13, సెప్టెంబర్ 2012, గురువారం

మా ఊరి మాటల సద్ది మూట (5)

అయిదవ ముక్క: అవీ ఇవీ(1)

ఆసక్తి కలిగించే కొన్ని మా ఊరి మాటలను మీకు ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాను.

కైవారము :చుట్టుకొలత

రొడ్డ: odd
ఎడమ చేయిని కొందరు 'రొడ్డ చేయి' అంటారు. పుర్రచేయి/పురచేయి అని కూడా కొందరంటూ ఉంటారు. మనలో చాలా మందికి బలువైన(భారమైన) పనులూ, చాలా జాగ్రత్తగా చేసే పనులూ కుడిచేతితో చేసే అలవాటు ఉంటుంది. దాన్నే 'కుడిచేతి వాలు' అంటారు మా ఊరిలో.  రొడ్డచేతి వాలు గలవారు కూడా కొందరుంటారు .  కాకపోతే, వీరు కుడివాలు గలవారితో పోలిస్తే చాలా తక్కువ. అందరూ ఒక తీరుగా చేసే పనిని, ఎవరైనా వేరుగా, తేడాగా చేస్తే 'వాడు రొడ్డగా చేస్తున్నాడు' అంటారు. కానీ ఇక్కడ తెల్లము (అర్థము) 'ఎడమ చేతి పని' కాదు. అయితే, అది 'ఎడమ చేతి పని' అన్న దానితోనే మొదలయ్యి ఉంటుందని నా ఊహ. చూసారా కొత్త మాటల పుట్టుక.  భాషను వాడుతుంటేనే, కొత్త మాటలు పుట్టుతుంటాయి. లేకపోతె అక్కడే ఆగిపోతుంది దాని పెంపు. ఇలాంటి మాటలు ఉండగానే, మన వాళ్ళు అంటే పత్రికల వాళ్ళూ, పండితులూ 'odd' అనే ఆంగ్ల మాటకు సంస్కృత మాటను వెతికే పనిలో పడతారు.

ఎదురు: counter
ఈ మాట కొత్తది కాదనుకుంటాను. ఎదురు దాడి, ఎదురు వాదులాట/ఎదురు వాదం లాంటి మాటలు వినే ఉంటారు.

చేసంచి :hand bag
నిజంగా ఈ మాట మా ఊరిలో వాడుకలో ఉంది.  'చేతిసంచి' కొంచెం కురచగా అయ్యి అలా మారిందన్నమాట. ఇంగిలీషు చదువులు చదువుకున్న వారు ఈ తెలుగు మాటను వాడడానికి ఇష్టపడరేమో.

గూడల  సంచి:backpack
బడి పిల్లలు మొదలుకుని ఉద్యోగస్తుల వరకూ అందరూ వీపున వేసుకుని మోసే సంచిని ఈ పేరుతో పిలుస్తారు. అన్నట్టు, 'గూడ' అంటే భుజం అని మా ఊరిలో.

కారు ఎడం: వయస్సులో అంతరం, difference in age
'కారు' అనే తెలుగు మాటకు 'వయస్సు' అని తెల్లము. నిజానికి, 'వయస్సు' అనేది సంస్కృత మాట. 'ఎడం' అనే మాట 'gap' అనే ఆంగ్ల మాటకు సరిగా సరిపోతుంది.

కారెడ్డం:వ్యంగ్యం, sarcasm  
'కారెడ్దపు మాట / కారెడ్డంమాట' అంటే వ్యంగ్యంగా ఉన్న మాట అని. నిజం చెప్పాలంటే ఈ మాటకు సరిగ్గా సరిపోయే  సంస్కృత మాట గానీ, ఆంగ్ల మాట గానీ నాకు తట్టలేదు. దానికి దగ్గరగా ఉన్నట్టుగా నాకు తోచిన మాట వ్రాసాను.

కుంపు:గైర్హాజరు, absent
ఎన్నిసార్లు లేదా ఎన్ని నాండ్లు పనికి పోకపోతే/రాకపోతే అన్ని కుంపులు అన్నమాట. ఈ మాట బాగా పనికి వస్తుందనుకుంటున్నాను. పనికి గైర్హాజరవడాన్ని 'కుంపవడం' అంటారు.

ఆయాం/ఆయం : original 
'ఆయమన్న మనిషన్న వాడెవడూ ఇంత అవమానాన్ని తట్టుకోడు' అనే మాటలో ఈ తెల్లము తడుతుంది.

ఇలా ఇప్పటికే ఉన్న మాటలను గుర్తించి అందరి వాడుకలోకి తేవడం ఒక ఎత్తు అయితే, కొత్త మాటలను పుట్టించుకోవడానికి చేసే వెతుక్కోలు మరొక ఎత్తు. క్రింద కొన్ని మచ్చులు చూద్దాం.

