గురి=aim
eg.my aim is to become a teacher
మచ్చు:వెజ్జు కావడమే నా గురి
వెజ్జు=ఉపాధ్యాయుడు,teacher
ఒజ్జ=వైద్యుడు,doctor
నూరు=వంద,శతం
నూరేడు=శతాబ్దం,century
విసాగు=సంస్కృతి,culture
తొలి=మొదటి,first
మలి=తర్వాతి,next
ఇరు=రెండు
అనిపింపు=భావన,feeling
జడుసుకొను,దడుసుకొను=భయపడు
పొత్తు=సంబంధం,relation
చుట్టము=బంధువు,relative
మగత=మత్తు
నెలవు=నిలయం,ఆలయం,abode
కొలువు=ఉద్యోగం,job
మట్టు=పద్ధతి
కూటము=సంఘము,association,
సీమ=ప్రాంతము,
నాడు=దేశము; నాడు=రోజు
ఏలిక=రాజు,ప్రభువు,ruler
తెల్లము=అర్థము,meaning
తేటగా=clearly
తేటపరచు=వివరించు,clarify
మాపటి సంది= సాయంత్రం నుండి
మొల,సీల,మేకు=nail
తీరు,రీతి=విధం,kind,type
ఆను,దన్ను=ఆధారము,evidence
ఆచూకి,జాడ =చిరునామా,address
చిక్కు=ప్రహేళిక,puzzle
ఆనిడిగా=స్వతంత్రంగా,independently
ముచ్చట=సంగతి,విషయము,matter
ఎల్లరకొక విన్నపము. మన బాసను మనము కాపాడుకుందాం. ఈ సంస్కృత, ఆంగ్ల వెల్లువలో పడి కొట్టుకొని పోకుండా, ఆ మోజులో పడి మగత చెందకుండా,అచ్చ తెలుగులోనే మాటలాడడానికి నడుం కట్టుదాం. కొందరిది చాదస్తం అనుకోవచ్చు. లోకమంతా ఒక చిన్న పల్లె లాగ మారిపోతున్న, ఈ యుగంలో, ఇదేమి వరస అని. ఎన్ని దేశాలేగినా, ఎంత గొప్పవాడివయినా, ఏదైనా గొప్ప ఇబ్బంది వచ్చినప్పుడు,దెబ్బ తగిలినపుడు, అమ్మను,అయ్యనే తలుచుకుంటామెందుకు? మనదంటూ మనకొకటుండాలి, మనకు సొంతమయింది. దేశపు నలుమూలలనుండి జనలొక చోట గుమిగూడితే, ఏ భాషవాళ్ళు ఆ భాషా గుంపుగా ఎందుకు విడిపోతారు మరి? ఆలోచించండి.ఇప్పుడు మన భాష అని మనమనుకుంటున్నది మనది కాదు. ఆ సంస్కృతీ మనది కాదు.మన మీద ఎన్నో నూరేళ్ళుగా బలవంతంగా రుద్దబడింది. మనవి అనుకుంటున్న ఆ పురాణాలనే అడగండి, చెపుతాయి, రక్కసులెవరో,దేవతలెవరో. తొలినుంచీ ఈ సీమలో బతుకుతున్నవారు రక్కసులు. బయటినుండి వచ్చిన వారు,ఆక్రమణదారులు దేవతలు. అంతెందుకు బలి చక్రవర్తి గోస పరికించండి. అవే పురాణాలు ఆయన గొప్ప ఏలికనీ అంటాయి, కాని ఈ నేల మీద ఉండతగినవాడు కాదంటాయి.కాబట్టి నేరుగ ఎదురించలేక, మాయోపాయంతో, అడుక్కునే వాడిగా వచ్చిన ఒక మనిషి ఆయన్ను చంపాడు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు బలి. ఈ సంగతులన్నీ పని లేక చెప్పే మాటలని కొందరనడానికి ఎల్లవేళలా తయారుగా ఉంటారు. మన దేశాన్ని విడగొట్టడానికి జరుగుతున్న కుట్రగా కూడ చెప్పగల దొడ్డవారున్నరు. అంతే కదా ఉన్నమాట చెపితే ఉడుక్కోకుండా ఎలా ఉండగలరు? మన భాషను మట్టుగ మట్టుబెట్టిన వారిపై, ఇంకా అలా చేయడమే పనిగాగలిగినవారిపై, కత్తి దూసి, పోరుకు పోదామనడం లేదు. అయినకాడికి వొదిలేసి, ఇకనైనా మేలుకుని, 'మన ' తేనెలొలుకు తేట తెలుగు బాసను కాపాడుకుందామంటున్నను.
సెలవు
గెలుపుగాడు గారు..!
రిప్లయితొలగించండితెలుగుమీద ఎంత కూరిమి ఉన్నప్పటికీ మీరు సంస్కృతమ్మీద ఆడిపోసుకోవడం ఏమీ బాగాలేదు. ఆర్యులు - ద్రవిడులు సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మీరీ భావాలని రాసారని ఊహించగలను. ఆ సిద్ధాంతానికి బలిమినిస్తూ ఎన్ని నిరూపణలున్నాయో, తెగ్గొడుతూ అన్నే నిరూపణలున్నాయి. అట్టి గొడవల జోలికి నుడీ మీది మమకారం ఉన్నవారు పోకూడదని నా ఉద్దేశ్యం. సంస్కృతం ముమ్మాటికీ భారతీయ భాష, ఈ దేశంలోనే పుట్టిన భాష (ఆర్యులు బయటనుండి వచ్చినవారు అయినా కాకపోయినా). పాత రోజుల్లో దేశం మొత్తానికీ లంకెలను ఏర్పరచిన భాష. దాన్ని తిట్టుకుంటే, మనకంటూ ఏ మెలనా(మెలన- చరిత్ర) మిగలదు.
దండాలు వామనగీత గారూ..!
తొలగించండినాకు సంస్కృత భాష మీద కోపం లేదు కానీ ఆ భాషను తెలుగులోకి ఇంతలా చొప్పించి అప్పటికే ఉన్న పెక్కు తెలుగు మాటలను వాడుకలోంచి పోయేట్టు చేసిన వారి మీదే నా కోపం. ఇప్పుడున్నట్టుగానే కొనసాగితే, మచ్చుకి రాబొయే యేండ్లలో 'మొగుడూపెళ్ళాలు ' అనే మాట వాడుకలోంచి తప్పిపోతుందని నాకనిపిస్తున్నది. ఎందుకంటే అలా పిలవడం తప్పుగా అనుకుంటున్నాము. 'భార్యాభర్తలు ' లేదా 'వైఫ్ అండ్ హస్బెండ్ ' అనడం గౌరవంగా అనుకుంటున్నాము. 'బువ్వ ' నుండి 'అన్నం 'కి మారిపోయినట్లు. ఇలాగే కదా మాటలు వాడుక నుండి తప్పిపోయేది.
ఏ నుడి అయినా గిరి గీసుకుని కూర్చున్నట్టయితే ఎక్కువ కాలం మనలేదనే మాటను నేనెరుగుదును. కానీ ఒక నుడిలో డెబ్బది పాళ్ళకు పైగా ఇతర నుడి మాటలు ఉన్నాయంటే, ఆ నుడి చాలా కొత్తదై, కొద్ది మంది వాడుకలోనే ఉంటూ, చుట్టూ ఆ ఇతర నుడి చేత కప్పబడి ఉండి ఉండాలి. ఇంత పాతదైన తెలుగులో, ఇంతమంది వాడకంలో ఉన్న మన నుడిలో అన్ని సంస్కృత మాటలున్నయంటే నాకైతే పెద్ద కుట్ర దీని వెనక ఉన్నదనిపిస్తున్నది. సంస్కృతంకి మారుగా తమిళమో, కన్నడమో మరే ఇతర నుడో ఉన్నా నేను అలాగే అనుకొంటాను. మీరు గాని అలాంటి కుట్ర ఏమీ లేదు అది తనంత తానే జరిగిందంటే నేను ఒప్పుకోలేను.
ఇక మీరన్నట్టు సంస్కృతం భారతీయమే అయి ఉండవచ్చుగాక. కానీ అది దేవభాష అని ఊదర గొట్టి ఆ నుడిని అడ్డం పెట్టుకుని లెక్కలేనన్ని చెడ్డపనులకు దిగిన మాటను ఎలా మరువగలం? అదే తరిన, ఈ నుడిలో పెక్కు ఎసుదులను(శాస్త్రాలను) వ్రాసి ఎల్లరకు చాటిన మాటను కూడా నేను మరువను. ఇది నేను ఆ చెడ్డ పనులకు ఒడిగట్టిన వారిపై చేసే యెగ్గుయే గానీ అందుకు పనికి వచ్చిన నుడి మీద కాదు.
మీ సూచనలకు నెనర్లు. అన్నట్టు ఆంధ్రభూమి ఆకిక(పత్రిక)లో వారం వారం వచ్చే 'నుడి 'పుటలో తెలుగు గురించిన ఎన్నెన్నో కొత్త సంగతులను తెలియజేస్తున్నారు. చదవడం మరువకండి (మీకు ఇప్పటికే తెలియనట్లయితే).
తెలుగు మాటలని "బూతు"మాటలనీ, తక్కువ మాటలనీ తొక్కేస్తున్నారని నేను ఒప్పుకుంటున్నాను. దానిని కచ్చితంగా తెగనాడవలసిందే.నేనూ తెలుగు మాధ్యమం వాడినే. తెలుగు అచ్చు పొత్తాలలో సంస్కృత పదాలు వాడడం వల్ల విషయం అర్థం కాక గజిబిజి అయిపోయినవాణ్ణే. తక్కినవారి పరిస్థితీ అదేననీ తలపోస్తున్నాను.
