసే తెలుగును మట్టుబెట్టి సంస్కృతానికి పట్టముగట్టే పనికి ఊత చూపెడతారు. వారి ఉద్దేశములో అప్పు తేవడమంటే సంస్కృతమునుంచే. సరే ఇంగిలీషు వారిలాగే అప్పు తెద్దాం కానీ ఎప్పుడు? మన దగ్గర కావలసిన మాట లేకపోతె, మనకు కొత్తది పుట్టించ వీలుకాకపోతే/చేతకాకపోతే, మన తోబుట్టు నుడుల దగ్గర కూడా లేకపోతే, అప్పుడు వేరే నుడులనుండి అప్పు తేవాలి. మన ఇంట్లో ఉన్న వస్తువులను పారవేసి వేరే ఊరి ఇంటి నుంచి అప్పు  ఎవరైనా తెస్తారా? కావాలంటే ఇంగిలీషు వాళ్ళని చూడండి. వాళ్ళ కొత్త మాటలు పుట్టించడానికి కావలసిన 'కుదురు మాటలు'(క్రియా ధాతువులు) వారి దగ్గర లేకపోతే ఏ లాటిన్ నుంచో, గ్రీక్ నుంచో లేదా ఆ భాషా కుటుంబములోని మరో భాష నుండో తీసుకుంటారు కానీ చైనీసు నుడి నుంచో అరబిక్ నుడి నుంచో కాదు. కొన్ని పేరుపలుకులు (నామవాచక) అంటే వస్తువుల లేదా జంతువుల పేర్లు వేరే భాషలనుండి తీసుకోవటము వేరే ముచ్చట(విషయము) అని గమనించగలరు. 

ఈ నడుమ, ఒక మాటామంతి (ఇంటర్వ్యూ)లో, మునుపటి తెలుగు అకాడెమీ డైరెక్టరుగారొకరు  'తెలుగు పాఠ్యపుస్తకాల్లో సంస్కృత మాటలు' అనే విషయంపై మాట్లాడుతూ, ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ వారి సూచనల మేరకు 'టర్మినాలజి' సంస్కృతంలో తయారు చేసామని చెప్పినారు. ఈ విషయాన్ని ఒక సారి తరచిచూద్దాము. కేంద్ర ప్రభుత్వపు పెత్తనము కింద పని చేసే సంస్థలన్నిటిలో పెత్తనపు నుడి(అధికార భాష)గా హిందీ యొక్క వాడకము తప్పనిసరి. అలాంటి ఒక సంస్థలో పని చేస్తున్న నా యెరుక(అనుభవము) ఏమంటే, హిందీవారు కష్టపడి తయారు చేసిన శాస్త్ర  టర్మినాలజి(సంస్కృతం నుండి) హిందీ వారే వాడడము లేదు. అది వ్రాతలలో మాత్రమె ఉన్నది. మచ్చుకు 'ఇంజినీరు'ని 'అభియంత' అన్నారు. ఆ మాట ఎంత మంది వాడుతున్నారు?  సంస్కృతముతో నేరుగా చుట్టరికము ఉన్న భాషలకు లేని ఆరాటము, దానితో చుట్టరికము లేని మనకెందుకు? మన దేశమంతా శాస్త్ర మాటలు ఒక్కటిగా ఉంటె అందరికీ అర్థమవుతాయనే ఉద్దేశముతో సంస్క్రుతమునుంచే శాస్త్ర మాటలు పుట్టించమని ఆ కేంద్ర సంస్థ వారు అని ఉంటె, మన వారికి అర్థమయినా కాకపోయినా వారి సూచనలు తలదాల్చవలసిన అక్కర మనకు ఏమిటి?

ఏ రకముగా చూసినా తెలుగులో శాస్త్ర మాటలు సంస్కృతము నుంచి తేవడము సరియైనది కాదు. ఆ మాటకొస్తే ఏ నుడి నుండి అయినా నూటికి నూరు పాళ్ళు అప్పు తేవడము సరికాదు.  పైన చర్చించిన ఇక్కట్టునుండి బయటపడడానికి రెండే రెండు దారులు ఉన్నాయి. ఒకటి, వీలయినంతవరకు శాస్త్ర మాటలు తెలుగు కుదురు నుంచి పుట్టిస్తూ, అక్కడ దొరకకపోతే తోబుట్టు ద్రావిడ నుడులనుండి తీసుకుంటూ ,అక్కడా దొరకకపోతే ఇంగిలీషూ సంస్కృతముతో పాటు ఏ  నుడి నుండయినా అప్పు తెచ్చుకొని తెలుగు నుడికారానికి తగ్గట్టుగా మలుచుకోవడము. రెండవది, ఈ గాసి(కష్టము) ఏదీ లేకుండా ఇంగిలీషు టర్మినాలజిని ఉన్నదున్నట్టుగా తెలుగు పుస్తకాల్లో వాడుకోవడము. ఈ రెంటిలో దేన్ని ఎన్నుకోవాలో మనము నిర్ణయించుకోవాలి. తన్నెనరు(స్వాభిమానము) లేకపోతే రెండవ దారి వెంబడి పోదాము. కానీ శాస్త్రము యొక్క ప్రాముఖ్యత తెలిసినవారెవరూ ఆ పని చేయరని నా అనుకోలు(అభిప్రాయము). 

ఈ ముచ్చట్లన్నీ చదివి తెలుగులోనే శాస్త్ర టర్మినాలజీ ఉండాలని ఒప్పుకొనే వారెవరికయినా ఒక అరగలి(సందేహము) కలుగక మానదు. అదేమంటే, తెలుగు నుడి తావును బట్టి మారుతుంటుంది. ఒక్కోచోట ఒక్కోరకముగా ఉంటుంది. అలాంటప్పుడు, కొత్త మాటల  పుట్టింపులో ఏ తావు మాటలు వాడాలి? దీనికి తిరుగు ఏమంటే, అన్ని తావుల మాటలు వాడవలెననడమే. ముందుగా, వేర్వేరు తావులలోని మంది మాటలను ఒక చోట కూర్చాలి. వాటిల్లోంచి తేలికగా ఉన్నట్టీ వాటినుండి ఎక్కువ మాటలు పుట్టించగలిగే వీలున్న మాటలను, ఎట్టి  తావు తేడాలు చూపకుండా తర్కబద్ధముగా  ఎంపిక చేసి వాటి నుండి టర్మినాలజీని తయారు చేయాలి. అప్పుడు అందరూ ఒప్పుకుంటారు లేకపోతె కత మళ్ళీ మొదటికి వస్తుంది. మన నుడి పెక్కు మాండలికములతో అలరారే కలిమిగల నుడి. ఇందులో  ఏ మాండలికమూ తక్కువ కాదు ఏదీ ఎక్కువ కాదు. ఒక మాండలికపు మాట మరో మాండలికపు వారికి తెలియకపోతే నేర్చుకోవాలి. మనము ఎంతో కష్టపడి వేరే నుడులు నేర్చుకొనేటప్పుడు లేని అడ్డంకులు మన తెలుగులోని మరో మాండలికపు మాటలు కొన్ని తెలుసుకోవడానికి ఎందుకు ఉండాలి? నిజానికి ఇది పెద్ద ఇబ్బంది కాదు. మాండలికాల నడుమ కీలకమయిన తేడా యాస మట్టుకే. మొత్తము మాటమూట (vocabulary) కాదు.  వేర్వేరు మాండలికాల వాడకము ఒకప్పుడంటే కొంత ఇబ్బంది అయి ఉండెడిదేమో కానీ వార్తాపత్రికలూ టీవీలూ బాగా పాకిన ఈ కాలములో కాదు. తెలుగులో శాస్త్రము చదవడానికి ఇక అడ్డంకులేవి?
చాలామంది పిల్లలు తెలుగు మీడియము అంటే జడవడానికి (భయపడడానికి) సంస్కృత టర్మినాలజి ఒక కీలక కారణము. కావున శాస్త్రము సరిగా అర్థమవాలంటే, మొదటగా ఆ శాస్త్ర మాటలు సరిగా అర్థమవాలి. ఆపైన, శాస్త్రము చాలా తేలికగా అనిపిస్తుంది. కొత్త కొత్త ముచ్చట్లు(విషయాలు) కనుగొనడము తేలిక అవుతుంది. ఇకనైనా తెలుగులో శాస్త్ర టర్మినాలజీని తెలుగించే విషయాల మీద పెత్తనమున్నవారు మేలుకుని, టర్మినాలజీని వీలయినంత తెలుగులో తేవాలని కొరుతున్నాను. ఇందుకు ఫిజిక్స్ మరియు ఒషనోగ్రఫీ చదివిన వాడిగా నా వంతు తోడ్పాటు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనమంతా పూనుకుంటే తెలుగులో టర్మినాలజీని తయారు చేయడము నిజంగా పెద్ద విషయమని నేను అనుకోను. కలసికట్టుగా పాటుపడి తెలుగును మరింత కలిమిగల నుడిగా, శాస్త్ర నుడిగా మలచుకుందాము. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి