తొందరలోనే మా ఊరిలో మాట్లాడుకునే మాటల సద్దిబువ్వ మూట విప్పుదామనుకుంటున్నాను. మాది ఖమ్మం పెవ్వంటెకము (జిల్లా). కొద్ది దూరము తూర్పుగా వెళితే క్రిష్ణా పెవ్వంటెకము తగులుతుంది. సుమారు పదియైదు కిలోమీటర్లు దక్షిణముగానూ, పడమరగానూ వెళితే వరుసగా నల్లగొండ, వరంగల్లు పెవ్వంటెకముల ఎల్లలు తగులుతాయి. మా ఊరి మాటలలో ఆ మూడు పెవ్వంటెకముల మాటల కలయిక చక్కగా చూడవచ్చు. నేను సెలవుల్లో ఊరికి పోయినప్పుడల్లా కొత్త మాటలు నేర్చుకుంటూనే ఉంటాను. తరగని గని మా ఊరు. ఊర్లో ఉన్నప్పుడు మన చుట్టూ , ఎప్పుడూ మంది (జనాలు) మాటలాడే పదాల గొప్పతనాన్ని, వాటి తెల్లమును(అర్థము) ఎరుగము. కాని ఎక్కడైనా పుస్తకాల్లో చదివినప్పుడో, ఇంకెక్కడైనా గొప్పవాళ్ళు అనబడే వాళ్ళు మాటలాడినప్పుడో 'అరె ఇది మన ఊళ్ళో వాడే మాటే, దీని తెల్లం ఫలానా' అని గుర్తుకు వస్తుంది. మీకేమో గాని నాకైతే చాలాసార్లు అలా అనిపించింది.
మన దగ్గర పండితులని పిలిపించుకునేవారు చిన్నచూపుతోనో, మరెందుచేతనోగాని పల్లెమాటలను పెద్దగా పట్టించుకోలేదు. మనపల్లెలలో మనకి తెలియని మాటలు చాలా ఉన్నాయి. తెలుగులో ఎక్కువ మాటలు లేనందువల్ల ఇతర భాషల (సంస్కృతము, ఉర్దూ, హిందీ, ఆంగ్లము ము..) నుండి మాటలను అప్పు తెస్తున్నామనే సాకు ఊరకే గాలికి ఎగిరిపోయే దూదిపింజ లాంటిది. మొదట మనము మన దగ్గర వాడుకలో ఉన్న మాటలు తెలుసుకోవాలి. అచ్చమైన తెలుగు మాటలు పల్లెల్లో కోకొల్లలు. సంస్కృత పండితులకేమి తెలుస్తాయి అవి. వారి చూపుల్లో అవి చదువులేని వారి మాటలు. దేవభాషయగు సంస్కృతమునకు ఇవన్నీ ఏ పాటి అంటారు. మొన్నటిదాకా తెలుగుకి సంస్కృత రంగు పులిమారు. ఇప్పుడేమో ఆంగ్లము గ్రహణమై పట్టి కూర్చుంది. సగం చచ్చిన మన తెలుగు ఉనికిని ఇతర భాషల ప్రభావాన్నుండి కాపాడుదాం. అందుకే నా వంతుగా మా ఊరిలో మాటలాడే మాటలను ఏరి ఒక చోట కూర్చాలనుకుంటున్నాను. కనీసం ఇప్పుడు వాడుకలో ఉన్న మాటలైనా, చాపకింద నీరులా దెబ్బ తీసిన తీస్తూ ఉన్న సంస్కృతము వల్లనో, ఉప్పెనలా ఉరికి వస్తున్న ఆంగ్లం వల్లనో మరుగున పడిపోకుండా ఉండాలనేదే నా కోరిక. నేను ఇదంతా చేసేది, వ్రాసేది ఏ భాషమీదా పగతో కాదు, నా తెలుగు మీద కూరిమి(ప్రేమ) చేత మాత్రమే.
నేటికి మాత్రము నే విప్పబోయే సద్ది మూట వాసన చూపిస్తాను.
మా ఊరి మాట (తెలుగు) సంస్కృతము ఆంగ్లము
1. మొత్త ద్వారము gate, entrance
2.తలమొత్త ప్రధానద్వారము, సింహద్వారము main gate, main entrance
చూశారా, చక్కని తేలికైన తెలుగు మాటలు ఉంచుకొని మనం సంస్కృతము వెంటా, ఆంగ్లము వెంటా ఎలా పరుగులు తీస్తున్నామో. మరి ఈ మాటలను వాడుకలో పెడదామా? మన భాషలో మాటలాడడానికి సిగ్గుపడడం ఎందుకు?
ఈ మాటలను మీ ఊరిలో ఏమంటారో తెలుసుకోగోరుతున్నాను.
