12, ఆగస్టు 2012, ఆదివారం

మా ఊరి మాటల సద్ది మూట (4)

నాలుగవ ముక్క: ఇల్లూ దాని చుట్టుపక్కలూ

మా ఊరిలో రకరకాల ఇళ్ళు కనిపిస్తాయి. కప్పును బట్టి, కట్టుడుని బట్టి చాలా తేడాలే మనకు కనిపిస్తాయి. 
కప్పును బట్టి చూస్తే,
అ.పూరిల్లు 
                            పూరిల్లు=పూరి+ఇల్లు ఇందులో పూరి అనే మాటకు తెల్లమేమో నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. మొత్తానికి పూరిల్లు అంటే కొద్ది ఏండ్లు మాత్రమే నిలిచి ఉంటూ మళ్ళీ మళ్ళీ మార్చవలసిన అక్కర గలిగిన కప్పుతో కప్పిన ఇల్లు. కప్పు(roof)గా తాటిఆకులనూ, రకరకాల గడ్డిని వాడతారు. గడ్డి కప్పు ప్రధానంగా జమ్ము(చెరువుల్లోనూ, కుంటల్లోనూ పెరుగుతుంది), వరిగడ్డి, దరబ గడ్డి (దర్భ) లతో ఉంటుంది. ఇందులో వరిగడ్డి తొందరగా పాడయిపోతుంది. జమ్ము కొన్ని యేండ్లు అంటే రెండు లేదా మూడు యేండ్లు నిలుస్తుంది. చివరగా చెప్పిన దరబగడ్డి పది యేండ్లయినా చెక్కు చెదరక ఉంటుంది.  ఆ తర్వాత మార్చాలనుకోండి. ప్రతి వానాకాలం ముందు ఇంటి కప్పులు సరి చేయడమో, తిరిగి కప్పడమో మనం ఊర్లల్లో చూడవచ్చు.  ఎండాకాలం చల్లగా ఉంటాయి గాని, ప్రతి యేడూ మార్చాలంటే శ్రమతో కూడుకున్న పని.పూరిల్లు కప్పడాన్ని గురించి ఒక ప్రయోగం ఉంది. నిజంగా దీన్ని ఏమనాలో తెలియదు. అదేమిటంటే, 'తగిలితే గానీ మొగ్గడు తడిస్తే గానీ వంగడు' అని. మొండి మొగుడు గురించి ఆయన పెళ్ళాం అన్న మాట. మనమేదీ చెప్పినా వినడు నాలుగు దెబ్బలు తగిలితే గానీ మరియు ఎన్నాళ్ళ నుండి ఇల్లు కప్పు సరి చేయమని చెప్పిన పూనుకోలేదు కానీ గట్టి వాన వచ్చి ఇల్లు తడిసే సరికి ఆ పని చేసాడు' అని దాని వివరణ.  పైన కప్పిన కప్పు గాలికి లేచి పోకుండా ఉండేందుకు బరువుగా ఉన్న కొయ్యలు వాడతారు. వీటిని నడిగొప్పు లేదా నడిగప్పు (కప్పు యొక్క నడిమి)న వేలాడ గడతారు. నేలకు దగ్గరగా ఉన్న కప్పు చివరను సూరు(చూరు) అంటారు.
                            కప్పు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది ఎలా కప్పుతారో కూడా చూద్దాం. అలా చూడడంలో  మనకు చాలా మాటలు తెలుస్తాయి. మొదటగా ఒక లెక్క చొప్పున అక్కర పడిన చోట, కప్పేకప్పుకు ఆను(support)గా ఉండేందుకు గుంజలను నేలలో పాతుతారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మనం స్తంభం అని సంస్కృత మాట వాడతామే దాన్ని అచ్చంగా, తెలుగులో, నాకు తెలిసి గుంజ లేదా మొగరం అంటారు.  ఇక మన పూరింటి ముచ్చటకొద్దాం. నేలలో పాతిన కొయ్య గుంజలకు పైచివరన ఒక చీలిక ఉంటంది, సాధారణంగా. దాన్ని పంగ అంటారు. అలా ఉన్న దాన్నే గుంజ అని అనాలని లేదు. అలా ఉంటె దాన్ని పంగగుంజ అంటారు. ఇలాంటి గుంజల మీదుగా గోడపైనదాక వేసే ముఖ్యమైన అడ్డు ఆనును దూలం అంటారు. దీనికి సాధారణంగా పొడవైన,బలమైన చెట్టు మొద్దును వాడతారు. ఇంటి పరిమాణాన్ని బట్టి ఇలాంటి దూలాలు పెరుగుతుంటాయి. ఇక కప్పు నిలవడానికి  కావలసింది దూలాల మీద ఒక అల్లిక. దూలాల మీద నుంచి వాలుగా వేసే పొడవాటి కర్రలను వాసాలు అంటారు. ఈ మాట చదవగానే మీకేదైనా సామెత గుర్తుకు వచ్చిందా? 'తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్టు' అన్న  సామెత ఒకటుంది. ఇంట్లో మంచం మీద వెల్లకిలా (మా ఊర్లో ఈ మాటను 'ఎల్లెలకల' అంటారు) పడుకుని పైకి చూస్తే వాసాలు కనిపిస్తాయి. చేరదీసి తిండి పెట్టిన వారిల్లు కూలగొడితే ఎన్ని వాసాలు పనికొస్తాయి అని తలపోసాడట వెల్లకిలా పడుకుని ఒకడు మునుపటికి. అంటే మనకు మేలు చేసిన వారికే నష్టపరచటం అన్నమాట. నాకు తెలిసి ఈ సామెత విశేషం ఇదీ. మీకు వివరంగా తెలిస్తే చెప్పగలరు. మళ్ళీ మనం పూరింటి కట్టుడు(నిర్మాణం)కి వద్దాం. వాసాలమీద అడ్డుగా, గట్టిగా తీగల మాదిరిగా ఉండే చెట్లతో సమాన ఎడం(gap)తో కట్టు కడతారు. దాన్ని 'పెండెకట్టు' అంటారు. ఆ కట్టడాన్ని పెండెకట్టడం అంటారు. పెండె కట్టుడుకి సాధారణంగా 'పులిసేరు ' తీగలు గానీ, 'లోట్టపీసు ' తీగలుగానీ వాడతారు. కప్పు నిలవడానికి కావలసిన అల్లిక సిద్ధం ఇప్పుడు. ఇక కప్పే గడ్డిని చిన్న చిన్న కట్టలుగా కట్టి  'గడె ' సాయంతో పైకి అందిస్తారు. ఇల్లు కప్పటంలో చాల నేర్పరితనం కావాలి. లేకపోతే, నడివానాకాలంలో ఇల్లు కారుతుంది. అప్పుడు ఏమీ చెయ్యలేము. ఇల్లు కప్పడానికి వచ్చే ఆయన ఒక 'చూరుకుట్టు బద్ద'తో దిగిపోతారు. పేరులోనే ఉన్నట్టు ఆ బద్ద కప్పును అల్లికకు, గాలికి లేవకుండా కుట్టడానికి పనికొస్తుంది. అది తిరగ వేసిన సూది లాగ ఉంటుంది. అంటే సూదికి వెనకవైపున ఉండే బొక్క(రంధ్రం) ఈ బద్దకు మొన వైపుకు ఉంటుంది. గడ్డి కట్టను అల్లికకు కట్టడానికి కట్లు(బంధాలు) కావాలి గదా. వాటిని సాధారణంగా చీల్చిన తాటి ఆకుతో గానీ మెలితిప్పిన ఈత చువ్వ(ఈత మెల్లె, మెలితిప్పబడినది కావున మెల్లె )లను గానీ వాడతారు. ఇల్లు కప్పేవారు  గడ్డి కట్టలను ఒక వరుసలో పేరుస్తూ కట్లతో బిగిస్తూ వానచుక్క కిందకు జారకుండా కప్పుతారు.

ఆ.గట్టిల్లు లేదా పక్కా ఇల్లు
        పక్కా అన్న మాట తెలుగుది కాదు, హిందీది. పక్కా అంటే హిందీలో గట్టి అన్న తెల్లము. కనీసం అరువది యేండ్ల కింద కట్టిన కొన్ని ఇండ్లు మా ఊళ్ళో ఉన్నాయి. అవి డంగుసున్నము, ఉసికె(ఇసుక), చిన్న చిన్న రాళ్ళూ ఇవన్నీ కలిపి పోసిన కప్పుతో కప్పబడిన ఇళ్ళు. డంగుసున్నమంటే, ఇళ్ళు కట్టుడులో వాడడానికి అనువుగా ఉండేదుకు ప్రత్యేకంగా డంగులో చేసిన సున్నము. అలాంటి ఇంటిని మేడ, మిద్దె, బవంతి, డాబా అంటారు. పెంకులతో కప్పబడిన ఇళ్ళు కూడా చాలానే కనిపిస్తాయి. బట్టీలలో చేసిన పెంకులే కాకుండా చిన్నగా వంక తిరిగిన పెంకులతో కప్పిన ఇండ్లు కూడా ఉన్నాయి. అలాంటి పెంకులను 'కుమ్మరి పెంకులు' అంటారు.
       ఆర్ధిక స్తోమతను బట్టి, ఇల్లు కొంత గట్టిది కొంత పూరిదిగా, లేదా మొత్తం పూరిదిగా లేదా మొత్తం గట్టిదిగా కట్టుకుంటారు.

ఇవి కాక, అప్పుడప్పుడూ ఊరికి వచ్చే బాతులవాళ్ళూ, కురమ గొర్రెల వాళ్ళూ వేసుకునే, బట్టతో ఉండే గుడారాలు కూడా ఊరి వెలుపల పొలాల్లో కన్పిస్తాయి.  

ఇక, గోడలను కట్టే లెక్క చొప్పున చూస్తే, మట్టి గోడల ఇండ్లూ, ఇటుక గోడల ఇండ్లూ, రాతి గోడల ఇండ్లూ, ఇలాంటి  పదార్థమేదీ కాకుండా చెట్ల ఆకులతోనే ఉండే గోడల ఇండ్లూ కన్పిస్తాయి.  ఇటుక గోడలూ, రాతి గోడలూ మనం పట్నాల్లో కూడా చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి నేను మిగతా రెండింటి గురించి చెప్తాను. మట్టితో గోడ కట్టవలెనన్న, దానికి జిగురుగా ఉండేదీ, గట్టిగా ఉండేదీ అయిన తగిన మన్నును ఎంపిక చేసుకుని, అందులో రాళ్ళూ, చెట్ల వేర్లూ వంటివేవీ లేకుండా ఏరివేసి, కొన్నాళ్ళపాటు నీళ్ళు పోసి ఊరబెడతారు. ఆ పిదప దాన్ని ముద్దలుగా చేసి, గోడ కట్టవలసిన ఆకారంలో వేస్తూ పోతూ,  అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతూ గోడ పెడతారు. వానాకాలంలో, వానకి పాడయిపోకుండా, ఉండేదుకు గోడ కట్టిన తర్వాత పైన నున్నగా అలికి మందంగా సున్నం వేస్తారు. ఇలా చేయడాన్ని 'గిలాబు' చేయడం అంటారు. మనం ఇంగిలీషులో 'plastering'అంటామే అది. ఇలాంటి గోడలేవీ కాకుండా కొంతకాలమే నిలిచి ఉండేట్లుగా, చెట్ల ఆకులతో కట్టే గోడ(లాంటి) ఇండ్లు కూడా ఉన్నాయి. దానికి సాధారణంగా, తాటి ఆకులనుగానీ, ఈత ఆకులనుగానీ లొట్టపీసు కట్టెగానీ మరేవైనా తీగలనుగానీ వాడతారు. చెట్ల ఆకులతో అల్లినదాన్నయితే 'దడి' అంటారు. అలా కాకుండా తీగలతో అల్లినదాన్నయితే 'తడికె' అంటారు. కొన్నిసార్లు అటూఇటూగా కూడా పిలుస్తారు. ఇల్లుకట్టడం, కప్పడం చూడాలే గానీ ఇలా చెప్తే నిండుగా తెలియదు.

ఇల్లు ఆకారాన్నిబట్టీ, పరిమాణాన్నిబట్టీ కూడా రకకాలుగా చెప్పుకోవచ్చు. మచ్చుకి, గుండ్రముగా ఉండి, పూరికప్పుతో ఒకే గది ఉండే ఇంటిని, చుట్టిల్లు లేదా చుట్టు గుడిసె అంటారు. చుట్టు అంటే మన పుస్తకాల చదువుల భాషలో వృత్తం(circle) అన్న మాట . ఇంకా 'మాడుపాక' అనేది కూడా ఉంది. ఇది మనిషి నెత్తి(తల) 'మాడు లేదా మాడ' ఆకారపు కప్పుతో ఉంటుంది. ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. నిజం చెప్పాలంటే నాకు తెలిసింది చాలా తక్కువ.

పైన చెప్పినదంతా, ఇళ్ళు కట్టటం గురించీ, దాన్ని కప్పటం గురించీ. నెమ్మదిగా ఇంటిలోపల మొదలు పెట్టి, ఇంటి వెలుపల దాకా ప్రయాణం చేద్దాం. గట్టి ఇల్లు కట్టుకున్న వారయితే, ఇంటి లోపల, క్రింద నాపరాళ్ళు పరుస్తారు. పూరిండ్ల వారయితే, మట్టితో నున్నగా అలుకుతారు. అలికిన  కొద్ది నాళ్ళకు, అలుకు చెరిగి పోయి ఇల్లు దుమ్ము లేస్తుంది. మళ్ళీ అలకాలి పుట్టమట్టి తెచ్చి. అందుకే దాదాపు అన్ని పండగలకూ ఇల్లు అలుకుతారు. అటు పండగా కలిసి వస్తుందీ, ఇటు ఇల్లు శుభ్రమూ అవుతుంది. అలికిన అలుకు ఎండిన తర్వాత తడి ముగ్గుతో చక్కని ముగ్గులు వేస్తారు. ఇంటి వెలుపలి గోడ  ఎమ్మటి (వెంబడి) ఎర్రమట్టితో అలుకుతారు. ఇలా బయట అలకడాన్ని 'వారలు అలకడం లేదా వారలు తీయడం' అంటారు. 'వార' అనే మాటకు అంచు అని తెల్లమనుకుంటా. కంటిరా పూరింటి కడగండ్లు(కష్టాలు)!. నన్నడిగితే పూరిల్లు అందమైన యువరాణి లాంటిది. అందమైనదే కానీ యువరాణి కదా ఏ పనీ చేతగాదు. చిన్న జబ్బు కూడా తట్టుకోలేదు. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అలాంటప్పుడు.
 కొందరికి వంట కొరకు వేరేగా పక్కన చిన్న ఇల్లు ఉంటుంది. దాన్ని వంటపాక, వంటిల్లు, వంటగుడిసె లాంటి పేర్లతో పిలుస్తారు. పూరి కప్పుతో ఉండేదాన్ని మాత్రమే 'పాక' లేదా 'గుడిసె' అంటారు. ఇంటిముందు కొందరు యేటిపొడుగునా పనికోచ్చేట్టు 'పందిరి' వేస్తుంటారు. కొందరు ఎండాకాలంలో మాత్రమే నీడకు పనికోచ్చేట్టుగా ఆకుల కప్పుతో 'సలవ(చలువ) పందిరి' వేస్తారు. గొడ్లు(పశువులు) ఉన్నవారయితే వాటి కొరకు వేరేగా 'కొట్టం' వేస్తారు. దాన్ని గొడ్లకొట్టం అంటారు. కొందరు గింజలు(ధాన్యం) దాచుకోవడానికి, ఇంట్లోనే ఒక గది ఉంచడంగానీ, బయట వేరేగా గడ్డి తాళ్ళతో గానీ తీగలతో గానీ కట్టిన 'గుమ్మి'ని  ఏర్పాటు చేయడంగానీ చేస్తారు .  మీకు తెలుసా, గుమ్మి మీది కప్పునూ దాని అమరికనూ కలిపి 'ఇలారం' అంటారు. ఇంట్లోని గింజల గదినయితే 'గింజల కొట్టం' అని గానీ 'ఒడ్లకొట్టం' (వడ్ల కొట్టం అని. వడ్లు ప్రధాన పంటగా ఉండే చోట దాన్ని అలా పిలుస్తారు.)అని గానీ అంటారు.  ఇంటి వెనకగానీ, పక్కన గానీ గడ్డివామీ(గడ్డివామి, వామి(కుప్ప)గా పేర్చిన ఎండుగడ్డి. వామి అనే మాట 'రాశి' అన్న సంస్కృత మాటకు మారుగా మనం వాడవచ్చు), కట్టెలూ మొదలైనవి ఉండే చోటును 'దొడ్డి' అంటారు. పెరడు అన్న మాటతో ఎవరో కొద్ది మంది ఆ చోటును పిలుస్తారు. ఎగసాయం(వ్యవసాయం)కల కుటుంబాలవారు కొందరు గొడ్ల పేడ(లేదా పెండ), కసువు మొ|| ఒక పక్క పోస్తారు. దాన్ని పెంటదిబ్బ అంటారు. పేరులో ఉన్నట్టు పెంటను దిబ్బగా పోస్తే అది పెంటదిబ్బ. అయితే ఒక్కోసారి ఒట్టి కసువు దిబ్బను కూడా పెంటదిబ్బ అని పిలవడం పరిపాటి. తొలకరి వాన పడడంతోనే ఈ పెంటదిబ్బలను  ఎత్తి, పొలాల్లో ఎరువుగా వేస్తారు. 