తొలగించండిమీరు దేనినైతే "కుట్ర" అని అంటున్నారో, అటువంటిదేదో జరిగి ఉండొచ్చని నా అనుకోలు కూడా, కానీ దానిని "కుట్ర"అని అనలేను. ఓసారి మన మెలనని చుసుకుంటే "భక్తి ఉద్యమం" తీరుతెన్నులు సంస్కృతినిని కాపాడుకోవడం అని తెల్లం అవుతున్నది. ఎవరినుండి కాపాడుకోవాలి ..అంటే, విదేశీ దాడుల నుండి.
ఉమ్మడి శకం 10వ నూరేడులో గజనీ మహమ్మదు సోమనాధ దేవాలయాన్ని కొల్లగొట్టాడు. ఆ దాడి మొదటి నుండి (అంతే అఫ్ఘనిస్తాన్ లోని గజనీ నుండీ) చివరి వరకూ (సోమనాధ్) మొత్తం నెత్తురోడింది. ఎందరో పొలవరల(పండితుల)ని చంపారు. అప్పటివరకూ ఉన్న వ్యవస్థ తుడిచిపెట్టుకుపోవడం మొదలైంది. (ఆ వ్యవస్థ ఏమిటో మనకి సరైన అవగాహన లేదు. మనమున్న హిందూ వ్యవస్థ గత వెయ్యేళ్ల కాలంలో ఎన్నో మార్పులకు లోనైంది). అంతకు ముందు 8వ నూరేటిలో అరబ్బులు సింధు దేశాన్ని కొల్లగొట్టారు. విదేశీ దాడులు జరిగిన, జరుగుతున్న ప్రతీసారి ముందుగా బలైయ్యేది పొలవరలే. ఆ తరి(సమయం)లో ప్రాచీన జ్ఞానాన్ని కాపాడుకోవడం, (అందుకే కేటాయించబడిన వర్గాలవారికి) కష్టమయ్యింది. ప్రజల జ్ఞానాన్ని, ప్రజలలోకి తీసుకుపోతేనే దానికి మనుగడ ఉంటుందన్న సంగతి ఎరుకపడి. అప్పటి సంస్కృతంలో ఉన్న జ్ఞానాన్ని మంది నుడులలోకి తీసుకురావడం మొదలుపేట్టారు. దాన్ని మొదలు పెట్టిందీ తెలుగువారే. నన్నయ దానికి మొదలు అనుకోవచ్చు. (ఇప్పటికి బయటపడినవాటి ప్రకారం). ఆ తర్వాత అది భారతమంతా అమలుచేయబడింది. తులసీదాసు ఆవధీ (హిందీ కాదు) నుడిలో "రామచరితమానస్" రాసినా, మీరా "బ్రజ్" నుడిలో "కృష్ణ లీల"ని రాసినా, తెలుగువారు మొదలిడిన తర్వాతే. అది మనుగడ పోరు, కుట్ర కాదు. అయితే, ఆ సాహిత్యంలో భక్తి రచనలు మాత్రమే బతికి బట్టకట్టడం వల్ల అదో "కుట్ర" అనిపిస్తోంది చాలామందికి.
తురుష్కుల దాడిలో ఆనవాలు కూడా మిగల్చకుండా పోయినా జ్ఞానం ఎంతో తెలియడానికి ఒక చిన్న మచ్చుతునక తక్కశిల (తక్షశిల) విశ్వవిద్యాలయం. ఒక్క పొత్తాలిలి (గ్రంథాలయం / పొత్తాలు + ఇలి) తగులబెట్టడానికే తురుష్కులకి నెలన్నర పైగా పట్టిందట. అది ఒకప్పటి పేరెన్నిక గన్న విశ్వవిద్యాలయం పరిస్థితి. చిన్నా చితకా విశ్వవిద్యాలయాల సంగతి మెలన పొత్తాలకే ఎక్కలేదు. అంతెందుకు తెలుగువాళ్లు మనదిగా గొప్పగా చాటుకునే విజయనగరానికి చెందిన మెలనని మనం పడమటోళ్ళ పొత్తాల(Westerners Literature) నుండీ తెలుసుకుంటున్నాం. 15వ నూరేటికి విజయనగరపు మంది 5 లక్షలుండేది (ట). అది, అప్పట్లో ప్రపంచంలో రెండవ పెద్ద పట్టణం (మొదటిది చైనాలోని పెకింగ్/బీజింగ్). తళ్ళికోట పోరులో మొత్తం తగలబడింది. లక్షలమంది ఊచకోత కోయబడ్డారు. అందుకు బహమనీలకి 6 నెలలు పట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే, ఎప్పటికీ అవ్వదు.
సంస్కృతం దేవభాష అనేది అవగాహనా రాహిత్యంతో చేసిన ప్రచారం. సంస్కృతంలో భారతీయుల ప్రాచీన విజ్ఞానం పొందుపరచబడింది. అంతే...! (ఇప్పుడు ప్రపంచంలో ఇంగ్లీషు ఆ స్థానాన్ని పొందింది).సంస్కృతం నిలబడింది కేవలం తెలుగు వల్లనే, తెలుగువారి వల్లనే. అందుకు ప్రపంచం మొత్తం తెలుగువారికి ఋణపడి ఉంటుంది. అదే విధంగా బౌద్ధ సాహిత్యం కాపాడబడింది త్రివిష్టపం లేదా తిబ్బత్ (టిబెట్)లో.(10-19 నూరేళ్ల నడిమితరిలో లేని ప్రమాదం 20వ నూరేటిలో వారు ఎదుర్కొంటున్నారు, చైనా నుండి.) మరే ఇతర నుడీ గానీ, నుడివరులు గానీ సంస్కృతాన్ని ఇంతలా అక్కున చేర్చుకోలేదు. 10-19 నూరేళ్ల నడిమి తరిలో తెలుగువారు తీసుకున్న సంస్కృతీ పరిరక్షణ బాధ్యతని ఇప్పుడు హిందీ వాళ్ళు తీసుకున్నారు. "అధికార భాష హిందీ" అంటే హిందీ (ఖరీబోలీ లేదా ఉరుదూ అనే ప్రాకృతం నుండీ పుట్టిన నుడి ) వ్యాకరణంలో ఉన్న సంస్కృతమే. అందువల్ల తెలుగువాళ్ళు తెలుగుకోసం పాటు పడితే సరిపోతుంది. నిజానికి దీని గురించి టపా వేసుకుందామనుకున్నాను. రాయాలనిపించి ఇక్కడ రాసేసాను. ఏమనుకోకండి.
అన్నట్టు, ఆంధ్రభూమి "నుడి" నే చదువుతున్నానండి.
నెనర్లు.
మంచి పాయింట్స్ చెప్పారు.మీకు ఈ సంగతుల గురించి బాగా తెలిసినట్లుంది.అయితే, సంస్కృతంలో పెక్కు ఎసుదుల పొత్తాలున్నయి గదా వాటిలో ఎన్నింటిని మన తెలుగు నుడివరులు తెనిగించారు? అవి ఇప్పుడు మనకి చిక్కక పోయినవైనఫ్ఫటికీ కనీసం ఎవరైనా ఇదిగో ఫలానా ఆయన ఫలానా సంస్కృత ఎసుదు పొత్తాన్ని తెనుగు చేసాడు అంటూ అయినా చెప్పి ఉంటాదు కదా. అలాంటి పొత్తాలు ఏమిటో కొంచెం తెలియజేస్తారా? మీరన్నట్టు భక్తి వ్రాతలు మాత్రమే ఉంటే అది గొప్ప అరగలికి తావునిస్తుంది. అప్పటిదాకా తెక్కణ భారతంలో విలసిల్లిన బౌద్ధ, జైనాలు భక్తి ఉద్యమంతో ఆనవాళ్ళు కూడా లేకుండా తుడిచిపెట్టుకునిపోయాయెందుకు? ఒక్కో బౌద్ధ భిక్కు తలకి ఇంత అని వెలకట్టడం లాంటి పనులు చేసి వారిని ఇక్కడనుండి తుడిచివేసారని నేను విన్నాను. దీని గుట్టు కూడా కొంచెం విప్పిచెప్పగలరు.
తొలగించండిపెక్కు నెనర్లు
మీరు రెండు అడకలని అడుగుతున్నారు..
తొలగించండినాకు వీటిమీద మరీ అంత పట్టు లేదు.. బ్లాగులలోనూ, అంతర్జాలపు ఆకికల్లోనూ వ్రాతలను చదివి అనుకుంటున్న తలంపులు మాత్రమే. అయినా, మీకు బదులివ్వడానికి ప్రయత్నిస్తాను.
సంస్కృతపు ఎసిదుల పొత్తాలలో తెనిగింపు జరిగినవేవింటీ అని..?
నాకు తెలిసున్నంతవరకూ పావులూరి మల్లన (నన్నయ తరి వాడే..అంతె సమకాలికుడే) "గణిత శాస్త్ర సంగ్రహం"అని అదే పేరున్న సంస్కృత పొత్తాన్ని తెలుగులోకి నుడిగించాడు. (దానికి పావులూరి గణితము అని కూదా పేరుంది.) ఇదే మొదలు అంటారు. తర్వాత మనుమంచి భట్టు "హయలక్షణ విలాసం" (గుర్రాల గురించిన ఎసిది), కూచిరాజు ఎర్రన "కొక్కోరకం" (కామశాస్త్రానికి చెందినది), అప్పనమంత్రి "వైద్య గ్రంథం"లాంటివి మచ్చుకి కొన్ని. ఇవన్నీ ఈనాడు ఆకికలో చదివినవి. వీటిల్లో ఎన్ని దొరుకుతున్నాయో ఎన్ని దొరకడం లేవో తెలీదు. చివరి కాకతీయ ఏలిక ప్రతాపరుద్రుడు కూడా పొలవరే. ఆయన రాజనీతి మీద గ్రంధాన్ని రాసాడని అంటారు. అది ఏదేని సంస్కృత పొత్తానికి తెనిగింపో, లేదా అచ్చ తెనుగు పొత్తమో తెలీదు. నాకు తెల్లమైనంతవరకూ అవి పద్య రచనలు. "పద్య" రచనలు ఎందుకు చేస్తారో అని నాకు ఎప్పుడూ అరగలి కలుగుతూ ఉండేది. అది కూడా ఇటీవలి ఎక్కడో చదివాను. పద్యం గానీ పాట గానీ వచనం కన్నా గుర్తు పెట్టుకోడానికి, వల్లె వేయడానికీ సులువుగా ఉంటుంది. దానివల్ల ఒక తరం నుండి ఇంకో తరానికి చేరడానికి అనువుగా ఉంటుంది. అందుకే మనకి మిగిలిన వాటిలో ఎక్కువ వాటా తెలుగు పద్యాలూ, సంస్కృత శ్లోకాలే కనబడతాయి తప్ప వచనాలు చాలా తక్కువ. సంస్కృత పదాలు ఎక్కువగా వాడడానికి ఇదీ ఒక కారణం కావచ్చు. పద్యం రాయడానికి ఛందస్సు, యతులు, ప్రాసలు వంటి కట్టుబాట్లు ఏర్పరిచారు. ఈ కట్టుబాట్లు, వ్రాసేవారిని ఇబ్బంది పెట్టినా వల్లె వారికి అనువుగా ఉండడం కోసం ఏర్పాటుచేయబడినవి. ఒక తెల్లం చెప్పడానికి తెలుగుకున్న మాటలు తక్కువ కాకపోయినప్పటికీ, సంస్కృతం తో కలిపితే ఇంకా పెరుగుతుంది కనుక వాటిని కూడా కలిపేసి ఉండొచ్చు.
అదలా ఉంచితే, ఈ ఎసిది పొత్తాలూ, రాతలూ విజయనగర ఏలికల తరిలోవి చాలా తక్కువ దొరికాయి. ఆ కాలంలో తెలుగు అందలమెక్కింది. నన్నయ తరిలోనే ఎసిది పొత్తాలు వచ్చినపుడు, విజయనగర తరిలో వచ్చుండాలి కదా..! వచ్చే ఉండొచ్చు. కానీ అవి దొరకకపోవడానికి కారణం అది కూలినపుడు జరిగిన ఊచకోత అవుతుంది. "భక్తి" అనేది "ఎసిది"కన్నా తొందరగా మందిలోకి చేరుకుంటుంది. అందువల్లనే భక్తి రాతలు మిగిలాయి, ఎసిది రాతలు పోయాయి. మందికి వచ్చింది మాత్రమే మిగులుతుంది తప్ప పొలవరలకి తెలిసింది కాదు. అయినా సంస్కృతం లోనివి, తెలుగులోనివి అన్ని ఎసిది పొత్తాలు బతకడం చాలా గొప్ప విషయం.
మనం తొలి తెలుగు వాగ్గేయకారుడని ఎవరిని అంటాం. "తాళ్ళపాక అన్నమయ్య"ని. కానీ అది తప్పు. తొలి తెలుగు వాగ్గేయకారుడు "కృష్ణమయ్య". ఈయన 13వ నూరేటిలో సింహాచల అప్పన్నసామిని కొలుస్తూ 4 లక్షల కీర్తనలు రాసాడట. అంటే అన్నమయ్య కంటే 300 ఏళ్ళు ముందు వాడు. 4 లక్షల కృతులలో 200 మాత్రమే దొరికాయి. మిగిలినవి ఏ చీకటికలుగులోనో, ఎక్కడో మందికి తెలియకుండా, మందిలోకి రాకుండా ఉన్నాయి. (అన్నమయ్య గురించి మన ముందటి తరి వారికి అంటే గురజాడ, కందుకూరి లాంటివాళ్లకి తెలీనే తెలీదట. మనం వారికన్నా అదృష్టవంతులమే కదా..!). అలా ఇంకెన్ని భక్తి పొత్తాలూ, ఎసిది పొత్తాలు ఉండిపోయాయో ఎవరికి తెలుసు..?
ఇంకొటి, "భక్తి ఉద్యమం"వల్ల బౌద్ధం, జైనం అని తుడిచిపెట్టుకపోయాయి కదా.?
తొలగించండినిక్కమేంటంటే, భక్తి ఉద్యమం పురుడుపోసుకోడానికి ముందే బౌద్ధం, జైనం మన తావునుండి పోయాయి. జైనం ముందు నుండి పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. కారణం అతిగా "అహింస"ని పాటించడం వల్ల. మచ్చుక్కి ఒక సంగతి, "మనం నడుస్తున్నపుడు కంటికి కనిపించని ఎన్నో జీవులు మన కాలికింద పడి చనిపోతూ ఉంటాయి. అందువల్ల ప్రతీ మనిషీ నడిచేటప్పుడు తన దారిని చీపురితో తుడుచుకుంటూ వెళ్ళాలి". అని చెప్తుందట ఏదో గ్రంథం. ఇది జె. నరేంద్రదేవ్ రాసిన "విశ్వ విజ్ఞాన దర్శిని"లో రాసిన విషయం. అంతకంటే ఎక్కువేమీ తెలీదు, నాకు.
ఇంక బౌద్ధం సంగతి, మన తావులో బౌద్ధం మొదట్లో బానే ఉన్నా తర్వాతి తరిలో తప్పుదోవ పట్టిందట. నాగార్జునుడు (తెలుగాయనే కావచ్చు) మహాయానం అనే బౌద్ధ శాఖని మొదలుపెట్టినప్పటినుంచీ ఇది మొదలై ఉండొచ్చు. నాకు తెలిసున్నంతవరకూ బుద్ధుడు చెప్పింది వేరు, మహాయానులు పాటించినది వేరు. చివరికి బౌద్ధారామాలు వ్యభిచారకూపాలుగా కూడా మారిపోయాయి అంటారు. ఇప్పటికీ కొంతమంది వీటిని "లంజె దిబ్బలు" అని పిలుస్తారట. ఏది ఏమైనా మన తావున మహాయానం విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించిందని చాలా చోట్ల చదివిన సంగతి. అది సిసలైన బౌద్ధం కాదు. సిసలైన బౌద్ధాన్ని, బౌద్ధులనీ "హీనయానమ"నే పేర మహాయానులే తన్ని తరిమేసారని అంటారు. హీనయానం మన దేశంలో బతకలేకపోయింది గానీ తిబ్బత్, చైనా, మయన్మార్ వంటి నాడులలో బతికే ఉంది.
తురుష్కులు బ్రహ్మర్షి దేశాన్ని (ఆఫ్ఘనిస్తాన్) కొల్లగొట్టినపుడు అక్కడ కూలింది బౌద్ధమే. అప్పట్లో హిందువుల కన్నా బౌద్ధులే ఎక్కువమంది, అక్కడ. అచ్చమైన బౌద్ధానికున్న కొన్ని లోపాలు దాని కొంప ముంచి కూడా ఉండొచ్చు. చిన్న మచ్చుతునక ఏంటంటే, తిమొజిన్ అనే ఆటవికుడు (తిమొజిన్ నే అందరం చెంఘీజ్ ఖాన్ అని పిలుస్తున్నాం) చాలా తక్కువ బలగంతో గొప్పదైన చైనా సామ్రాజ్యాన్ని కూలగొట్టాడు. దానికి అందరూ చెప్పుకునే కారణం చైనా ఏలికకి మందలకొద్దీ సైన్యమున్నా, నాటికాపు(నాడు యొక్క కాపు - దేశరక్షణ) కూడా "హింస" అని అనుకోవడం వలన పోరే సలపలేదని అంటారు. ఇది ఎంతవరకూ నిజమో తెలీదుగానీ అప్పటి చైనా మొత్తం బౌద్ధమే.
బౌద్ధం యొక్క చిక్కపట్టు (సిద్ధాంతం)ని తెగనాడిన వాడు శంకరాచార్యుడు. శంకరుని వలననే వైదిక వ్యవస్థ బతికి బట్టకట్టింది. ఇప్పుడు శంకరుని బోధలకు కూడా గ్రహణం పట్టిస్తున్నారు (లేదా ఎప్పటినుండో). ఎంతో అభ్యుదయాన్ని ఆశించి రాసిన భాష్యాలు ఇప్పుడు "పారాయణం"కోసం మాత్రమే మిగిలాయి. కారణం ఆయా భాష్యాలు తల్లినుడులలో ఉండకపోవడం లేదా, మందిలోకి చేరకపోవడం.
ఈయన అచ్చమైన తెలుగువాడు అంటారు.
కానీ తెలుగు సాహిత్యం మీద ఈ విమర్శలున్నమాట నిజం. నన్నయకి ముందే ఎంతో తెలుగు సాహిత్యం ఉండిందనీ, అది బౌద్ధ సాహిత్యమని, దాన్ని తగులబెట్టడమో, లేదా కాలగర్భంలో కలిసిపోవడమో జరిగిందనీ అంటారు. నిజానిజాలు పెరుమాళ్ళకెరుక.
ఆ తరిలో ఒక తరం నుండి ఇంకో తరానికి ఎసిదులని అందించడం చాలా కష్టమైన పని. ఎందుకంటె తాటాకు పొత్తాలు (తాళపత్ర గ్రంథాలు) 200 ఏళ్ళకు మించి ఉండవు. అదీ చాలా అరుదుగా 200 ఏళ్లు బతుకుతాయి. (అని ఎక్కడో చదివాను. 200 ఏళ్ళ అన్నది చాలా చాలా ఎక్కువ). అందువల్ల ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉండాలి. అంత పాటుపడినా ఒక్కసారి అగ్గిలో పడితే అన్నేళ్ళ పాటు అంతా బుగ్గైపోతుంది. అందువల్ల వారికున్న ఒకే దారి "వల్లె వేయడం". వల్లె వేయడానికి పద్యాలో, శ్లోకాలో రాయాలి. అందువల్ల సంస్కృతం, ఛందస్సు, వ్యాకరణం తప్పలేకపోవచ్చు. ఆ విధంగా కూడా సంస్కృతపు అక్కర మనవారికొచ్చి ఉండొచ్చు.
సంస్కృతాన్ని నిలబెట్టింది మాత్రం తెలుగువారమే, ఎందుకంటే పొత్తం దగ్గర ఉండడం వేరు, దాన్ని చదవగలగడం వేరు. వక్కణ భారతం 800 ఏళ్ళు తురుష్కుల, మంగోలుల (మొగల్ అని చదువుతాం) ఏలుబడిలో ఉండి, వారి పలుకు మొత్తం చెడింది. అచ్చమైన సంస్కృతపు పలుకుబడి తెలుగువారి సొంతం. అయితే, అది వడిగా కోల్పోతున్నాం. బాలీవుడ్ సినిమాలు హిందీ పేరుతో ఉర్దూని నెత్తిమీద రుద్దడం, ఇప్పతికే ఉర్దూ పలుకుబడి ఉన్న మనుషులు దేశం ఎక్కువై, వారి ఆధిపత్యం ఎక్కువవడం లాంటివాటి వల్ల. మచ్చుక్కి ఒక విషయం, తెలుగువారం, స, శ, ష నడిమినున్న తేడాని ఇట్టే చెబుతాం, మూడిటినీ తగ్గట్లుగా పలుకుతాం. అదే హిందీ వారు స ని సరిగానే పలికినా, "శ"నీ, "ష"నీ ఒకే తీరుగా పలుకుతారు. ఇది ఉర్దూ ప్రభావం వలన వచ్చినదన్నమాట. ఉర్దూలో స, ష మాత్రమే ఉంటాయి. "శ" ఉండదు.
ఇలా కారణాలు విశ్లేషించుకుంటూ పోతే ఇంకా ఎన్నో సంగతులు ఎరుక పడతాయి.
నా రాతలకి మీ బ్లాగులో తావుని కల్పించినందుకు నెనర్లు.
పెక్కు నెనర్లు వామన గీత గారూ..
తొలగించండిమీరు పైన చెప్పిన కొన్ని సంగతులు కొన్ని నాకు తెలియదు, అవి తెలిపినందుకు. వల్లె వేయడానికి పద్యాలుగా వ్రాసారని చెప్పారు. బాగానే ఉంది.అయితే అది, పద్యాలుగా వ్రాయడానికి సంస్కృతమే అక్కర లేదు. ఎందుకంటే, తెలుగులో కూడా ఛందస్సు గట్రా ఉన్నాయి.దానికి సంస్కృతాన్నే అట్టిపెట్టుకోనక్కరలేదు. నిక్కము చెప్పవలేనన్న, 'కంద' పద్యం అనేది తెలుగునుంచే ప్రాకృతంలోకి ఆపై సంస్కృతంలోకి పోయిందనీ చెప్తారు. 'పందిని గొట్టిన వాడే వీరుడు, కందం వ్రాసిన వాడే కవి' అనే మాట మీకు తెలుసనే అనుకుంటున్నాను, కందం మరి అంత గట్టిది. చిన్న దానికీ, పెద్ద దానికీ సంస్కృతాన్ని చొప్పించారు అక్కర లేక పోయినా. మీరు అదే తరిన, తమిళంలో వ్రాయబడిన పోత్తాలను పరికించండి. వారు ఎక్కడ నుండి అరువు తెచ్చుకున్నారు? ఇంకో మాట, సంస్కృత పోత్తాలను తెనిగించారు బాగానే ఉంది. సొంతంగా ఎంత తక్కువ అంటే అంత తక్కువ వ్రాసారు. అది ఎందు చేత? జ్ఞానమంతా సంస్కృతంలోనే ఉండాలన్న కట్టడ ఏదీ లేదు కదా. తమిళం వారు కూడా సంస్కృత పోత్తాలను తమిళించుకున్నారు. కానీ అదే తరిన వారు, వారి నుడిలో కూడా సొంతంగా కొంత వ్రాసుకున్నారు. అది వారి నుడికి ఎంతో బలిమినిచ్చింది. కానీ మన వారికి మాత్రం సంస్కృతంలో ఉన్న ఎసుదులను తెనిగించడం తప్ప వేరే పని ఏదీ లేనట్లున్నది. ఎన్ని సొంత వ్రాతలు చూడగలం మనం తెలుగులో? సాహిత్యం అంటే రామాయణ భారతాలె గాకుండా, పల్లె పాటలు కూడా ఉంటాయి గదా. మంది పాటలు గానీ వారి బ్రతుకుదెరువు గానీ ఎక్కడా వ్రాయడం కనిపించదు. ఎంతసేపూ సంస్కృతమూ దేవతలు దాని గొడవే. కొందరు తెగువతో ప్రయత్నించారు, కాదనను. కానీ అది పాటి కాలేదు( not in the main stream). ఈ పోకడ సంస్కృతాన్ని ఎంతవరకు కాపాడిందో తెలియదు గానీ తెలుగుకి మాత్రం చాలా కీడు చేసింది. తెలుగు అంటే సంస్కృతాన్నుంచే పుట్టింది అనే దాకా తీసుకువచ్చింది.ఇంతకన్నా ఏం కావాలి ఒక నుడి తన ఉనికిని కోల్పోయిందని చెప్పడానికి. సరే, అప్పటి మాటను వదిలేద్దాం. ఇప్పుడు మాత్రం చూడండి. తెలుగులో ఏది వ్రాయమన్నా, సంస్కృత పేర్లే పెడతారు, తెలుగు అందుకు పనికి రాదన్న గట్టి నమ్మకంతో. మన తెలుగు మీడియం పుస్తకాలు అందుకు గొప్ప మచ్చు. అంతా వారి వెనుకనే నడుస్తారు, కిమ్మనకుండా. ఏమైనా అంటే, మీరు మాట్లాడే నుడి అనాగరికం అంటారు. అందరి మెదళ్ళలో అది బలంగా నాటినారు. మీరు ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా తెలుగువారిని, మందినీ ఈ పొలవరలనబడే వారు అస్సలు పట్టించుకోలేదనే చెప్పాలి (చాలా కొద్ది మంది గొప్పవారు తప్ప ). ఇక పలుకు( pronunciation) సంగతికి వస్తే, మీరన్నట్టు, 'శ', 'ష', 'స' నడుమ ఆ తేడాలు చూపుతూ పలికేది ఏ కొద్ది మంది పొలవర్లో , చదువుకున్న వారే గానీ, మంది కాదని గమనించాలి. ఊరికి పోయి, పొలంలో పని చేసే రైతుని, 'ఘోష' అని అనమనండి. ఆయన 'గోస' అంటాడు. అది మరి మంది పలుకు. మీరు తమిళ అక్షరాలను చూడండి. అవి మాత్రమె ద్రావిడులలో (ద్రావిడ నుడులలో) ఉన్న పలుకులు. మిగతావన్నీ సంస్కృతాన్ని తెలుగు చేయాలనుకున్న పొలవరలు తెచ్చిపెట్టినవే. ఎంతసేపూ, ఎక్కడో ఉన్న జ్ఞానాన్ని ఇక్కడి వారికి అందిస్తున్నాం అని చెప్పుకొనే కన్నా, ఆ పొలవరలు, ఇక్కడి వారి కొరకు ఇక్కడి వారి నుడిలోనే కొంత సొంతంగా వ్రాద్దాం, ఈ నుడిని కూడా కాపాడుదాం అన్న తలంపు వెంట్రుక మాత్రమైనా లేకపోవడం వల్లనే తెలుగుకి ఈ గతి దాపురించింది. ఒకప్పుడు తగలబడి పోతున్న సంస్కృత జ్ఞానాన్ని, కాపాడాలని గొప్ప చొరవతో ఎడా పెడా ఆ జ్ఞానాన్ని తెనుగు చేసిన వారు మరి ఇప్పుడు పాడెకట్టు తరికి చేరిన తెలుగును పట్టించుకోకుండా ఇంకా సంస్కృత నుడికి కాపలా కాస్తున్నారెందుకో?... వారినే అడగాలి..
శంకరాచార్యుల వల్లనే వైదిక వ్యవస్థ బతికి బట్ట కట్టిందని చెప్పారు. నిజమే.. కానీ ఆయన తప్పు పని చేసాడు, అని నా అనుకోలు. అడ్డంగా, నిలువుగా పెక్కు ముక్కలుగా చీలిపోయిన వైదిక వ్యవస్థ కన్నా, అందరినీ సమానంగా చూసే, బుద్ధమే నయం, అది మహాయానమైనా, మరి ఇంకో యానమైనా.. మీరు అనవచ్చు, శంకరుడు ఈ కుల వ్యవస్థను నిరసించాడు అని. కానీ అవి ఎక్కడ నెరవేరాయి? ఈ నాటికీ, కొందరు అట్టడుగు కుదురుల వారిని గుళ్లలోకి రానివ్వని కట్టుబాట్లు కలిగి ఉన్న 'మన గొప్ప వైదిక వ్యవస్థ' మందికి చేసిన మేలు ఏమిటి? కొద్ది మంది కొరకు ఎల్లవేళలా నిలిచి, వారి స్వార్థానికి పని చేయడం తప్ప. ఎవడేమయిపోయినా ఫర్వాలేదు కానీ వారికి మాత్రం చిన్నమెత్తు అపాయం రాకూడదు... చర్చ పక్క దారి పడుతున్నది కానీ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను...
ఓపికగా, తిరుగు(బదులు) చెప్తున్నందుకు నెనర్లు..
విజయ్ గారు..!
తొలగించండిగతవారం "నుడి"లోని మీ వ్యాసాన్ని చూసాను. తెలుగుకీ, మరాఠీకి అన్ని దగ్గరి మాటలుండడం కాస్త అచ్చెరువొందించినా, ఇరుగుపొరుగు నుడులలో ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకోవడాలు మాములేనని అనిపించింది.
అదలా ఉంచితే, తెలుగుకీ ఛందస్సులూ అవీ ఉన్నాయి. కాదని నేనడం లేదు. అవి రాయడానికి "తగిన" పదసంపద కూడా కావాలి. లేకపోతే పుట్టించుకోవాలి. "బ్రహ్మ"అని రాయడం "నొసళ్ళను వ్రాయు దేవర"కంటే సులువు, పద్యాలలో ఇరికించండం ఇంకా సులువు. ఇక "తగిన"అని ఎందుకు అన్నానంటే, ప్రతీ కాలంలోనూ కొన్ని మాటలు "బూతు మాటలు"గా ముద్ర వేయబడి పొత్తాలలోకి ఎక్కే అర్హతని కోల్పోతూ వస్తున్నాయి. ఆ పరిస్థితి ఇప్పుడూ ఉంది. అచ్చతెనుగు మాటలమూటలని పుట్టించుకోవడం వారికి తెలిసునో, తెలియదో. ఇప్పుడు మనకి మాత్రం తెలీదు. అది వేరే విషయం.
మనవాళ్లు "సంస్కృత"పొత్తాలనే నుడిగించారు తప్ప తిన్నగా తెలుగులో ఏదీ రాయలేదు అంటున్నారు. ఇప్పుడూ జరుగుతున్నదదే. భాష మారిందంతే. ఇప్పటి నుడిగింపులు, చివరికి ఏలినవారి అచ్చుపొత్తాలు కూడా దేనికో నుడిగింపే. పొలవర్ల నుడి, ఏలికనుడి నుండి జనాలనుడికి నుడిగింపులు అవుతాయి, ఎప్పుడైనా. అది మారాలంటే, తెలుగు పొలవర్ల నుడి కావాలి. అప్పుడు ఒకప్పుడు సంస్కృతం పొందిన స్థానాన్ని, ఇప్పుడు ఇంగ్లీషు పొందుతున్న స్థానాన్ని తెలుగుకి తీసుకునిరావచ్చు.
మీరు తమిళాన్ని మచ్చుక్కి చూపిస్తున్నారు. ఆ భాష గొప్పదే కావచ్చు. కానీ సాహిత్యంలో తెలుగుకి అది సాటి రాదు. సంస్కృతం తప్ప భారతీయ భాషలలోని ఏ భాషకీ తెలుగుకున్నంత పెద్దమొత్తంలో సాహిత్యం లేనే లేదు. మీరు ఏ కర్ణాటక సంగీత విద్వాంసుణ్ణైనా అడగండి. సంగీతానికి అత్యంత అనుకూలమైన భాష ఏదని.? వారి సమాధానం సంస్కృతం, తెలుగు. కొద్దిమంది తమిళానికి ఆ స్థాయిని తీసుకుని రావడానికి ప్రయత్నించినా విఫలమైపోయారు. ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి తెలుగువారు కాదంటారు కొంతమంది. కానీ వారు చేసిన కృతులలో అధికమొత్తం తెలుగువే, తమిళంలోని చాలాచాల తక్కువ. కర్ణాటక సంగీతం శుద్ధ వైదిక సంగీతం, సంస్కృతానికి మాత్రమే పరిమితం కావాల్సింది. కానీ, తెలుగుకి మాత్రమే పరిమితమైంది అనేంతగా సాహిత్యరచన జరిగింది. అలాగే, కర్ణాటక సంగీతానికున్న కొంటెపేరు(నిక్ నేమ్) "తెలుగు సంగీతం". మరి ఇది ఎందువల్లనొచ్చింది.? సంస్కృతంతో స్నేహం వల్లనే. తెలుగుకి ఈ గతి పట్టింది అన్నారు కదా. ఆ "గతి" అంత దుస్థితి కాదని గ్రహిస్తారని రాశాను.
ఇంక తమిళంలో ఉన్న అక్షరాలే ద్రవిడుల పలుకులని అంటున్నారు. వారికి కూడా శ, ష, స లు ఉన్నాయి. మనం చెన్నై అని పలికేది వారు శెన్నై అని పలుకుతారు. ఎందుకంటే చ, శ లకి వారికి ఒకే అక్షరం ఉంది. అది వేరే విషయం.
మీరు బౌద్ధం గురించి అడిగారు, కనుకనే నాకు తోచింది రాసింది శంకరాచార్యుని ప్రస్తావన చేసాను. అంతే తప్ప, ఆ విషయాల గురించినా నా ఙ్ఞానం మెలకెత్తే దశలోనే ఉన్నది.
నెనర్లు
చాన్నాళ్ళ తర్వాత కలిశారు. 'నుడి ' లో మీ వ్యాసం చాలా బాగుంది. కొత్తగా తలపోశారు. మీకు నా మెచ్చుకోళ్ళు (అభినందనలు).
తొలగించండి'బ్రహ్మ ' అని వ్రాయడం తేలికే. కాదనను. కాని అది అలాంటి పేర్లతో ఆగి పోయి ఉంటే బాగానే ఉండేది. కానీ అది 'ఇంతింతై వటుడింతై ' లాగా తెలుగును దాదాపుగా మింగివేసే ఎత్తుకి ఎదిగింది. అది నా దిగులు. అంతే కానీ వేరే నుడి మాటలు కొన్ని కూడా ఉండకూడదని కాదు. నిక్కముగా చెప్పవలెనన్న, మీరు చెప్పిన చిక్కు లేదా ఇబ్బంది ఏ అనువాదకుడికైనా ఎదురయ్యేదే. ఏ రెండు నుడులు కూడా ఒకదానితో ఒకటి నిండుగా పొసగవు. ఇంకా అవి రెండు వేర్వేరు నుడి కుటుంబాలకు చెందినవైతేనో, దూరపు నుడులయితేనో మరిన్ని కడగండ్లను అనువాదకుదు ఎదుర్కోవలసి వస్తుంది. మచ్చుకి, మనందరికీ తెలిసిన 'బూస్ట్ తాగం తింటాం' అనే బేరపు చాటింపు (వ్యాపార ప్రకటన)ను బెంగాలీ నుడిలోకి అనువదించవలెనన్న, ఎట్టి రీతిగానూ కుదరదు. ఎందుకంటే ఆ నుడిలో తాగడం అనేది ఉండదు. అన్నీ తినడమే. అంటే, వాళ్ళు 'నీళ్ళు తింటారా(తాగుతారా)?' అని అడుగుతారు. ఇలాంటి ఇబ్బందులెన్నో అనువాదకులు ఎదుర్కోవాలి. అది అనువాదకుడి పాటవాన్ని బట్టి కూడా ఉంటుంది. 'త్రినేత్ర ' అన్న చిన్న మాట యొక్క గొప్ప తెల్లాన్ని తిక్కన 'ముక్కంటి ' అన్న మాటలో కట్టిపడేసాడు. మూడు కళ్ళ వారు ఎవరు ఉంటారు? దానికి సరి అయిన మాట తెలుగులో లేదు. ఈయన దాన్ని ఎలిపించాడు(సృష్టించాడు). అంతే కానీ చాలా మంది సంస్కృత-తెలుగు పొలవర్లలాగా అవతల ఉన్న దాన్ని ఇవతలకు ఉన్నదున్నట్టు దింపివేయలేదు. అలా అని ఆ కవులకు పాటవం లేదని కాదు. అలా చేయాలనే తలపు లేక పోవడం వల్లనో ఇంకా కావాలని చేయడం వల్లనో కూడా అయి ఉండవచ్చు.
ఇన్నాళ్ళూ కొద్ది మంది మాత్రమే చదవడం వ్రాయడం చేస్తూ, సాహిత్యం అనేది కొద్దిమంది వారసత్వ ఆస్తిగా లెక్కింపబడుతూ వచ్చింది. అందరూ చదువుకునే వీలు చిక్కింది ఇప్పుడు. కాబట్టి ఇకనైనా మంది నుడికి ఉగ్గెన వస్తుందనీ, రావాలనీ అనుకుంటున్నాను.
తెలుగుకి ఉన్నంత సాహిత్యం, సంస్కృతానికి తప్ప మరి దేనికీ లేదు అని అంటున్నారు. అంత పెద్ద మాట అనగలమో లేదో తెలియదు కానీ, ఉన్న సాహిత్యం అంతా ఎక్కనుంచో అప్పు తెచ్చుకున్నదై, ఎంతసేపూ ఇక్కడి నుడిని బూతుగా లెక్కించే సాహిత్యం నాకంత పెద్ద సంబరపడే సంగతిగా తోచడం లేదు. అలాగని మంది నుడికి పట్టం కట్టిన వారు లేరని కాదు.
సంస్కృత చెలిమి వల్లనే తెలుగు కర్ణాట సంగీతంలో వెలిగిందని అంటున్నారు. ఆ లెక్కకొస్తే అది మలయాళం అయిఉండాలి. మన కన్నా వారు సంస్కృతంతో ఎక్కువగా చెలిమి చేసారు. సంస్కృత చెలిమి ఒక హేతువయి ఉండవచ్చు. కానీ తలహేతువు(ముఖ్య కారణం) కానేరదు. తెలుగు సంగీతానికి అనువయిన నుడి ఎందుకయిందంటే, అది అజంత నుడి అవడం వలన. అంటే అన్ని పదాలు, పలకడానికి తేలికగా ఉండి, అచ్చులతో ముగియడం వలన. పాడడానికి అలా చాలా తేలికగా ఉండడం వలన. అంతే కానీ, సంస్కృత చెలిమి వల్లనే వచ్చిందంటే ఒప్పుకోలేని మాట.
తమిళంలో శ, ష లు ఉన్నా అవి ద్రావిడ పలుకులు కావని నా అనుకోలు. మహా ప్రాణాలు(ఖ, ఘ మొ||) అనేవి సంస్కృత పదాలను తెలుగులో వ్రాయడానికి మాత్రమే తెలుగులో చొప్పించారు. అచ్చ తెలుగు మాటలేవీ మహాప్రాణాలతో ఉండవు.
దీన్నంతటినీ బట్టి చూస్తే సంస్కృతము లేకపొతే తెలుగు ఉనికే ఉండేది కాదనో, తెలుగుకి ఈ మాత్రం ఉగ్గెన ఉన్నదంటే అది సన్స్కృతం వల్లనే అనో అనేలా అనిపిస్తున్నది. సంస్కృత దెబ్బ అంతా బలంగా తగిలింది మరి మనకు. ఇంతకన్నా ఏం కావాలి ఒక నుడి మరొక నుదికి నిండుబానిసగా చేయబడిందనడానికి.
ఏది ఏమైనా చక్కగా, ఓపికగా తిరుగు వ్రాస్తున్నారు. అందుకు మీకు నెనర్లు.
నుడిగింపుల్లోని ఇబ్బందులను చక్కగా రాశారు.
తొలగించండిఅచ్చమైన తెలుగులో రాయాలనే తలంపు మనకున్నప్పటికీ, ఎందుకు రాయలేకపోతున్నాం..? తెలుగు పోయింది, వేరే మాటలు వచ్చేసాయి అనేవి పక్కన బెట్టి వేర్లదాక పోయి తలపోస్తే, ఇప్పటికిప్పుడు కొత్త తెలుగు మాటలు పుట్టించే తీరు మనకి నిర్దిష్టంగా లేదని తెల్లమౌతుంది. అదే ఉండుంటే, కనీసం కొంతంమందైనా, ఆ బాటలో పయనించి ఉండేవారు. (అంటే, అసలు లేరని కారు, చెప్పుకోదగినంతమంది లేరు). మనకున్న ఇబ్బందీ అదే. వారికున్న ఇబ్బందీ, అది కాకూడదని ఏముంది.?
అదలా ఉంచండి, తెలుగుకున్నంత సాహిత్యం మరే జీవభాషకీ లేదనడం వాస్తవ విరుద్ధం కాదు. తెలుగుకున్న నోటి కతలు మొదలుకొని, వేదాల నుడిగింపు వరకూ తమిళ, బెంగాలీ, కన్నడం వంటి పేరొందిన, మతాలు పనిగట్టుకు మోసిన నుడులలో లేనే లేవు. మీకు తెలుసో లేదో నాలుగు వేదాల, అనువాదం జరిగింది, ఒక్క తెలుగులోనే (ప్రాంతీయ భాషలలో లెండి). దాశరధి రంగాచార్యుల రచన అనుకుంటా.
కర్ణాటక శాస్త్రీయ సంగీతం చెబుతూ తెలుగు భాష యొక్క అజంత గుణాన్ని మర్చిపోయాను. నా ఉద్దేశ్యం, తెలుగు అజంతభాష కాదు. సంస్కృతంతో చెలిమి దాన్ని అజంత భాషని చేసింది, అని అంటారు. మనదేశంలో ఉన్న అజంత భాషలు తెలుగు, సంస్కృతం అంతే..! తక్కిన తెన్నుడులలో మరే అజంతభాష లేకపోవడం వల్ల కొంతంమంది, పైన చెప్పినట్టు అనుకుంటూ ఉంటారు. నిజం, నిలకడ మీద తెలుస్తుంది. ఏదేమైనా, కర్ణాటక (చెవులకి ఇంపుగా ఉండే) శాస్త్రీయ సంగీతంలో తెలుగు స్థానం తిరుగులేనిది. అక్కడివరకూ, ఏ గొడవా లేదు కదా.
తెలుగులోకి మహాప్రాణాక్షరాలు సంస్కృతం కోసమే వచ్చాయంటారు. ఒప్పుకుంటున్నాను. కానీ "ష", "స", "శ"లు తెలుగులోకి సంస్కృతం నుండి కాక, మామూలుగానే ఉన్నాయని నా అనుకోలు.
అయిందేదో అయిపోయింది. ఇప్పటికీ తెలుగుకున్న మాటలసొమ్ము తక్కువేమీ కాదు. ఏరుకుని, ఒక్కొక్క ఇటుకే పేర్చుకుంటూ వస్తే, తెలుగు కూడా కూడుపెట్టే నుడుల స్థాయికి చేర్చవచ్చు.
ఇంక "ఓపికగా తిరుగు ఇవ్వడం"సంగతి. నాలాంటి వెఱ్ఱివాళ్లకోసం (తప్పుగా అనుకోకండి) చాలాకాలం నుండీ చూస్తూ ఉన్నాను. అలా అయినా, నాలుగు తెలుగు మాటలు తెలుస్తాయని ఈ పాటు.
నెనర్లు.
తెలుగులో కొత్త మాటలు పుట్టించడానికి ఒక తేటయైన రీతి లేదనడంకన్నా ఆ గొప్ప అనువాదకులకు(తొల్లి రచయితలు కాదు కదా అందుకే) సంస్కృతాన్ని అనువదించడంలో ఉన్న ఇబ్బందులే ఎక్కువ అని నా అనుకోలు. అవి ఎక్కువగా అనువాద ఇబ్బందులే గానీ నుడి లోపము కాదు. అదే నిజమయితే, తెలుగు ఇన్ని వేల యేండ్లు బ్రతికి బట్టకట్టేది కాదు. పల్లె మాటలు చూడండి. ఈ నడుమ తక్కువయిపోయింది గానీ పల్లె మంది అంతా కొత్త మాటల ఎలుపుకాండ్రే(సృష్టికర్తలే). కాకపోతే మన పొలవరలకే అది నచ్చలేదు. అది ంలేచ్ఛుల నుడియేగానీ ప్రామాణికము ఎలా అవుతుంది? అయితే అందరు పండితులు అలాగే లేకుండెను. తిక్కన మనకొక దారి చూపినాడు. అన్నమయ్య కూడా కొంత వరకు ఈ చిక్కును విప్పినాడు.ఇంకా అలాంటివారు ఉండినారు. వారి పనులు చక్కగా చూచినట్టయితే మనకొక బాట దొరకకపోదు.
తొలగించండితెలుగుకి అజంత గుణము సంస్కృత చెలిమి వల్లనే వచ్చిందని మీరు చెప్తున్న సంగతిని ఇంకా లోతుగా దిగి చూడవలసిఉంది. నాకెందుకో అలా అనిపించడం లేదు. గొప్పాయన తిరుమల రామచంద్ర గారు 'గాథాసప్తశతి ' మీద ఆరయిక చేసి అప్పటి ప్రాకృతము మీద తెలుగు దెబ్బ(ప్రభావం) ఎలాంటిదో తెలిపారు. చాలా తెలుగు మాటలు అందులోనించి ఏరినారు. క్రీ.త. ఆరవ నూరేడులో వచ్చిన రేనాటి చోళుల నిండు తెలుగు చెక్కింపు లోని తెలుగుని కూడా ఇందుకు మచ్చుగా తీసుకొని చూడవచ్చు. ఇంకా, తెలుగు మీద సంస్కృత దెబ్బ ఎంతదైనా అది కావ్యాల్లోనూ, పండితులుగా, నాగరికులుగా తమను తాము పిలుచుకొనేవారి నుడిమీద ఎక్కువగా ఉంటుందిగానీ పల్లె మంది మీద చాలా తక్కువగ ఉంటుంది. వారి మాటలను బట్టి కూడా మనం దీన్ని చూడవచ్చు. సంస్కృత చెలిమి వల్లనే అయితే సంస్కృతము నుండి పుట్టిన, సంస్కృతముతో మనకన్న ఎక్కువ చెలిమి చేసిన నుడులు కూడా అజంత పొడ కట్టాలి కదా. మరి అలా ఎందుకు జరగలేదు?. నా అనుకోలు తెలుగు మొదటినుండి అజంతమేనని. మనకన్నా సంస్కృతీకరించబడిన నుడులు మరాఠీ మరియు మలయాళము ఉన్నాయి. మరి అవి ఎందుకు అజంతాలు కాలేదు? ఇందులో ఒకటి ద్రావిడమూ మరి ఒకటి సంస్కృత చుట్టమూ. మరాఠీ ఎంత సంస్కృతీకరించబడిన్నదానికి ఒక్క మచ్చు చూపుతాను.
