27, సెప్టెంబర్ 2012, గురువారం

'తిరు' తెలుగు మాటేనా లేక 'తిమ్మ' తెలుగు వారి 'తిరు'యా?

పెద్దవారి(పెళ్ళైన) పేర్ల ముందు 'శ్రీ','శ్రీమతి' అని కలిపి పిలవడం తెలుగు నాట ఉగ్గుడు(గౌరవం)గా చెలామణి అవుతున్నది. వీటికే సమానమైన తెల్లములలో తమిళులు 'తిరు','తిరుమతి' మాటలను వాడుతున్నారు. మనకు తెలుగు నాట కూడా ఈ 'తిరు' మాటను వాడుతున్నాము మనకు తెలియకుండానే. కాకపొతే ఆ తెల్లములో కాదు. దీనికి మేటిమచ్చులు 'తిరుమల' మరియు 'తిరుపతి'. 'తిరుపతి' లోని 'పతి' అనే సంస్కృత మాటకు తెల్లము  'పెనిమిటి' అని. అంటే ఆ తిరుపతి వెంకయ్య బాగా డబ్బు గలవాడన్నమాట . మన దగ్గర సంస్కృత తాకిడి(ప్రభావం) ఎక్కువై మనవి, అంటే తెలుగువ మాటలు చాలా కనుమరుగయి పోయాయి గానీ 'తిరు' అనేది తెలుగు మాట కూడా(అయి ఉండవచ్చు). ఎలా అంటారా? మన తెలుగు నాట ఎన్నో ఊర్ల పేర్లలో ఉంది  ఈ 'తిరు' అలికిడి. ఈ మాటకు 'సిరి', 'సంపద' వంటి పెక్కు తెల్లములు చెప్పుకోవచ్చు. సరే, తిరుమల మరియు తిరుపతి అనేవి తమిళనాడు ఎల్లకి దగ్గరలో ఉన్నాయి కావున ఆ 'తిరు' తమిళము నుంచి వచ్చిందేమో అని అనుకోవచ్చు. కానీ కృష్ణా జిల్లాలోని 'తిరువూరు'  తెలుగునాటి నడిబొడ్డున ఉన్న ఊరు. 'తిరు'ని కలిగియున్న మరికొన్ని ఊర్ల పేర్లను ఇక్కడ ఇస్తున్నాను[1].
1.  తిర్పల్లి , అదిలాబాదు జిల్లా, లక్ష్మణ్‌చందా మండలానికి చెందిన ఊరు
       తిర్పల్లి=తిరు+పల్లె(పల్లి)
2.తిర్తల, ఖమ్మం జిల్లా, ఖమ్మం మండలానికి చెందిన ఊరు
      తిర్తల=తిరు+తల
3.తిర్మాంపల్లి, నిజామాబాదు జిల్లా, నిజామాబాదు మండలానికి చెందిన ఊరు
     తిర్మాంపల్లి=తిరు+మామిపల్లె(మాం పల్లి )
4.తిరువాడ, విశాఖపట్నం జిల్లా, మాడుగుల మండలానికి చెందిన ఊరు
5.తిరుపాడు, కర్నూలు జిల్లా, గడివేముల మండలానికి చెందిన ఊరు
6.తిరువూరు, కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము
7.తిర్యాని, అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము

ఇక 'తిరు'ని కలిగియున్న మిగిలిన ఊర్లన్నీ 'తిరుమల' పేరు మీదుగా ఉన్నాయి. అదే తమిళనాడులో 'తిరు'తో ఉండి 'తిరుమల'మీదుగా లేని ఊర్లు దాదాపు ముప్పది వరకూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే, 'తిరు' అనే మాట ఒకప్పుడు తెలుగునాట కూడా వాడబడి ఉండాలి. ఏదో కారణము చేత అది వాడుకలోనుండి తర్వాత తొలగి పోయి ఉండాలి. బహుశా 'శ్రీ'అనే మాట కుదురుకున్న పిదప 'తిరు' వాడకములోనుండి తొలగి పోయి ఉండి ఉంటుంది.లేకపోతె, ఎక్కడో ఆదిలాబాదు జిల్లాలో ఉన్న ఊరికి తమిళనాడుకీ చుట్టరికము ఎలా కుదురుతుంది?.  ఈ ముచ్చట తేలాలంటే పాత పుస్తకాలూ  శాసనాలూ తిరగవేయాలి.
అయితే ,అప్పటికీ కూడా 'తిరు'అనేది ఇప్పుడు కాకపోయినా మునుపెప్పుడూ కూడా తెలుగు మాట కాదని తేలితే(ఊరికే అనుకుందాము), 'శ్రీ'కి సరియైన అచ్చ తెలుగు మాట ఏమిటి? మీకు ఏమైనా తెలిస్తే చెప్పగలరు. ఈ 'తిరు'గురించి వెదుకుతుండగా , మన సీమలో 'తిమ్మ' పేరుతో చాలా ఊరి పేర్లు ఉన్నట్టు తెలిసింది[1]. నాకు తెలిసి, అవి 'తిరుమల'పేరుతో  ఉన్న ఊరి పేర్ల కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని తెల్లము వెదకగా, తిమ్మ=దీవించు[2] అని ఒక నుడిగంటులో దొరికింది. ఒకవేళ, ఇదే తెలుగు వారి 'తిరు'యా?

ఉటంకింపులు:
1.http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82:%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D_%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81
2.http://telugu.indianlanguages.org/dictionary/wordmeaning.php

3 కామెంట్‌లు:

  1. తిరుమలాయపాలెం వంటివన్నీ తరువాత తిరుపతిని గౌరవిస్తూ పెట్టుకున్న పేర్లే అని నా ఉద్దేశ్యం. తిరు అచ్చ తమిళపదం. కాదు అని నిరూపించాలంటే మీరు పైన ఇచ్చిన ఆధారాలు చాలవు. ఇంకా కావాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దీన్ని నేను ముందే ఊహించాను. తిరుమలాయపాలెం, తిరుమలాపురం వంటివన్నీ 'తిరుమల'ను కలిగి ఉన్నందుచేత మనకు ఆ అరగలి(సందేహం) రావడం చాలా సహజం. ఇంకా చెప్పాలంటే, అలా తలపోయాలి కూడా. కానీ 'తిరువూరు' సంగతేంటి? అయితే మళ్ళీ మీరనవచ్చు, అది ఒక్క ఊరే కదా అని. మీరన్నట్లు ఇంకా ఊరు పేర్లూ, ఇంటి పేర్లూ 'తిరుమల' లేదా 'తిరుపతి' తో ఎట్టి పొత్తూ లేనటువంటివి వెతికి పట్టుకుంటాను. మీరు కూడా వెతకండి. ఇంకో మాట ఏమిటంటే, నేను 'తిరు' తెలుగు మాట మాత్రమే అనలేదు, తెలుగుది కూడా అన్నాను.
      మీ వ్యాఖ్యకు మప్పిదాలు.
      విజయ్

      తొలగించండి

  2. కొన్నిపదాలు తెలుగుకి,తమిళం కి సామాన్యం.ఉదా;వాయి అనే పదం.(నోరు,వాయి)అలాగే తెలుగు,కన్నడం కి కూడా common గా పదాలు ఉన్నవి.ఐతే తెలుగు మీద సంస్కృత ప్రభావం ఎక్కువ.అందుచే చాల తెలుగుపదాలు మరుగున పడ్డాయి.'తిరు ' కూడా అలాంటి పదమే.

    రిప్లయితొలగించండి