ఇక ఇంటి లోపల, అలమరలూ, తంతెలూ, అటుకు(అటక, attic), గిన్నెలూ మిగతా పనిముట్లూ సామాన్లూ వంటివన్నీ ఒక్కసారి చెప్పటం వల్లకాని(సాధ్యపడని)పని. వాటి గురించి మరెప్పుడైనా చెప్తాను.    

 ఇంటిలోకి వెళ్ళే ద్వారాన్ని 'మొత్త' అంటారు. ఇంటి గోడలో దీపాలు పెట్టుకోవడానికి ఉండే చిన్న ఏర్పాటును 'గూడు' అంటారు.  మొత్తకాడ ఉండే చెక్క సట్టం(చట్రం, frame)ని దారబందం(ద్వారంబంధం) లేదా దర్వాజ(మా ఊరు తెలంగాణలోది మరి, అందుకే ఆ ఉరుదూ మాట) అంటారు. తలుపును తీయరాకుండా వేసేదాన్ని 'బేడెం'/'గడి'/'గొళ్ళెం' అంటారు. రాయలసీమలో దీన్నే 'చిలుకు' అంటారని విన్నాను. ఇంటిచుట్టూ కొందరు గోడ కడతారు. కొందరు తడికెలు కట్టుతారు. మరికొందరు చిన్నచిన్న చెట్లు వేస్తారు. ఇంకొందరు రాళ్ళతో 'రాళ్ళతెట్టె' లేదా  'రాతికట్టం' కడతారు. దీనికి మోటురాళ్ళు(నేలలో సహజంగా దొరికే, ప్రత్యేకంగా చెక్కని, raw) వాడతారు. తెట్టె అంటే కూర్పు, పేర్పు, అమరిక మొ||. తేనెటీగల గూడును మాకాడ(మా వద్ద) తేనెతెట్టె లేదా తేనేతుట్టె అంటారు. చూసారా తెట్టె అన్న మాట యొక్క వాడకం. ఇంటి చుట్టూ ఉండే ఒట్టి(ఖాళీ)చోటునయితే, మా ఊరిలో 'వాకిలి' అంటారు. రాయలసీమలో ఇదే మాటకు 'ద్వారబంధం' లేదా 'తలుపు' అన్న అర్థం ఉంది. ఇంటిచుట్టూ ఉండే గోడను 'కంటెగోడ' లేదా 'పారీ(ప్రహరీ)గోడ' అంటారు. ఈ కంటె గోడను దాటుకుని ఇంటి వాకిట్లోకి రావడానికి ఉండే మొత్తను 'తలమొత్త' అంటారు. ఆ తలమొత్త ముందు ఉండే చోటును 'తలవాకిలి' అంటారు. చూసారా, ముఖ్య లేదా ప్రధాన అనే సంస్కృత ఉపసర్గలకు మారుగా తెలుగులో 'తల'అనేది మునుచేర్పు అని గమనించారా. ఈ నడిమిన తమిళ పుస్తకమొకటి చదువుతుంటే ముఖ్యపట్టణాన్ని 'తల పట్టిణం' అనడం చూసాను. అంటే ఈ మునుచేర్పు తమిళంలో కూడా ఉందన్నమాట.
పల్లె  మాటల్లో ఇలాంటి సంపద ఎంతో దాగిఉంది మరి. మనమే పట్టించుకోవడంలేదు. నేటి కొత్త తరం అక్కరలకు పనికోచ్చేట్టు కొత్త మాటలను పుట్టించుకోవాలంటే పల్లె వైపు చూస్తే సరి. పండితులను మాత్రం అడగకండి. వారు తెలుగులో దీనికి సరియైన మాట లేదు అని చెప్పి వారికి తెలిసిన సంస్కృత మాట ఒకటి చెప్తారు. పల్లె మాటలంటే వారికి ఏవగింపో మరి ఏమిటో. ముందు వారికివి తెలుసునా అని నా సందేహం.