పొలికట్ట
పెద్ద వాన వచ్చినప్పుడు, చెట్ల ఆకులూ, చెత్తా రాలి నేలకు అంటుకునిపోతుంది. వాకిలి ఊడ్చేతపుడు ఆ అంటుకున్న చెత్త మామూలు పొరక(చీపురు)కి రాదు. అందుచేత, పొడవాటి కందిమండలతో లేదా వేరే పెద్ద పుల్లలతో పొరకలాగా కట్టిన కట్టను  'పొలికట్ట' అని పిలుస్తారు. దీనితోనయితో నేలకు  అంటుకున్న చెత్త రావడం మాత్రమె కాకుండా, పెద్ద మొత్తంలో ఉన్న చెత్తను కూడా తేలికగా ఊడ్చేయవచ్చు.  ఇది మా ఊరిలో వాడుకలోని మాట.
పొలికేక:గట్టి కేక
పొలిమేర : ఊరి సరిహద్దు. ఇది ఆ ఊరంతటికీ హద్దు. 'మేర' అంటే హద్దు అని తెల్లమున్నది.
పై మూడు మాటలనుండి మనము ఏమి గమనించవచ్చు? 'పొలి 'అన్న మాట కాకుండా మిగతా సగానికి పై మూడు మాటల్లోనూ సొంత తెల్లములున్నవి. అంతే కాకుండా  'కట్ట','కేక' మరియు 'మేర' అన్న మాటలకు ముందు ఈ 'పొలి ' చేర్చడం వలన వాటి అసలు అర్థం మారకపోగా, మునుపు ఉన్న తెల్లమే గట్టిగా పలుకుతున్నది.  అంటే 'పొలి ' అనేది ఒక మునుచేర్పు(ప్రత్యయం) అనీ, అది ఒక క్రియా విశేషణం(adverb)  అనీ తేటగా తెల్లమవుతుంది. అది మాటల ముందు చేర్చినప్పుడు 'పెద్ద', 'గొప్ప' (సరిగ్గా తెల్లము నాకూ తెలియదు. ఊహిస్తున్నానంతే) లాంటి తెల్లముతో అసలు మాటను ఎక్కువ చేసి చెపుతుందని గమనించవచ్చు. అంటే మనకొక అచ్చతెలుగు మునుచేర్పు దొరికిందన్న మాట.  కొత్త మాటలు పుట్టించవలసి వచ్చినప్పుడు దీన్ని వాడితే సరి.
 మచ్చుకి,
grand festival-->మహోత్సవం=మహా(పొలి)+ఉత్సవం(వేడుక)=పొలివేడుక ==>పొలేడుక. ఈ మాట సరిగ్గా సరిపోకపోవచ్చు. కానీ ఇలా ప్రయత్నించవచ్చని చెప్తున్నాను అంతే.

ఇంకో మాట చూద్దాం.

చిత్తడి అంటే ఏమిటి?
చిత్తడి నేల అంటూ ఉంటాము. దీన్నే, మా ఊరిలోనయితే 'బాడవ' అంటారు. ఊరిలో వంపు(పల్లం)న ఉండే సాగునేల(వ్యవసాయ భూమి)ని ఈ పేరుతొ పిలుస్తారు. సాధారణంగా ఇవి యేటిలో చాలా వరకు తడిగా ఉంటాయి. కొద్ది వానలతోనే ఈ నేలలో  పంటలు పండగలవు.
మరి చిత్తడి నేల అంటే, ఎల్లప్పుడూ తడిగా (దాదాపుగా ) ఉండే ఆని తెల్లమా లేక బాగా తడిగా ఉండే అని  తెల్లమా? అయితే, మనం ఆ మాటను ఇలా విరవవచ్చా, చిత్తడి=చిత్+తడి, చిత+తడి, చిత్తు+తడి
ఎల్లప్పుడూ అనే తెల్లములోనయితే, 'చిత్ ' లేదా 'చిత' అనేది ఒక మునుచేర్పు అయిఉండాలి. బాగా అనే తెల్లములోనయితే, 'చిత్తు ' అనేది సరిపోతుంది. ఎందుకంటే, 'వాడు చిత్తుగా తాగాడు' అంటే వాడు బాగా, నిండుగా తాగాడు అని కదా తెల్లము అంతేగానీ వాడు ఎల్లప్పుడూ తాగాడు అని కాదు కదా. (అన్ని దారులూ పరికిస్తున్నానంతే). చిత్తడి అంటే ఎల్లప్పుడూ తడి అనే తెల్లము ఖాయం చేసుకుంటే 'చిత్ ' లేదా 'చిత' అనే మునుచేర్పుకి 'ఎల్లప్పుడూ' అనే తెల్లమన్న మాట. అయితే  మన ఈ చిక్కపట్టు(సిద్ధాంతం)ని నిరూపించడానికి 'చిత్ ' లేదా 'చిత' అనే మునుచేర్పు కలిగి ఎల్లప్పుడూ అనే తెల్లమును తనలో దాచుకున్న వేరే మాటలను వెతకాలి. అలాగానీ  దొరికినట్లయితే, మన చిక్కపట్టు గట్టెక్కినట్టే.

ఏ భాషకూ అన్ని మాటలూ అది పుట్టినప్పటి నుండి ఉండవు . ఉన్న వాటినుండి కొత్తవి పుట్టిస్తూ, ఇంతకు మునుపు లేని మాటలను వాడుకలోకి తెచ్చుకుంటూ సాగిపోవాలి. బావులు తవ్వడానికి వచ్చిన 'proclain'ని చూసి ఊరి వారు 'తవ్వోడ' అన్నారట ఎక్కడో శ్రీకాకుళంలో . కొత్త మాటలు ఇలా పుడుతుంటాయి. మంది వాడుకలోకిలా వచ్చిన మాటలను వ్రాతలో వ్రాయడానికి ఎందుకు అభ్యతరాలు? ఇలాంటి మాటలను మాండలికాలుగా, పల్లె మాటలుగా ముద్ర వేసి ప్రామాణిక భాష పేరుతో నోరు తిరగని సంస్కృత మాటలు కనిపెట్టాలని చూస్తారు పండితులనబడే కొందరు. ప్రామాణిక భాష ఎవరి కోసం? దాని ఉద్దేశ్యం ఏమిటి ? అందరికీ అర్థం కావాలి అనా? సంస్కృతం చదువుకున్న కొందరికి మాత్రమె తెలియాలనా? మన పుస్తకాల్లో మంది మాటలకు చోటు దక్కదు. పత్రికలకు ఒక భాషా విధానం అన్నది లేదు. వారు కూడా ఇంకా ఇంకా సంస్కృతం వెంటపడుతూ పల్లె ప్రజల మాటలనూ,  తెలుగునూ కించపరుస్తున్నారు. మానవ హక్కుల కోసం ప్రత్యేకంగా కమిషన్లు ఉన్న ఈ రోజుల్లో మంది(జనం,ప్రజ) మాటలను ఇంకా తొక్కిపెడుతుండడం చాలా దారుణం. తెలుగులోనే పల్లె మందిలో వాడుకలో ఉన్న చాల మాటలను మాండలికాలని ముద్రవేసి వాటిని అంటరానివాటిగా చూస్తూ, ఉన్నత వర్గాలవారూ  పత్రికలూ, పండితులు   అనబడే కొందరు వాటికి మారుగా ప్రామాణిక భాష పేరుతొ కొత్త, కఠిన, కృతక సంస్కృత మాటలను పుట్టిస్తున్నారు. లేదా ఆంగ్ల మాటలు రాజ్యం ఏలేలా  చేస్తున్నారు. మన చేతనే మనం మాట్లాడే మాటలు వ్రాతలో, శాస్త్ర విషయాలు చదవడానికీ పనికిరావని, ఎబ్బెట్టుగా ఉంటాయని అనిపిస్తున్నారు. మన భాష ఎందుకు ఎన్నో ఏళ్లుగా పండితులకు అంటరానిదయిపోయింది? 'నెత్తురు' అంటే తక్కువేముంది? 'రక్తం' (సంస్కృతం)అనగానే వచ్చే గొప్పతనమేముంది? ఒకప్పుడంటే ఒక చోటి మాటలు మరొక చోట తెలిసే అవకాసం లేదు. ఇప్పుడు ప్రచార సాధనాలున్నాయి కదా. ఒకే తెల్లమునిచ్చే రకరకాల మాటలను వివిధ మాండలికాల నుంచి సేకరించి అందులో కురచ(పొట్టి)గా ఉండి, దాన్నుండి మరిన్ని మాటలు పుట్టించ వీలున్న మాటలను ఎన్నుకుని పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ వేయవచ్చుగా? తెలుగులో మాటలు లేవని కుంటి  సాకులు చెప్పి వేరే భాషల మాటలు మంది మీద రుద్దేముందు, వారిని అసలైన తెలుగు తెలుసుకోమని కోరుతున్నాను.

మీకు తెలిసినవి, నేటి అక్కరలకు పనికి వచ్చే మాటలు ఉంటే తెలియజేయగలరు.  

3 కామెంట్‌లు:

  1. బాగుంది .. ఇలానే రాస్తుండండి ..

    రిప్లయితొలగించండి
  2. చాలా మప్పిదాలండి. ఇలాగే వ్రాస్తూ ఉంటాను.

    రిప్లయితొలగించండి
  3. పొడవాటి కందిమండలతో లేదా వేరే పెద్ద పుల్లలతో పొరకలాగా కట్టిన కట్టను 'పొలికట్ట' - new words foe us - thanq Vijay gaaruu

    రిప్లయితొలగించండి