17, మే 2012, గురువారం

మా ఊరి మాటల సద్ది మూట(1)


మొదటి ముక్క(భాగం): 

చిన్న ఊరే కదా ఎక్కువ మాటలు ఉండవనుకుంటే పొరపాటే. అలా తలపోస్తుండగానే ఎన్నెన్ని మాటలు కదలాడాయి నా కళ్ళ ముందు. ఊరిలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు. అది కులాన్ని బట్టి(ఇది ముమ్మాటికీ నిక్కము. ఇలా కులం పేరు ఎత్తడం అంత బాగలేక పోయినా, ఊర్లల్లో ఉన్న సంగతది. దాన్ని ఎలా మరువగలం?), బ్రతకడానికి చేసే పనిని బట్టి, మనిషిని బట్టి ఇలా రకరకాలుగా మారుతుంది. మచ్చుకి, కృష్ణా పెవ్వంటెకము(జిల్లా) నుండి వచ్చి మా ఊరిలో కుదురుకున్న వారి మాటలు వేరుగా ఉంటాయి. వారు మా ఊరిలో ఉండబట్టి చాలా ఏండ్లు గడుస్తున్నా వారి మాటల్లో తేడా తెలుస్తూనే ఉంటుంది. ఇంకా దూర నాడులలో చుట్టాలు(బంధువులు) ఉన్న వారి కొన్ని మాటలు కొంత తేడాగా  ఉంటాయి. మంది చిన్నప్పటి నుండి ఏ మాట అలవాటయితే దాన్నే వాడతారు .అది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. మా అమ్మ మా నాన్నను 'నాన్న' అని పిలవాలని నాకు నేర్పి, ఆమె మాత్రం వాళ్ళ నాన్నను( మా తాతను) 'అయ్యా 'అని పిలుస్తుంది.  ఇలా ఒక్క చిన్న ఊరిలోనే ఇన్ని తేడాలున్న నుడిని, వారి మాటలను ఒక్క చోట కూర్చాలనుకోవడం కడలిని కడవన బట్టాలనుకోవడమే కాదా? ఇంకా నేను చూడని మా ఊరు ఎంతో ఉంది. నాకు తెలియని మాటలు ఎన్నో ఉన్నాయి. అయినా తెగువ(ధైర్యం)తో ముందడుగు వేస్తే నడక అదే సాగకపోతుందా అని మొదలుపెట్టాను, నా కళ్ళలోంచి మా ఊరిని మీకెల్లరకు చూపించడానికి (నాకు అదనంగా రెండు కళ్ళు ఉన్నాయిలెండి). నాకు ఏ మాటో గుర్తుకు రాక పోతేనో, తెలియక పోతేనో, మా అమ్మనాన్న ఉండనే ఉన్నారు తెలియజెప్పడానికి. వాళ్ళు నాకింకా ఎన్ని నేర్పుతున్నారో కదా...   

ఎక్కడ మొదలు పెట్టాలా అని తలపోసి తలపోసి, చివరికి 'పొద్దు 'తోనే మొదలుపెట్టితే పోలే అనిపించింది.
 మొదటగా ఉన్నదున్నట్టు మాటను యాసతో కలిపి వాసనా, చవీ చెడకుండా వ్రాస్తాను. ఆపై, ఆ మాట వ్రాతలో ఎలా ఉండాలో వ్రాసి, అటు పిదప దాని తెల్లము (వేరే సీమల తెలుగు, సంస్కృతం, ఆంగ్లం లో) వ్రాస్తాను.అక్కర పడిన చోటల్లా చిన్న వ్యాఖ్య వ్రాస్తాను. 

మా.ఊ.మా.  : సంస్కృతం, ఇంగ్లీషు 
౧.పొద్దెక్కింది=sun rose    
 (పొద్దు+ఎక్కింది, పొద్దు=సూర్యుడు)
౨. పొద్దు బొడిచింది= సూర్యుడు ఉదయించాడు
(పొద్దు పొడిచింది, పొద్దు పొడుపు = సూర్యోదయం)
౩. తెల్లారింది= It has dawned
౪.పొద్దున=ఉదయాన
౫.పగులు=మధ్యాహ్నం
౬.పొద్దుగూకింది=sun has set, సూర్యుడు అస్తమించాడు 
(పొద్దు క్రుంగుట, sun going down the horizon)
౭.పైటేల్ల, పైటిపూట=మధ్యాహ్నం సమయంలో , at noon
(  పైటి+ఏల్ల, పగటి వేళ)(పగటి పూట)
౮.పొద్దటి పూట= ఉదయాన, in the morning 
౧౦.మాపటేల్ల, మాడపూట, సందేల్ల= సాయంత్రాన, in the evening
(మాపటి వేళ,మాపు=సాయంతం), (మాపటి పూట), (సంధ్య వేళ)
౧౧.సుక్కలు గాసేటేల్ల(చుక్కలు కాసేటి వేళ)= నక్షత్రాలు కంటికి కనిపించడం అప్పుడే మొదలవుతున్న వేళ
(చుక్కలు ఆకాశానికి కాస్తున్నాయి అనే తెల్లంలో. చుక్కలు(నక్షత్రాలు) నింగికి(ఆకాశానికి) కాస్తున్నాయట, చెట్టుకు కాయలలాగా. ఇందులో కవిత్వం లేదంటారా?)
౧౨.సుక్కలు పొడిచినై (చుక్కలు పొడిచినాయి) = stars have appeared 
౧౩.రెయ్యి, రేయి, రెయి =రాత్రి, night 
 ౧౪ .నడిరెయ్యి =అర్థరాత్రి, midnight 
 (రెయ్యి యొక్క నడిమి: నడిరెయ్యి)
 ౧౫ .కోడి గూసేల్లకు (కోడి కూసే వేళకు) = ఇంకా తెల్లవారకముందే కోడి కూసే సమయానికి
మా ఊర్లో:
 'సమయం' అన్న మాటకు మారుగా 'వేళ'ని వాడుతున్నట్టు మీరు గమనించే ఉంటారు. 'వేళ'లోని 'ళ', 'ల్ల'/'ల' గా మారి, 'వే' తన 'వ'కార తనమును కోల్పోయి, వెరసి(totally) మంది నోళ్ళలో పడి 'ఏల్ల' / 'ఏల' గా మారడం కూడా గమనించే ఉంటారు.ఇన్ని మాటల్లో ఇమిడి ఉన్నా 'పొద్దు' అంటే 'సూర్యుడు' అన్న ఊహ నాకెప్పుడూ రాలేదు, పుస్తకాల చదువుల మహిమ మరి. అలాంటి చదువులు ఏవీ చదవని వారంతా సూర్యుడిని 'పొద్దు' అనే అంటారు.  


తరువాయి ముక్క వేళకు కలుద్దాం మళ్ళీ. 

11, మే 2012, శుక్రవారం

మా ఊరి మాటల సద్ది మూట  

తొందరలోనే మా ఊరిలో మాట్లాడుకునే మాటల సద్దిబువ్వ మూట విప్పుదామనుకుంటున్నాను. మాది ఖమ్మం పెవ్వంటెకము (జిల్లా).  కొద్ది దూరము తూర్పుగా వెళితే క్రిష్ణా పెవ్వంటెకము తగులుతుంది. సుమారు పదియైదు కిలోమీటర్లు దక్షిణముగానూ, పడమరగానూ వెళితే వరుసగా నల్లగొండ, వరంగల్లు  పెవ్వంటెకముల ఎల్లలు తగులుతాయి. మా ఊరి మాటలలో ఆ మూడు పెవ్వంటెకముల మాటల కలయిక చక్కగా చూడవచ్చు. నేను సెలవుల్లో ఊరికి పోయినప్పుడల్లా కొత్త మాటలు నేర్చుకుంటూనే ఉంటాను. తరగని గని మా ఊరు. ఊర్లో ఉన్నప్పుడు మన చుట్టూ ,  ఎప్పుడూ మంది (జనాలు) మాటలాడే పదాల గొప్పతనాన్ని, వాటి తెల్లమును(అర్థము) ఎరుగము. కాని ఎక్కడైనా పుస్తకాల్లో చదివినప్పుడో, ఇంకెక్కడైనా గొప్పవాళ్ళు అనబడే వాళ్ళు  మాటలాడినప్పుడో 'అరె ఇది మన ఊళ్ళో వాడే మాటే, దీని తెల్లం ఫలానా' అని గుర్తుకు వస్తుంది. మీకేమో గాని నాకైతే చాలాసార్లు అలా అనిపించింది.

 మన దగ్గర పండితులని పిలిపించుకునేవారు చిన్నచూపుతోనో, మరెందుచేతనోగాని పల్లెమాటలను పెద్దగా పట్టించుకోలేదు. మనపల్లెలలో మనకి తెలియని మాటలు చాలా ఉన్నాయి. తెలుగులో ఎక్కువ మాటలు లేనందువల్ల ఇతర భాషల (సంస్కృతము, ఉర్దూ, హిందీ, ఆంగ్లము ము..) నుండి మాటలను అప్పు తెస్తున్నామనే సాకు ఊరకే గాలికి ఎగిరిపోయే దూదిపింజ లాంటిది. మొదట మనము మన దగ్గర  వాడుకలో ఉన్న  మాటలు తెలుసుకోవాలి. అచ్చమైన తెలుగు మాటలు పల్లెల్లో కోకొల్లలు. సంస్కృత పండితులకేమి తెలుస్తాయి అవి. వారి చూపుల్లో అవి చదువులేని వారి మాటలు. దేవభాషయగు సంస్కృతమునకు ఇవన్నీ ఏ  పాటి అంటారు. మొన్నటిదాకా తెలుగుకి సంస్కృత రంగు పులిమారు. ఇప్పుడేమో ఆంగ్లము గ్రహణమై పట్టి కూర్చుంది. సగం చచ్చిన మన తెలుగు ఉనికిని ఇతర భాషల ప్రభావాన్నుండి కాపాడుదాం. అందుకే నా వంతుగా మా ఊరిలో మాటలాడే మాటలను ఏరి ఒక చోట కూర్చాలనుకుంటున్నాను. కనీసం ఇప్పుడు వాడుకలో ఉన్న మాటలైనా, చాపకింద నీరులా దెబ్బ తీసిన తీస్తూ ఉన్న  సంస్కృతము వల్లనో, ఉప్పెనలా ఉరికి వస్తున్న ఆంగ్లం వల్లనో మరుగున పడిపోకుండా ఉండాలనేదే నా కోరిక. నేను ఇదంతా చేసేది, వ్రాసేది ఏ భాషమీదా  పగతో కాదు, నా తెలుగు మీద కూరిమి(ప్రేమ) చేత మాత్రమే.  

       నేటికి  మాత్రము నే విప్పబోయే సద్ది మూట వాసన చూపిస్తాను.

మా ఊరి మాట (తెలుగు)              సంస్కృతము                              ఆంగ్లము
1. మొత్త                                     ద్వారము                            gate, entrance
2.తలమొత్త                    ప్రధానద్వారము, సింహద్వారము      main gate, main entrance 

చూశారా, చక్కని తేలికైన తెలుగు మాటలు  ఉంచుకొని మనం  సంస్కృతము వెంటా, ఆంగ్లము వెంటా ఎలా  పరుగులు తీస్తున్నామో.  మరి ఈ మాటలను వాడుకలో పెడదామా? మన భాషలో మాటలాడడానికి సిగ్గుపడడం ఎందుకు?

ఈ మాటలను మీ ఊరిలో ఏమంటారో తెలుసుకోగోరుతున్నాను.

 మన ఏలికలు, ఏలుబడి సాగించే మేడల ముందు, మిద్దెల ముందు ఉంచే పేరుపలకల మీద, అయితే సంస్కృతములోనో  లేకపోతే ఆంగ్లములో ఎందుకు వ్రాస్తారో తెలియడములేదు. వారికి మన (మంది) భాష గిట్టదేమో. లేక తమను గొప్పవారిగా వేరుపరుచుకొవాలనేమో. అందుకేనేమో అందరి భాషలో వ్రాయడము లేదు.  రాతకోతలు జరగనివ్వడములేదు.  అంతా ఆంగ్లములోనే చేస్తారు. తెలుగు పేరు చెప్పి సంస్కృతములో వ్రాస్తారు. మన తలపట్టణం(రాజధాని నగరం)లో ఎన్ని   పేరుపలకలు తెలుగు లిపిలో చూడగలము? అందులో  తెలుగులో(సంస్కృతంలో కాదు, తెలుగులో) ఎన్ని ఉంటాయి? నా లెక్క చొప్పున, తెలుగు లిపిలో కొన్ని ఉన్నాయి, కానీ అవన్నీ తెలుగు పేరు చెప్పి సంస్కృతములో వ్రాసినవే. తెలుగువి లేనే లేవు. దీనికంతటికీ కారణము మన భాష మీద చిన్న చూపే.

ఇకనైనా మేలుకొని మన నుడి(భాష)ను, దాని ద్వారా మన ఉనికిని కాపాడుకుందాం.






     

8, మే 2012, మంగళవారం

ఒక పత్రిక వారికి నేను వ్రాసిన ఉత్తరం..


అయ్యా,
నిండుగా నూరుపాళ్ళ తెలుగు పేరు ఉన్న మీ పత్రిక వాడుతున్న నుడిలో తప్పులు దొర్లడం చాలా బాధను కలిగిస్తున్నది. ఆంగ్లమునుండి కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న మాటలకు మీరు తెలుగు మాటలు కల్పిస్తున్న తీరు కూడా నొప్పి కలిగిస్తున్నది.మచ్చుకు కొన్ని మాటలను మీ ముందుంచుతాను.
'
కాంట్రాక్టర్ ' అన్న ఆంగ్ల మాటకు మారుగా మీరు 'గుత్తేదారు ' అని వ్రాస్తున్నారు. మీరొక్కసారి 'జమీన్ దార్ ', 'దుకాన్ దార్ ' మున్నగు పదాలను గమనించినట్టయితే ఆ పదాల చివర ఉన్న 'దార్ ' అనేది తెలుగు వెనుచేర్పు(ప్రత్యయం)కాదని మీకే తేటగా తెల్లమవుతుంది. ఇందుకు మీరేదొ కొత్త మాట పుట్టించాలనుకోవద్దు. ఇప్పటికే పల్లె మందిలో వాడుకలో ఉన్న మాట 'గుత్తకాడు ' లేదా 'గుత్తగాడు ' అనేది. మీరూ చక్కగా దాన్ని వాడవచ్చుకదా. ఇందులో 'గాడు 'అనేది ఎబ్బెట్టుగా ఉంటుందని అనుకోవద్దు. అలాంటప్పుడు కృష్ణుని కీర్తించేటపుడు మన కవులు చేసిన 'నల్లని వాడు పద్మ నయనమ్ములవాడు ' అనే వర్ణన తప్పంటారా? వారు ఆయనను కించపరుస్తున్నరంటారా? ఇలాంటి సంకరాన్ని ఆపండి. తెలుగు ఒక ద్రావిడ భాషయని గుర్తెరగండి. ఇప్పటికే చాలమంది తెలుగంటే సంస్కృతం, ఉర్దూ, హిందీ మరియు ఆంగ్లముల కలబోత అని అంటున్నారుమరోమాట ఏమిటంటే ఏవైనా కొత్త మాటలు పుట్టించేటపుడు సంస్కృతమునండి ఎందుకు వెర్రిగా అరువు తెచ్చుకుంటున్నారు? తెలుగుకి ఆపాటి పాటవము లేదని మీరు గట్టిగా నమ్ముతున్నరా? ఇప్పటికే వేల యేళ్ళుగా మన తెలుగు కొందరి చేత చిక్కి మన నుడి అనేది సంస్కృతమునుండే పుట్టిందనిపించేలా తయారయ్యింది. అందుకు ఎవరు కారణమో మనందరికీ తెలుసు. మీరింకా అదే తలస్తున్నట్లయితే అది గుండెలు బాదుకోవలసిన సంగతి. పక్కనున్న తమిళమువారిని చూసి మన వాళ్ళు భాషా దురభిమానులని ఈసడించుకుంటారే తప్ప మనము మన నుడి మెరుగుకి ఏమాత్రం పాటుపడుతున్నమో ఒక్క సారైనా చూసుకోము. ఇవన్నీ నేనూరకే అనటములేదు. చూడండి.
'
క్లౌడ్ సీడింగ్ ' అనే మాటకు మారుగా 'మేఘమథనం ' అని ఎవరిని సంప్రదించి రాస్తున్నారో, వారెవరో చెప్పినా మీరెలా గుడ్డిగా దాన్ని అచ్చు వేస్తున్నారో తెలియడంలేదు. ముందుగా ఈ అనువాదం తప్పు. నేను ఒక వాతావరణశాస్త్ర చదువరిని. నిక్కమేమంటే ఈ 'క్లౌడ్ సీడింగ్ 'లో మీరు అంటున్నట్టుగా మేఘాలను మథించరు(ఎందుకు ఈ సంస్కృత ఆర్భాటం?) లేదా తేటగా చెప్పాలంటే మబ్బులను చిలకరు వాన పిండడానికి. మబ్బుల్లో సిల్వెర్ అయొడైడ్ అనే రసాయనమును విత్తులుగా వేస్తారు. వాటిచుట్టూ నీటి ఆవిరి చేరి నెమ్మదిగా ఒక చుక్కగా మారుతుంది. అది పెరుగుతూ పోయి తగినంత బరువు కలుగగానే క్రిందకు వాన చుక్కగా పడిపోతుంది.ఇలా మబ్బులలో  ('క్లౌడ్ ') విత్తులు ('సీడ్స్ ')వేయడాన్నే 'మబ్బువిత్తడం '  ('క్లౌడ్ సీడింగ్ ') లేదా 'మబ్బువిత్తుడు ' అని చక్కగా తెల్లము చెడకుండా అనవచ్చు. ఇంగ్లీష్ ఏమాత్రం తెలిసిన వారికైనా తెల్లమయ్యేలా దాని ఇంగ్లీషు పేరు వుంటే మనవారు మాత్రం ఏమాత్రం తెల్లంకాని సంస్కృత పదబంధంతో గుబులు పుట్టించడమెందుకు? అందునా తప్పులను చెప్పడమెందుకు? ఒక్క సారి మీ భాషను మీరు సరిచూసుకోండి. ఏది వ్రాసినా మంది (జనాలు) చదువుతున్నారుకదా అని మీరు పట్టించుకోకపొతే మీరే కోల్పోతారు. అన్నిటికి మించి ఇప్పటికే సంస్కృత పండితుల, ఇంగిలీషు కాన్వెంటుల, ఏలిన వారి పట్టనితనము వల్లా దాదాపు చచ్చిన తెలుగమ్మ పూర్తిగా చావడానికి మీ వంతు మీరు చేసిన వారవుతారుపతాక శీర్షికలు చూడగానే ఆకర్షించేలా ఉండాలనో, ప్రాసగా ఉంటాయనో మీ ఇష్టం వచ్చినట్టుగా హిందీ, ఉర్దూ, ఇంగిలీషు పదాలను కలపకండి. మీ సంస్కృత పాండిత్యమో లేదా మీకు భాషలో సలహాలిచ్చేవారి పాండిత్యమో మంది మీద రుద్దకండి. మీ తెలుగు పత్రికలోని కఠిన సంస్కృత పదాలకు కొన్ని తేట తెలుగు మాటలను క్రింద ఇస్తున్నాను.
కఠిన సంస్కృతం : తేట తెలుగు
సమావేశము : కూడిక (మంది ఒక చోట కూడుట
ధర : వెల (చక్కగా కూరగాయల వెల అనండి)
నిర్మాణము :కట్టడము
నియమము :కట్టడ
నియంత్రించు :కట్టడిచేయు
ఙానము :ఎరుక (ఎరుగుటనుండి, ఈ మాట ఇప్పటికీ తెలంగాణలో వాడుకలో ఉంది భారీ :పెను 
రక్తం :నెత్తురు
నిందించు :యెగ్గులు పెట్టు
క్రీ.పూ. :క్రీ.ము. (క్రీస్తుకు ముందు)
క్రీ.:క్రీ..(క్రీస్తుకు తర్వాత)శతాబ్దం :నూరేడు
శతకం (సెంచరీ) : నూరకం
మధ్య :నడుమ
ప్రభుత్వం (సర్కారు) :ఏలుబడి 
కృష్ణ బిలం :చీకటి గుంట లేదా నల్లని గుంట(ఇంగిలీషులో కూడా తేలికగా 'బ్లాక్ హోల్స్ ' అంటారు. మీ పదంలోని 'కృష్ణ ' అన్న మాటకి 'నల్లని ' అనే తెల్లము ఎందరికి తెలుసునని మీరనుకుంటున్నారు?)
శిశువు :చంటిబిడ్డ 
విఙాపన : మనవి, వేడుకోలు

ఇకపోతే, మీరు అక్కరలేని హిందీ,ఉర్దూ పదాలనెన్నిటినో మంది మీద రుద్దుతున్నారని గురుతెరగాలి.'వేల పొస్టులు భర్తీ ' అంటారు. 'భర్తీ ' అంటే ఏమిటి? 'నింపకం ' అని అనవచ్చుగా? ఇది ఏమి అంటే, తెలుగులో చాలినన్ని పదాలు లేవు కాబట్టి ఇతర భాషా పదాలు వాడుతున్నమని మీరు చెప్పుకురావచ్చు. మొదట మీరు తెలుగులో ఇప్పటికే ఉన్న పదాలను బాగా తెలుసుకోండి. కొత్త మాటలను పుట్టించాలి తప్పదు, నానాటికీ పెరిగిపోతున్న అక్కరల వల్ల. కాదనను. మీరు ఒక్కమారు తమిళ పత్రికలవైపు చూడండి, వారు ఎలా నెట్తుకొస్తున్నారో.దాన్ని చూసి నేర్చుకోండి. మీది ఎక్కువ పంపకం గలిగిన పత్రికవారు గనక, మీరొక్కసారి ముందు నడిచి తోవతీస్తే తక్కినవారు మీ వెంటే నడుస్తారు. తెలుగు నుడిని కాపాడే గొప్ప వీలు మీకు ఉంది. గిడుగు వారు ఆనాడు నింగిన వెళ్తున్న తెలుగు నానుడిని (సాహిత్యాన్ని) నేలకు దింపినా అది సొంతపల్లెవారిని, వారిమాటలను చీదరించుకొని సంస్కృతవాడలవైపు, ఉర్దూ హిందీ డేరాలవైపు వడిగా పరుగుతీస్తూనే ఉన్నది. ఇన్నాళ్ళూ చదువు కొందరి సొత్తుగా ఉండటంచేత 'ఎల్లభాషలకు జనని సంస్కృతంబె 'అన్నా, తెలుగు అనేది కల్లు కొట్లకాడ ఊళ్ళళ్ళో మాట్లాడుకోడానికేతప్ప శాస్త్రసాంకేతిక విషయాల్లో వాడటానికి పనికి రాదన్నా చెల్లిపోయింది. ఇప్పుడిక ఆ పప్పులుడకవు. ఇప్పుడిప్పుడే అన్ని కుదురులవారికి చదువు చేరువవుతున్నది. వేల యేళ్ళుగా తమను ఎవరు ఎలా మోసగిస్తున్నరో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. రెండవ భాషా పోరాటం తప్పక వచ్చి తీరుతుంది.
ఇది సగటు తెలుగువాడి ఆవేదన. తేటతెలుగున వ్రాసిన అన్నమయ్య పాటలకెన్నిటికో మనకు తెల్లములు తెలియక తలబాదుకుంటున్నాము. మొదట్లో వేమనగారి పద్యాలను సాహిత్యమే కాదని చాలా యేళ్ళుగా పక్కకి పెట్టిన పెద్దలు, మంది నోట ఆయన మాటలు నిలిచినందున తెలుగునాట ఆయన ఒక గొప్ప కవి అని ఇప్పుడు చెప్పుతున్నారు. ఎందుకు అచ్చ తెలుగును పక్కనబెట్టుతూ వస్తున్నారు పెద్దలనబడే కొందరు? ఇన్నాళ్ళూ సంస్కృతవెంట పడ్డారు, మరి ఇప్పుడేమో ఇంగిలీషు వెంట. ఏలికలకు ఇది ఎందుకు పట్టదు? మీడియా వారు ఎందుకు ఏలుబడిని నిలదీయరు?తెలుగు మన రాష్త్రంలో అధికార భాష అని కాగితాల మీద ఉంది కానీ అమలవటంలేదు. ఒకపక్క తమిళనాట హైకోర్టులోకూడా తమిళంలో వాదనలూ, తీర్పులూ జరుగుతుంటే మనదగ్గర మాత్రం అంతా ఆంగ్ల రాజ్యమే. అయితే సంస్కృతము లేదా ఉర్దూ లేనట్లయితే ఇంగిలీషు అంతే కాని తెలుగుని మాత్రము వాడరు. ఇందులో మీరు మార్చవలసిందీ మార్చగలిగేదీ ఎంతో ఉంది. ఇన్ని చెప్తున్ననందున వీడెవడో కారు ఉడిగిన ముసలి అని మీరు అనుకోనక్కరలేదు. నాలాంటి కుర్రకారువారము దీనిమీద తప్పక పోరుతాము.ఒకసారి మీలోని తెలుగుదనాన్ని తట్టిలేపండి. మీరూ మేమూ కలిసి ఏలికలను నిలదీసి నిక్కమైన తెలుగు ఏలుబడిని, మన నుడికి మునుపటి ఉగ్గెన(గౌరవము)ను తెచ్చిపెడదాము.