మరాఠీ
/సంస్కృతము : తెలుగు
మధ్యే లోపల
అనంతర పిమ్మట, తరువాత
పర్యంత దాకా, వరకు
పంచశత అయిదునూర్లు
ఇవన్నీ ఏ కావ్యాల్లోని మాటలో కావు. మంది వాడుకలో ఎప్పుడూ దొర్లేవి. ఇలాంటి మాటలు ఎన్నో వింటుంటాను. ఇలా ఎప్పుడూ వాడుకలోని మటలకే అంతలా సంస్కృత మాటలు కొంచెమైనా మార్పు లేకుండా వాడుతున్నరంటే, ఇక తక్కిన పెద్ద మాటలగురించి మీరు తలచుకోవచ్చు.తెలుగుతో పోలిస్తే ఇది చాలా రెట్లు సంస్కృతీకరించబడిన నుడి. ఇది ఎందుకు అజంతమవలేదు? పనిగట్టుకొని తెలుగును మాత్రమే అచ్చు తనలాగా అజంతముగా మార్చే ఈవిని(వరాన్ని) సంస్కృతము ఎందుకు ఇచ్చినట్లు? మీరు ఎందుకో సంస్కృతానికి అక్కరలేని పెద్ద పీట వేసి తెలుగును తక్కువ చేస్తున్నారనిపిస్తున్నది. ఆ లెక్కన తెలుగుకు తనదంటూ ఏ గొప్పదనమూ లేదు ఏదైనా ఉంటే అది అంతా సంస్కృతానికి ఊడిగము వలన వచ్చిందే అని అంటున్నట్టుగా ఉంది. ఇది నేను ఒప్పలేను. మన ఒప్పుకోళ్ళూ, అనుకోళ్ళూ ఎలా ఉన్నా ఈ సంగతుల మీద మరింత ఆరయిక చేయవలసినది.
పరీక్షలయిపోగానే మన తలపట్టణము(సొమ్ముపట్టణము)లో వాలబోతున్నాను. ఇక అక్కడికి పోయిందే మొదలు. తిరుమల రామచంద్ర గారివి అన్ని పొత్తాలు పొత్రంలో వేసి రుబ్బుతాను. ఎప్పటినుండో, వేదాలు చదవాలనుకుంటున్నాను. అదీ ఆంగ్లములో చదవడం ఇప్పటికే మొదలిడినాను. తెలుగులో ఇంకా తేలికగా అవుతుందిగదా. ఆ తెలుగు అనువాదాలు కూడా చదువుతాను. ఆ మాట గుర్తు చేసినందుకు నెనర్లు. ఆ రంగాచార్య గారు మా పెవ్వంటెకము వాడే అని చెప్పడానికి పొంగిపోతున్నాను. ఇందులో నా గొప్పదనమేమీ లేదనుకోండి.అయినా సరే.. వేదాలు గొప్పవి అంటూ మందిని ఊదరగొట్టి, అవి నేర్చుకోవడం కొద్ది మందికి మాత్రమే చెల్లును అనీ ఇన్నాళ్ళూ పెత్తనం చేసిన వారికి ఇది ఒక మింగుడు పడని సంగతయి ఉండవచ్చు. ఇప్పుడు కొంత చదవడం వచ్చిన వారు కూడా వేదాల గురించి తెలుసుకోవచ్చు. వాటికి నిక్కముగా అంత పవిత్రత ఉందా అనేది చూడవచ్చు.
ఇక, 'వేపకాయంత వెర్రి ' అంటారు కదా. అది ఉండడము మంచిదే అనుకుంటున్నాను. తెలుగును గొప్ప ఎత్తులకు తీసుకొనిపొయే బరువు మనందరి గూడ(భుజం)ల మీదా ఉంది. మనవంతు పాటు మన చేద్దాం.
ఉంటాను.
మరొక్కసారి మీకు నెనర్లు.
పొ.విజయ్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపొ విజయ్ గారు మీ తాపత్రయం బాగానే ఉంది. కాని మీ దృక్పథంలో కొన్ని లోపాలు ఉన్నాయి అని నా భావన. మీకు తెలుగు మీద ఉన్న అభిమానం కన్నా ఆర్యుల మీద, బ్రాహ్మల మీద కొపం, ద్వేషం ఎక్కువ ఉన్నట్లు అనిపించింది. మరి అది నిజమో కాదో తెలీదు కాని, అది నా భావన మాత్రమే.
రిప్లయితొలగించండిమనం తమిళం ఏదో చించేసింది ఊడబొడిచేసింది అని తెలుగుని తక్కువగ చూడటం తప్పు. 300 ఏళ్ళమునుపు వరుకూ ఇంకా అచ్చ తెలుగు బ్రతికే ఉంది కాని అప్పటి మన చారిత్రక నేపథ్యం వేరు. కాకతీయ పతనం తర్వాత తెలుగువాడికి కుర్చుని ఆలోచించే తీరిక ఏది. కమ్మలు, కాపులు, బలిజలు, వెలమలు ఎంతో రక్తం ధారపోసి కృష్ణా దిగువ ప్రాంతాన్ని తురకపాలనలోకి వెళ్ళకుండా చుసారు. మరి తమిళులు మనకి దక్షిణ భాగంలో ఉండటం చేత వాళ్ళకి మనకి ఉన్నంత అతలాకుతల స్థితి లేదు.అందువల్ల వాళ్ళ భాష అలాగే నిలిచింది. అచ్చుయంత్రం రానంతవరుకు దక్షిణదేశంలో తెలుగుదే హవా. ఎందుకంటే తెలుగులో వ్రాసినా, పాడినా అది గోల్కొండ, తంజావూరు, సెంజి, మదుర, పుదుక్కోట, మైసూరు, పుదుచ్చేరి, చెన్నపట్టణం వీటిలో ఎక్కడైనా ప్రాచుర్యం పొందే అవకాశం ఉండేది.మా కుటుంబం ఉండేది పుదుచ్చేరిలో...నాకు తమిళం మీద అమితమైన ప్రేమ ఉంది...నేను అందులో చక్కగా చదవగలను, వ్రాయగలను కూడా...అభిమానం కొద్దీ సొంతంగా అభ్యసించిన సంస్కృతము, పొట్టకూటి కోసం నేర్చుకున్న ఫ్రెంచి భాషతో కలిపి 7 భాషలు దాక నాకు వచ్చును. అరబ్బి నేర్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను.
సంస్కృతాన్ని ఒక భాషగా చూడంది. అప్పుడు అందులోని గొప్పదనం, శాస్త్రీయత బోధ పడతాయి...అది దేవభాష అని నేను ముమ్మాటికి నమ్మను కాని మొన్నటి వలసపాలన కాలం వరుకు ప్రపంచంలోనే మరే భాషకి అంతటి విస్తారమైన వ్యాకరణం లేదు...అసలు ఒక భాషాని ఇంత విస్తారముగా, వివిధ కోణాల్లొంచి అధ్యయనం చేయచ్చు అని అప్పటిదాక తెల్లవాడిబుర్రకే తట్టలేదు.అందుకే దీని గొప్పదనాన్ని కేవలం వారికి అన్యులైన ఒక హీనజాతివారైన భారతీయులకు అంటగట్టడం ఇష్టంలేక మరియు సంస్కృతం నుండి ఐరోపాభాషలు వచ్చి ఉంటాయేమొ అన్నవాదానికి బలం చేకూర్చడం ఇష్టంలేక ఆర్యజాతివాదాన్ని మనముందు పెట్టారు. ద్రవిడులతో కలిసిన ఇక్కడి ఆర్యులు తుచ్చులని, ఐరోపలోనివారు మేలిమిజాతీఅర్యసంతతి అని, అందుచేత సంస్కృతపు గొప్పదనం భారతదేశానిది కాక ఆర్యులదని తద్వార ఇప్పటి మేలిమిజాతీఅర్యులైన ఐరోపాతెల్లవాళ్ళదని నిరుపించడానికి విశ్వప్రయత్నమే చేసారు.
వల్లేవేత ద్వార తర్వాతి తరానికి అందించే ప్రక్రియలో శాస్త్రీయత దాగుంది. మీకు చానెల్ కోడింగు గురించి తెలుస్తే ఈ విషయం సుళువుగా అర్ధమవుతుంది. బ్రాహ్మడిలోని అహంకారాన్ని వ్యతిరేకించంది కాని ద్వేషం ఎప్పుడు వినాశహేతువు. వైదికమతాన్నిచీల్చిచెండాడిన బుద్ధుడే 'ధర్మపదం'లో చివరి అధ్యాయంలో నిజమైన బ్రాహ్మణుడంటే ఎవరు అని చెప్పి, అటువంటి వారి ఆవశ్యకతను ప్రస్తావించాడు.
నావంతుగా శబ్దకోశ్ అనే వెబుసైటులో వీలుచిక్కినప్పుడల్లా కొత్త తెనుగుపదాలు పొందుపరుస్తూనే ఉంటాను. తెలుగుభాష బాగుపడాలి అంతే మనము అన్ని తెనుగు యాసలను, సంస్కృతులను గౌరవించడం నేర్చుకొవాలి. తమిళనాటి తెలుగువారు మనముందు మాట్లాడటానికి సిగ్గుపడె అద్భుతమైన స్థితికల్పించామంటే కుల,ప్రాంత,యాస అధిపత్యజాడ్యం ఎంతలాగ మనల్ని పట్టిపీడిస్తోందో గ్రహించచ్చు. మొన్నటి వరుకు తెలంగాణ తెలుగుని అవహేలన చేశాము. కొత్త తెలంగాణా రాష్ట్రం వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే కనీసం ఇప్పుడైనా కృష్ణానదికి ఎగువనున్న నా సాటి తెలుగువాడు వాడి యాసని సంస్కృతిని కాపాడుకొనే అవకాశం చిక్కనున్నది కాబట్టి.
అచ్చతెలుగు మనజనాల్లో వెలుగొందేలాగ పాటుపడదాము. మీరు, వామనగీత గారు సంవాదించుకుంటున్నప్పుడు ఎంతో ముచ్చట వేసింది. మీలాంటివాళ్ళు మరింత వెలుగులోకి రావాలి. ఇంకొకటి నేను గ్రహించిన విషయం ఏంటంటే పదనిర్మాణానికి తమిళాన్ని అనుకరిస్తున్నారేమొ అన్నభావన కలిగింది. తెలుగు తమిళానికి యేమాత్రం తీసిపోదు అని గ్రహించి అనుకరించకుండా సొంతసొగసుని పెంపొందింపచేయమని నా మనవి. మీకు ఇబ్బంది లేకపోతే మీ ఈమెయిలు-ఐడి తీసుకోవచ్చునా?
- కృష్ణచైతన్య
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిదండాలు కృష్ణ చైతన్య గారికి.
రిప్లయితొలగించండిఎప్పుడో ఈ బ్లాగులో వ్రాసినాను. ఎక్కువైన పని వలన ఈ మధ్య ఇటువైపు చూడడము మానివెసినాను. ఇన్నాళ్టికి మీ వల్ల చూస్తున్నాను.
మీ వ్యాఖ్యకు మప్పిదాలు. ఎందుకో సంస్కృత ప్రభావాన్ని తెలుగు మీద 'అతిగా' రుద్దిన వారినీ రుద్దడాన్ని తెగనాడే క్రమంలో నేను సంస్కృతాన్నీ బ్రాహ్మలను ద్వేషిస్తున్నట్టున్నానని చాల మందికి అనిపించినది. ఇంకా మెత్తగా విషయాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియలెదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. వ్యక్తులుగా ఒక కులం వారినో ప్రాంతము వారినో, భాష వారినో నేను అయిష్టపడను('ద్వేషము' అనేది చాలా పెద్ద మాటగా అనిపిస్తున్నది). నేను తెగడునది వ్యవస్థను మాత్రమే. ఎవరో అన్నట్టుగా 'లోకంలో రెండే కులాలు. ఒకటి మంచి రెండవది చెడు'. దీన్ని మాత్రమె నమ్ముతాను. ఒక వస్తువును ఇష్టపడడానికీ, దాని మీద ఇష్టమును చూపుటకు వేరే దానిని ద్వేషించడానికి నడుమన ఉన్న సన్నని, పలుచని తేడాను నేను ఎరుగుదును. అయినప్పటికీ, ఇకపై నేను వ్రాసేదాంట్లో అలాంటి భావన రాకుండా చూసుకుంటాను. చివరికి అది ఎవరికి ఎలా అనిపిస్తున్నదీ వారిపైనే ఆధారపది ఉంటుందని మరువరాదు.
నేను తమిళ మచ్చుని తీసుకొనేది ఒక ఆదర్శముగా చూపెట్టడానికి మాత్రమే. అంతే కాని తెలుగు తక్కువని కాదు. ముమ్మాటికీ కాదు. మీ వంటి పెక్కు భాషలు నేర్చుకున్న వారి అక్కర మన తెలుగు నుడికి ఎంతో ఉన్నదని నా అనుకోలు.
సంస్కృతాన్ని నేను కూడా చిన్నప్పుడు కొంత చదువుకున్నాను. వీలయితే ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. సంస్కృతము గొప్ప భాష అయి ఉండవచ్చు. అంత మాత్రము చేత దాన్ని తెలుగు మీద రుద్దడాన్ని నన్ను ఒప్పుకోమంటారా? విస్తారమైన నుడికట్టు ఉన్నది. చాలా పుస్తకాలు వ్రాసారు. బాగున్నది. దాని నుండి ఉసి(ప్రేరణ) పొందుతాను. కానీ గొప్ప భాష కాబట్టి నెత్తి మీద మాత్రము కూర్చోబెట్టుకోవలసిన అక్కర లెదు. గొప్ప భాష కాబట్టి మన నుడిని మనము తక్కువ చెసుకొకూడదు. ఎంత సంస్కృతమైనా ఎంతో మంది నడుము బిగించి అందులో వ్రాసి నుడికట్టునూ, మాటలను ఎప్పటికప్పుడు మెరిగించనిదే అది గొప్పది తనంతగా కాలేదు కదా. ఆ విషయములో ప్రేరణ పొంది మన నుడిని మనము మెరిగించుకొన్దాము.
నేను ఎదిరించేది అహంకారాన్ని మట్టుకే. నాకు ఎవరి మీదా ద్వేషము లేదు. మీరు ధమ్మపదం చదివానని అంటున్నారు. చాల సంతోషము. నేను కూడా ఎప్పటినుండో చదవాలనుకుంటున్నాను. గుర్తు చేసినందుకు మప్పిదాలు.
మీరు పేర్కొనిన వెబ్ సైటును చూస్తాను. మప్పిదాలు. ఈ యాసలను, పల్లె మాటలను పట్టించుకోకుండా, ఈసడించినందుకే మన నుడికి ఈ చెడ్డ గతి పట్టినదని నా అనుకోలు కూడా(పెక్కు కారణాల్లో ఒకటి ). ఒకప్పుడు నేను కూడా నా యాస మట్టుకే గొప్పదని అనుకునేవాడిని. తర్వాత తప్పు తెలుసుకున్నాను. తెలంగాణా తెలుగును మొన్నటి వరకూ తెలుగే కాదు అన్నారు. వేరే రాష్ట్రాల్లో ఉంటున్న వారి యాసను గురించి చెప్పనక్కరలేదు. ఎంతో విశాలమైన తెలుగును ఒక్క యాసలో కుదించాలానుకున్నరు. ఆ పూనిక బెడిసి కొట్టింది. యాసలను వైవిధ్యముగా, అందముగా చూస్తే నుడి బాగుపడుతుంది. అలాకాక మనవాళ్ళు యాసలను పరిపూర్ణత నుండి చెదిరిన పక్క దారులుగా తలపోశారు. ఇవన్నీ భాష మీద పెత్తనము సాగించిన వారి వంకర చూపులు. మాటల కట్టుబడిలో తమిళానికి మనకూ ఎంత లేదన్నా కొంత పోలిక ఉండకుండా ఉండదు. ఒక్క తల్లి పిల్లలము కదా. మన దగ్గర ఉన్న పల్లె మాటలు ఒకప్పటివీ ఇప్పటివీ అన్నింటినీ ఒక చోట కూర్చితేనే గానీ మన నుడి కట్టు వైవిధ్యం మనకు సరిగా ఎరుకపడదు. మాటల కట్టుబడికి అప్పుడు మనదైన రీతి వెంబడి పోవచ్చును. దురదృష్టవశాత్తూ మన పల్లె మాటలు వడిగా వినిపించకుండా పోతున్నవి .
నా ఐడి: jprmvnvijay5 ఎట్ జీ మెయిల్ డాట్ కామ్
మీ పెద్ద వ్యాఖ్యకు మప్పిదాలు.
విజయ్
దయచేసి అచ్చ తెలుగు పదాలను విద్యార్థులకు బోధించు విధము తెలుపగలరు.
రిప్లయితొలగించండిదీనికి సంబంధించిన పూర్తి వివరణ కావాలి
రిప్లయితొలగించండిమన నుడిని చదివి మురిచాను
రిప్లయితొలగించండిఅన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు చదివాను. ఏదో ఆనందం. తెలుగులు ఏకమై తెలుగువెలుగును నలుదిశలా వ్యాపింపజేస్తారని ఆశిస్తూ....... మప్పిదాలు.
రిప్లయితొలగించండిImdulo konni dravida padalu unnavi... Avvi lekunda kooda Melimi Telugu padalu kooda unnay.
రిప్లయితొలగించండిEx: Naadu (Dravida), Dinam (Sanskrit), Roju (Urdu), Poddu (Melimi Telugu)
ఆదిపోసుకోడం
రిప్లయితొలగించండిఅర్థం చెప్పగలరు