మన ఏలికలు, ఏలుబడి సాగించే మేడల ముందు, మిద్దెల ముందు ఉంచే పేరుపలకల మీద, అయితే సంస్కృతములోనో లేకపోతే ఆంగ్లములో ఎందుకు వ్రాస్తారో తెలియడములేదు. వారికి మన (మంది) భాష గిట్టదేమో. లేక తమను గొప్పవారిగా వేరుపరుచుకొవాలనేమో. అందుకేనేమో అందరి భాషలో వ్రాయడము లేదు. రాతకోతలు జరగనివ్వడములేదు. అంతా ఆంగ్లములోనే చేస్తారు. తెలుగు పేరు చెప్పి సంస్కృతములో వ్రాస్తారు. మన తలపట్టణం(రాజధాని నగరం)లో ఎన్ని పేరుపలకలు తెలుగు లిపిలో చూడగలము? అందులో తెలుగులో(సంస్కృతంలో కాదు, తెలుగులో) ఎన్ని ఉంటాయి? నా లెక్క చొప్పున, తెలుగు లిపిలో కొన్ని ఉన్నాయి, కానీ అవన్నీ తెలుగు పేరు చెప్పి సంస్కృతములో వ్రాసినవే. తెలుగువి లేనే లేవు. దీనికంతటికీ కారణము మన భాష మీద చిన్న చూపే.
ఇకనైనా మేలుకొని మన నుడి(భాష)ను, దాని ద్వారా మన ఉనికిని కాపాడుకుందాం.
నమస్తే గెలుపుగాడుగారు..!
రిప్లయితొలగించండిమీ భాషాభాభిమానానికి (తెలుగు మాట ఏంటి..?) నా మంగిడీలు (జోహార్ అనేది ఉర్దూ పదం కనుక). మీ రాతలో చాలా తెలుగు మాటలు తెలుస్తున్నాయి. ఈ టపాలో "పండితులు"కి మారుగా పొలవరలు అనీ, "పుస్తకం"కి మారుగా పొత్తం అనీ, "దక్షిణం"కి మారుగా తెక్కణం అనీ వాడొచ్చేమో ఆలోచించండి. (తలపోయండి అనొచ్చా..?)
సరే.. మీ "తల పట్టణం" అదేనండీ రాజధానికి మారుగా వాడిన మాట.. చాలా బావుంది. మీ బ్లాగు కూడళ్ళలో ఉన్నదా..?
పెక్కు నెనర్లండి వామన గీత గారూ..
తొలగించండిఓపికగా చదివి వ్యాఖ్య(తెలుగులో ఏమంటారో..) వ్రాసినందుకు. మీరు చూపించిన దిద్దుబాట్లను అమల్లో పెడతాను. సంస్కృతంలో ఉన్న 'ముఖ్య ' అన్న మాటకు మారుగా తెలుగులో 'తల ' అనేది వాడతారని మనం గమనించవచ్చు. నేను మొన్నీనడిమినే బ్లాగు వ్రాయడం మొదలుపెట్టినవాడిని. కూడలిలో ఈ బ్లాగుని ఎలాచేర్చాలో కొంచెం తెలపండి.
తెలుగు బ్లాగుల కూడళ్ళు చాలానే ఉన్నాయి. వాటితో మీ బ్లాగుని కలపడం పెద్ద పనేమీ కాదు. మచ్చుకకి ఇచ్చిన ఈ లంకెలని చూడండీ
తొలగించండిఇది కూడలికి చెందిన లంకె
http://koodali.org/add
ఇది హారంకి చెందిన లంకె
http://www.haaram.com/Join.aspx?ln=te
ఆయా కూడళ్ళకు మీ బ్లాగు URL(మీ బ్లాగుది http://pottapinjara-vijay.blogspot.in/, నాకు మొదట్లో ఈ సంగతి తెలియదు కనుక చొరవ తీసుకుని చెబుతున్నాను.)ని తెలియజేస్తూ వేగుని(e-mail)ని పంపడమే.
తెలుగు బ్లాగరుల గూగులు గుంపు కూడా ఉన్నది "తెలుగు బ్లాగు"అని. అందులో కూడా చేరండి.
నెనర్లు
లెక్క లేనన్ని నెనర్లండి.
తొలగించండిసంస్కృతం - తెలుగు
రిప్లయితొలగించండిఉత్తరం - వక్కణం
దక్షిణం - తెక్కణం
అన్నట్టు స్పాం ఫిల్టర్ ని తొలగించగలరు. ఇబ్బందిగా ఉన్నది.
ఈ మాటలను తెలిపినందుకు నెనర్లండి.
తొలగించండిమీరు చెప్పిన 'వక్కణం ' అన్న మాట నాకు ఒక చిన్న సంగతిని గుర్తుకు తెస్తున్నది. ఎక్కడో చదివాను కేరళలో 'వడక్కునాథన్ ' కోవెల అనేది ఒకటుందని. అది శివయ్య నెలవు. ఆ పేరులోని 'వడక్కు ' అన్న మాటకు వక్కణపు దిక్కు అని తెల్లము. చూసారా ఆ చుట్టరికము..? వెరసి ఆ పేరుకు 'వక్కణపు దొర ' లేదా 'వక్కణపు ఏలిక ' అని తెల్లము చెప్పుకోవచ్చు.
మీ బ్లాగు చాలా బాగుంది అండీ....మీ నుంచి మరిన్ని టపాలు ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండి